కేంద్రం ఇస్తానన్న ఏడాదికి కోటి ఉద్యోగాలు ఏవి..? బీజేపీ నేతలను నిలదీయాలని మంత్రుల పిలుపు
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని అధికార పార్టీకి చెందిన మంత్రులు ఉధృతం చేశారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత..
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని అధికార పార్టీకి చెందిన మంత్రులు ఉధృతం చేశారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి సురభి వాణిదేవికి మద్దతుగా మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ కలిసి ప్రచారం నిర్వహించారు.
ముందుగా సనత్ నగర్ డివిజన్ లోని శ్యామలకుంట పార్క్ లో పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్ధించారు. అనంతరం బీకే గూడ లో గల సీనియర్ సిటీజన్స్ కార్యాలయంలో సీనియర్ సిటీజన్స్ తో కలిసి అల్పాహారం చేశారు. బేగంపేట లోని ఎయిర్ లైన్స్ కాలనీలో కాలనీ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అమీర్ పేటలోని కేకే బాంకేట్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ అభ్యర్ధి రాంచందర్ రావు తనకు ఓటేసి గెలిపించిన పట్టభద్రులకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నో సంవత్సరాలు గా అమలు కాని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక లక్ష 32 వేల 899 ఉద్యోగాలను వివిధ ప్రభుత్వ శాఖలలో భర్తీ చేయడం జరిగిందని, మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన తెలిపారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, పదోన్నతులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని, ఉద్యోగులు, పట్టభద్రులు తమ విలువైన ఓటును విద్యావంతురాలు, విద్యారంగం పై అపార అనుభవం కలిగిన సురభి వాణిదేవికి వేసి గెలిపించాలని కోరారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారవు కుమార్తె అయిన వాణిదేవిని ఎమ్మెల్సీగా అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ప్రచారంలో పట్టభద్రులు ఎంతో ఆదరణ, అభిమానాలు చూపిస్తున్నారని, ఆమె గెలుపు తధ్యం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఈ నెల 14 వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో తప్పని సరిగా ఓటు వేయాలని కోరారు.
తనపై ఎంతో నమ్మకం ఉంచి తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు సురభి వాణిదేవి కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగంపై తనకు 35 సంవత్సరాల అనుభవం ఉందని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేందుకు టీఆర్‌ఎస్ పార్టీ బలపరచిన సురభి వానిదేవిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఎలాంటి మచ్చలేని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవి గెలిపించుకోవడమే మనం పీవీ నర్సింహారావు గారికి నిజమైన నివాళులు అర్పించినట్లు అని ఆయన పేర్కొన్నారు. పీవీ నర్సింహారావు గారు దేశ ప్రధాని గా తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణల కారణంగా దేశం అభివృద్ధి లో పయనిస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమాలలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ టీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, షాప్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్లు కోలన్ లక్ష్మి, మహేశ్వరి, నామన శేషుకుమారి, షాబాద్ శ్రీనివాస్, సీనియర్ సిటిజన్స్ సహదేవ్ గౌడ్, దూబే, పార్ధసారధి, అనంతరెడ్డి, ఆర్సీ కుమార్, ఎయిర్ లైన్స్ కాలనీ కి చెందిన గోపాల్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More: