Telangana Politics: ఆర్ఎస్ ప్రవీణ్‌పై మాట్లాడేందుకు జంకుతున్న ఆ TRS ఎమ్మెల్యేలు.. మతలబు ఏంటి?
ఆ మాజీ ఐపిఎస్ (RS Praveen Kumar) రాజీనామా చేసి ఒక పార్టీలో చేరి గులాబీ బాస్ కేసీఆర్‌పై అటాక్ చేస్తుంటే ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ సేవలకు రాజీనామా చేసి బీఎస్పీలో చేరి నేరుగా గులాబీ బాస్ కేసీఆర్‌ను అటాక్ చేస్తుంటే ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? తమ అధినేతను ఎవరైనా ఒక్క మాట అన్నా విరిచుకపడాల్సిన ఆ ఎమ్మెల్యేలు ఆయన విషయంలో మాత్రం ఎందుకు జంకుతున్నారు? పార్టీ కార్యాలయం నుండి సమాచారం వచ్చినా ఎందుకు సైడ్ అవుతున్నారు? ప్రవీణ్ కుమార్ విషయంలో వారి మౌనం వెనుక మతలబు ఏంటి? టీవీ9 తెలుగు స్పెషల్ స్టోరీ..
రాజకీయ నాయకుల లెక్కలే వేరుగా ఉంటాయి. అంతా కలిసికట్టుగా నడుస్తున్నట్లు బయటకు కనిపించినా.. అందులో ఎవరి లెక్కలు వారికుంటాయి. తమకు రాజకీయంగా నష్టం జరగదనుకున్న అంతసేపు కామ్ గానే ఉంటారు. చాప కింద నీరులా తమకు ఎసరు వస్తుందని అనుకున్నప్పుడు అంత ఎత్తుకు ఎగిరి పడతారు. ఎవరినీ వదలకుండా ఉతికి ఆరేస్తారు. ఇప్పుడు గులాబీ పార్టీలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ సేవలకు రాజీనామా చేసి బీఎస్పీ తీర్థంపుచ్చుకున్నారు. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఆయన వల్ల నష్టం చేకూరుతుందని పార్టీ పెద్దలు అంచనా వేసి అటాక్ చేయాలని ఆదేశాలిచ్చారట. అయితే ఆయనపై మాటల దాడి చేస్తే రాజకీయంగా తమకు ఎక్కడ నష్టం చేస్తుందోనని కొందరు గులాబి నేతలు కిమ్మనకుండా ఉన్నారట. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు.. బయటికి వచ్చి మాట్లాడిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాత్రం బద్నామ్ అయ్యారనే ప్రచారం బయట జరుగుతుంది. ప్రవీణ్ కుమార్‌ను విమర్శించేటంత పెద్దోడైపోయావా అంటూ ఓ ఆగంతకుడు గాదరికి ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం.
మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ నల్గొండ జిల్లాలో సభ పెట్టి టిఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ చేసాక టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుండి పార్టీలోని చాలా మంది దళిత ఎమ్మెల్యేలకు ఆర్‌ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలని సమాచారం వెళ్ళింది. పార్టీ నుండి మీడియాకు సంబంధిత ఎమ్మెల్యేల పేర్లతో మీడియా ఇన్విటేషన్ కూడా వచ్చింది. కానీ సిన్ కట్ చేస్తే.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే(గాదరి కిషోర్) మాత్రమే హాజరవ్వడంతో ఆ ఎమ్మెల్యేకు కాసేపు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఒకటి రెండు సార్లు వారికి ఫోన్ కూడా చేసి వాకబు చేసిన వారు రాకపోవడంతో చివరకు ఆయన ఒక్కడే మాట్లాడాల్సి వచ్చింది.. అదేంటి అని పార్టీలోని సిబ్బంది వాకబు చేయగా వివిధ కారణాల చెప్పి సైడ్ అయ్యారని సమాచారం..
అయితే మరుసటి రోజు కూడా తెలంగాణ భవన్‌లో సాయంత్రం మీడియా సమావేశం కాగా.. ఆ సమావేశంలో ఉన్న వారు కూడా ఆర్ ఎస్ ప్రవీణ్‌పై మాట్లాడకపోవడంతో పార్టీ పెద్దలకు క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా తమ తమ నియోజకవర్గాల్లో తమ కమ్యూనిటీ నుండి ఇబ్బందులు రావొద్దనే ఆయనపై విమర్శలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అందుకే రకరకాల కారణాలు చెప్తూ తప్పించుకున్నారు అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఒక వైపు బీఎస్పీలో చేరుతూ తమ ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దపై విమర్శలు చేస్తుంటే ఆ ఎమ్మెల్యే లు మాత్రం.. ఇంద్రవెళ్లిలో జరిగిన కాంగ్రెస్ సభపై అటాక్ చెయ్యడంలో మాత్రం ఎక్కడా తగ్గకపోవడం విశేషం.
Also Read..
సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం.. రైతుబంధుపై ఆర్. నారాయణ మూర్తి వ్యాఖ్యలు..
ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు .. పవన్ కళ్యాణ్ ఫోటోని మిస్ చేసిన నాగబాబు.. ఫీలవుతున్న ఫ్యాన్స్