కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో దూసుకెళుతున్న పల్లా.. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీ

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. ఈ నెల 14న జరిగిన వరంగల్‌ - ఖమ్మం - నల్లగొండ, హైదరాబాద్‌ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో..

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో దూసుకెళుతున్న పల్లా.. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీ
Follow us
K Sammaiah

|

Updated on: Mar 19, 2021 | 8:42 AM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. ఈ నెల 14న జరిగిన వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ, హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అధిక్యంలో దూసుకెళుతుంది. శుక్రవారం ఉదయం వరకు వరంగల్‌ స్థానంలో ఏడు, హైదరాబాద్‌ స్థానంలో ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. వరంగల్‌లో మొత్తం ఏడు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 1,10,840 ఓట్లు రాగా, తీన్మార్‌ మల్లన్నకు 83,290 ఓట్లు వచ్చాయి. ఇక టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం 70,072 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39,107 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,588 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లలో చెల్లని ఓట్లు 21,636 గుర్తించారు. ఇక ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.

మొదటి ప్రాధాన్య ఓటులో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. దీంతో తుది ఫలితాలు శనివారం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం 3,85,996 ఓట్లు పోలవగా, ఇప్పటి వరకు 3,35,961 ఓట్ల లెక్కింపు పూర్తయింది. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారు. కోదండరాం, తీన్మార్‌ మల్లన్నల మధ్య కూడా తేడా స్వల్పంగానే ఉండటంతో గెలుపు ఎవరిదనే అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇక హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. ఇప్పటి వరకు పూర్తైన ఐదు రౌండ్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య స్వల్ప తేడా కొనసాగుతోంది. ఐదు రౌండ్ల తర్వాత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి 6,555 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఈ స్థానంలో 5 రౌండ్లలో 2,80,030 ఓట్లను లెక్కించారు. ఇందులో చెల్లని ఓట్లు 16,712 ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఐదు రౌండ్లలో భాజపా అభ్యర్థి రామచందర్‌రావుకు 81,749, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్‌కు 42,604, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,440, తెదేపా అభ్యర్థి ఎల్‌.రమణకు 4,655 ఓట్లు పోలయ్యాయి.

మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కింపు పూర్తయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ ఎవరికీ వచ్చే అవకాశం లేదని అధికారులంటున్నారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి అని, మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీంతో తుది ఫలితం రావడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Read More:

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు.. నూతన బడ్జెట్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వెల్లువ

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కరోనా ఎఫెక్ట్.. అయినా భారీ బడ్జెట్‌.. ఏయే శాఖకు ఎంతెంత కేటాయించారంటే..