Uttarakhand CM: భారత్‌ను అమెరికా పాలించిందా..? మా సిలబస్‌లో లేదే ఇదీ.. సీఎంపై నెటిజన్ల సెటైర్స్‌

Uttarakhand CM: ఇటీవల మహిళల వస్త్రదారణపై సంచలన కామెంట్స్‌ చేసిన వివాదాలకు కారణమైన ఆ ముఖ్యమంత్రి మరోసారి తప్పులో కాలేశారు..

Uttarakhand CM: భారత్‌ను అమెరికా పాలించిందా..? మా సిలబస్‌లో లేదే ఇదీ.. సీఎంపై నెటిజన్ల సెటైర్స్‌
Uttarakhand Cm
Follow us
K Sammaiah

| Edited By: uppula Raju

Updated on: Mar 22, 2021 | 1:11 PM

ఇటీవల మహిళల వస్త్రదారణపై సంచలన కామెంట్స్‌ చేసిన వివాదాలకు కారణమైన ఆ ముఖ్యమంత్రి మరోసారి తప్పులో కాలేశారు. ఇటీవల మహిళలు ధరించే చినిగిన జీన్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారాయన. తాజాగా భారత్‌ను అమెరికా 200 ఏళ్ల పాటు పాలించిందని ఆయన వ్యాఖ్యానించారు. డెహ్రాడూన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ మరోసారి నోరుజారారు.

రావత్ మాట్లాడుతూ.. ‘భారత్‌ను 200 ఏళ్ల పాటు పాలించిన అమెరికా నేడు కరోనాతో విలవిల్లాడుతున్నది. వైద్యరంగంలో ప్రపంచంలోనే యూఎస్ నెంబర్ వన్ దేశంగా ఉన్నది. కానీ అక్కడ కరోనా బారిన పడి యాభై లక్షలకు పైగా ప్రజలు చనిపోయారు. ఇప్పటికీ వాళ్లు దానిని అదుపుచేయలేక మళ్లీ లాక్‌డౌన్ వైపునకు అడుగులు వేస్తున్నారు’ అని అన్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మోడీ భారత ప్రధానిగా లేకుంటే పరిస్థితులు చాలా కఠినంగా ఉండేవని వ్యాఖ్యానించారు. కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడటంతో మోడీ ఎంతో కృషి చేస్తున్నారని రావత్ తెలిపారు. కొవిడ్‌ కట్టడికి చర్యలు తీసుకున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, కొందరు మాత్రమే మాస్కు ధరించడం, శానిటైజర్‌ వాడడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారంటూ ఆందోళన కూడా వ్యక్తం చేశారు.

కాగా బ్రిటన్ అనాల్సిన చోట అమెరికా అనడంతో రావత్ వ్యాఖ్యలపై నెట్టింట్లో తీవ్ర దుమారం రేగుతున్నది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. ‘అరే.. మా సిలబస్‌లో ఈ పాఠాలు ఎప్పుడూ చెప్పలేదే..?’ ‘ఇండియాను అమెరికా పాలించిందా..? ఇది నిజమా..?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల యువతుల వస్త్రధారణ విషయంపై తీరథ్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి షాకయ్యా. ఆ వేషధారణతో ఎన్జీవో విషయమై ప్రజలను కలవడానికి వెళితే.. సమాజానికి ఏం సంకేతాలిస్తున్నట్లు? మన పిల్లలకు ఏం సంకేతాలిస్తున్నట్లు? ఇదంతా ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. మనం ఏం చేస్తామో పిల్లులూ అదే చేస్తారు. మనం దేనిని ఫాలో అవుతామో… పిల్లలూ అదే ఫాలో అవుతారు.

ఇళ్లలో సంస్కృతి మూలాలను నేర్పించినట్లైతే, ఎంత ఆధునికంగా ఉన్నా పర్లేదు. జీవితంలో ఎన్నడూ వైఫల్యం చెందరు.’’ అని సీఎం తీరథ్ రావత్ పేర్కొన్నారు. ఈ పోకడలు లైంగిక వేధింపులు వైపు మళ్లే ప్రమాదం ఉందన్నారు. యువతీ యువకులు మోకాళ్లను చూపుతూ ఉండే జీన్స్ ధరించడం పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే అని పేర్కొన్నారు. పాశ్చాత్యులు మనల్ని అనుసరిస్తూ యోగా చేస్తూ, పూర్తిగా శరీరాన్ని కప్పేసే వస్త్రాలను వేసుకుంటుంటే… మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని తీరథ్ రావత్ వ్యాఖ్యానించారు.

అయితే ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగవని ఎంపీ జయాబచ్చన్‌ అన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. ఆయన మాటలు చేడు ఆలోచనలు మహిళలపై నేరాలను ప్రోత్సహించేలా ఉన్నాయని జయ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు.

ఇటు మహిళల నుంచి అటు సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి కామెంట్లపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో తీరథ్ సింగ్ రావత్.. తన కామెంట్లకు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటె తనను క్షమించాలన్నారు. అయితే జీన్స్ ధరించినా తనకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని, కానీ చిరుగుల జీన్స్ ధరించడాన్ని మాత్రం తాను అంగీకరించబోనని ఆయన చెప్పారు. ఈ రోజుల్లో పిల్లలు ఖరీదైన జీన్స్ ని కొనుగోలు చేసి ఇళ్లలో వాటికి చిరుగులు పెడుతున్నారని, ఇది తనను ఎంతో బాధిస్తోందని ఆయన చెప్పారు.

అసలు రిప్డ్ జీన్స్ ధరించడం మన భారతీయ సంస్కృతికి చిహ్నమా అని ఆయన ప్రశ్నించారు. తాను గ్రామీణ కుటుంబం నుంచి వచ్చానని, తన చిన్నతనంలో తన ప్యాంట్ ఎప్పుడైనా చిరిగి ఉంటే టీచర్లు కొడతారని భయపడుతూ ఉండేవాడినన్నారు. వెంటనే అలా చిరిగిన ప్యాంటును మళ్ళీ కుట్టించి స్కూలుకు వెళ్ళేవాడినని ఆయన చెప్పారు.

ఇక రిఫ్డ్‌ జీన్స్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం మర్చిపోకముందే తాజాగా మరోసారి తప్పులో కాలువేయడం సంచలనంగా మారింది. చూద్దాం.. నెటిజన్ల ట్రోలింగ్‌కు ఎలాంటి సమాధానం వస్తుందో మరి

Read More:

MLA Volleyball: మొన్న గొర్రెల కాపరి.. నేడు వాలీబాల్‌ ప్లేయర్‌.. స్ట్రైక్‌లు లిఫ్టులతో అదరగొట్టిన ఏపీ ఎమ్మెల్యే