AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఆలా అయితే చెల్లదన్న ధర్మాసనం

రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. రాష్ట్రాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని ధర్మాసనం ఆగ్రహం..

ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఆలా అయితే చెల్లదన్న ధర్మాసనం
Supreme Court
K Sammaiah
|

Updated on: Mar 13, 2021 | 9:27 AM

Share

రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. రాష్ట్రాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంలో అధికారులుగా పనిచేస్తున్నవారిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల కమిషనర్లుగా నియమించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్ర ఎన్నికల సంఘాలు స్వతంత్రంగా పనిచేయాలన్న రాజ్యాంగ సూత్రాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అనుసరించాలని నిర్దేశించింది.

ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారికి ఎన్నికల కమిషనర్‌ బాధ్యతలను అదనంగా అప్పగించడం అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ హృషికేష్‌రాయ్‌లతోకూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి నేతృత్వం వహించే వ్యక్తి స్వతంత్రుడై ఉండాలని ధర్మాసనం పేర్కొంది. అందువల్ల ప్రభుత్వంలో అధికారిగా పనిచేస్తున్న వ్యక్తిని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించకూడదని స్పష్టంచేసింది.

గోవాలో న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తికి రాష్ట్ర ఎన్నికలకమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడం, రాష్ట్ర మున్సిపల్‌ చట్టం ప్రకారం వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోవడం కారణంగా అక్కడి మున్సిపల్‌ ఎన్నికలపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జారీచేసిన నోటిఫికేషన్‌ను కొట్టేస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని సవాల్‌చేస్తూ గోవా ప్రభుత్వం దాఖలుచేసిన అప్పీల్‌ను విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఎన్నికల కమిషనర్‌గా నియమించడానికి వీల్లేదని స్పష్టంచేసింది.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర న్యాయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అధికారి ఒకరికి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ గోవా ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్నది. దీనిపై బాంబే హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ గోవా సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించింది.

రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని స్వతంత్ర వ్యక్తి ఎస్‌ఈసీగా ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఎస్‌ఈసీగా విధులు నిర్వహించాలనుకుంటే ముందుగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ తర్వాత ఎన్నికల కమిషనర్‌ పదవిని చేపట్టవచ్చని వెల్లడించింది. మొత్తానికి రాష్ట్రాలు తమ ఇష్టానుసారం ఎస్ఈసీలను నియమించుకునేందుకు వీలు లేదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

Read More:

ఎన్నికల ఇంచార్జ్‌లతో మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్‌.. ఆ విషయంలో మంత్రి కీలక సూచనలు

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలపై పిటిషనర్ కు చక్కెదురు.. పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు

తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైంది.. ఆ ఘటనపై విచారణ జరిపించాలి.. నిర్మల్‌ కలెక్టర్‌కు మహిళా మోర్చా ఫిర్యాదు