Telangana Budget: కేంద్రానివన్నీ దొంగ లెక్కలే.. అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిప్పులు
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిప్పులు చెరిగారు. పెన్షన్ల విషయంలో బీజేపీ నేతలు దొంగ లెక్కలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఆసరా పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 11 వేల 724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చేది మాత్రం కేవలం సంవత్సరానికి రూ. 210 కోట్లు మాత్రమే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఈ డబ్బును 6 లక్షల మందికే ఇస్తున్నారని చెప్పారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 39 లక్షల 36 వేల 521 మందికి రాష్ర్ట ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వివరించారు. ఆసరా పెన్షన్ పథకం కింద లబ్ది పొందుతున్న వారి వివరాలు, ఖర్చుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో ఆసరా పెన్షన్ పథకం కింద 39,36,521 మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ కింద 13,19,300 మంది, వితంతువులు 14,43,648, వికలాంగులు 4,89,648, నేత కార్మికులు 37,342, కల్లుగీత కార్మికులు 62,942, హెచ్ఐవీ రోగులు 28,582, మలేరియా వ్యాధిగ్రస్తులు 14,410, బీడీ కార్మికులు 4,08,621, ఒంటరి మహిళలు 1,32,298ల మంది లబ్ది పొందుతున్నారని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఈ పథకానికి సంవత్సరానికి రూ. 11 వేల 724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పేద ప్రజల కోసం రాష్ర్ట ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఏ రాష్ర్టంలో కూడా ఇలాంటి పథకం అమలు కావడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, చేనేత కార్మికులతోపాటు మిగతా వారందరికీ ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఉమ్మడి ఏపీలో ఈ స్కీం కొద్దిమందికే పరిమితమై ఉండేది. ఇప్పుడు ఒంటరి మహిళలకు కూడా ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. 57 ఏండ్ల వారికి కూడా పెన్షన్ ఇచ్చే అంశం.. కరోనా కారణంగా ఆలస్యమైందని చెప్పారు. త్వరలోనే దీనిపై విధివిధానాలు ప్రకటిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆసరా పెన్షన్లు ఇస్తున్న తర్వాతే, ఇండ్లలో చాలా మంది వృద్ధులకు గౌరవం లభించింది. ఇది కేసీఆర్ వల్లే సాధ్యమైంది. వికలాంగులను, ఒంటరి మహిళలను గౌరవించింది సీఎం కేసీఆర్ ప్రభుత్వమే’’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
Read More:
Uttarakhand CM: భారత్‌ను అమెరికా పాలించిందా..? మా సిలబస్‌లో లేదే ఇదీ.. సీఎంపై నెటిజన్ల సెటైర్స్