ITIR Controversy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాకరేపుతున్న ఐటీఐఆర్.. ఎవరి వాదన ఎలా వున్నా.. ఇప్పటి వరకు జరిగిందిదే!

ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమాని తెలంగాణకు ఐటీఐఆర్ ఇస్తామన్న రాష్ట్ర విభజన నాటి కేంద్ర ప్రభుత్వ హామీ తెరమీదికి వచ్చింది. తెర మీదికి రావడమే కాదు.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో...

ITIR Controversy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాకరేపుతున్న ఐటీఐఆర్.. ఎవరి వాదన ఎలా వున్నా.. ఇప్పటి వరకు జరిగిందిదే!
Follow us

|

Updated on: Mar 04, 2021 | 5:03 PM

ITIR issue rocks MLC elections in Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమాని తెలంగాణకు ఐటీఐఆర్ ఇస్తామన్న రాష్ట్ర విభజన నాటి కేంద్ర ప్రభుత్వ హామీ తెరమీదికి వచ్చింది. తెర మీదికి రావడమే కాదు.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దానికి దారితీసింది. బీజేపీ- టీఆర్ఎస్ నేతల ఆరోపణలు-ప్రత్యారోపణలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించాయి. హైదరాబాద్‌కు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వె‌స్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌) కేంద్రం మంజూరులో కేంద్ర ప్రభుత్వమే కారణమని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో వివాదం రాజుకుంది. తెలంగాణకు ఐటీఐఆర్ ఇవ్వనందుకు టీఆర్ఎస్ నేతలు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను తప్పు పడుతున్నాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేళ్ళుగా కనీసం ఐటీఐఆర్‌ కోసం డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా పంపలేదని బీజేపీ నేతలు ఎదురు దాడికి దిగారు. తమ వాదనకు కాగ్ నివేదిక ఆధారమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు కాకపోవడానికి కారణం.. రాష్ట్ర ప్రభుత్వంలో చిత్త శుద్ధి లోపించడమే కారణమని కంప్ట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఇచ్చింది. వీరిద్దరి మధ్య జరుగుతున్న వాదోపవాదాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణలో ఐటీఐఆర్ ప్రాజెక్టుపై రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మీదే తప్పు అంటే కాదు మీదేనంటూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ నేతలు వాదులాడుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అసలు ఐటీఐఆర్ అంటే ఏంటి..ఆ ప్రాజెక్టు కథ ఎంత వరకు వచ్చిందో చూద్దాం. ఐటీఐఆర్ అంటే…ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వె‌స్టమెంట్‌ రీజియన్‌. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఐటీఈఎస్, ఈహెచ్ఎం (ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ మ్యానుఫాక్చరింగ్) యూనిట్లలో పెట్టుబడులకు ఊతమివ్వాలని కేంద్రం నిర్ణయించింది. 2008 మే 28న దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ల ఏర్పాటుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యునికేషన్ (ఐటీ అండ్ సీ) విభాగాన్ని నోడల్ ఏజెన్సీని ఏర్పాటును ఆనాటి యునైటెడ్ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. 2010 జనవరిలో కేంద్రానికి డీపీఆర్‌ను సమర్పించారు. 2012 ఆగస్టులో హై పవర్ కమిటీకి (హెచ్ పీసీ)కి ముందుకు ఐటీఐఆర్ ప్రతిపాదన వెళ్ళింది. అనంతరం ఏపీ ఐటీఐఆర్ డీపీఆర్‌కు ప్రాథమికంగా ఆమోదం లభించింది. అంతిమ ఆమోదం కోసం కేబినెట్ కమిటీ ఫర్ ఎకనమిక్ అఫైర్స్ (సీసీఈఏ)కు డీపీఆర్‌ను పంపారు.

హైదరాబాద్ చుట్టూ వివిధ క్లస్టర్లలో ఐటీ, హార్డ్ వేర్, ఈఎస్డీఎం పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా ఐటీఐఆర్ ప్రతిపాదన జరిగింది. ఫలక్ నుమా నుంచి ఎయిర్ పోర్టు వరకు ఎంఎంటీఎస్, మెట్రో రైల్ పొడిగింపును ప్రతిపాదించారు. రేడియల్ రోడ్ల అభివృద్ధి లాంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. యుద్ధప్రాతిపదికన అధికారుల కసరత్తు జరిపారు. రీజియన్‌లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నంలోనూ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. విశాఖ కంటే ముందే హైదరాబాద్ ఏరియాలో అందుబాటులోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుదల ప్రదర్శించింది. హైదరాబాద్ పరిసరాల్లో అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలను వినియోగించాలని తలపెట్టారు.

ఐటీఐఆర్ విషయంలో పట్టుదలగా వున్న తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్ ఇప్పటికి మూడు సార్లు ఐటీఐఆర్‌పై అధికారులతో సమీక్షా జరిపారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించారు. ఐటీఐఆర్‌పై యుద్ధప్రాతిపదికన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (డీపీఆర్)ను రూపొందించారు. భూ సేకరణ ప్రక్రియకు సిద్దమైంది. ఏ ప్రాంతాలను ప్రాజెక్టు కేంద్రాలుగా చేయాలన్న అంశంపై చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉన్న భూముల్లో అభివృద్ధిని కొనసాగించడం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ అభివృద్ధి చేయడం, ప్రస్తుతమున్న నివాసాలు, ప్రజలను గ్రోత్ కారిడార్ ద్వారా అనుసంధానించడం, హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో ఐటీఐఆర్ మాస్టర్ ప్లాన్‌ను చేర్చడం, సహజమైన అనుకూలతలతో ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడం వంటివి ఐటీఐఆర్ ప్రాజెక్టులో చేర్చారు.

ఐటీఐఆర్ ప్రాంతంలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రీజియన్‌లోనే స్కూళ్లు, కళాశాలలు, ఆసుపత్రుల వంటి సదుపాయాలు కల్పించనున్నారు. మంచినీరు, విద్యుత్తు, మురుగునీటి పారుదల ఏర్పాటు చేయనున్నారు. రహదారుల వ్యవస్థలను ఆధునాతనంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించారు. 4జీ సేవలు కల్పించాలని ముందుగా ప్రతిపాదించారు. కానీ ఇపుడు దీనిని 5జీ కి మార్చాలని ప్రతిపాదిస్తున్నారు. కేబుల్స్ వేయడం, టవర్ల నిర్మాణం వంటి పనులు చేపడతారు. మునిసిపాలిటీల్లో ఇప్పటికే 70 శాతానికి పైగా పనులు పూర్తి అయ్యాయి. హైదరాబాద్‌లో 50 శాతం పనులు పూర్తయ్యాయి. ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన రహదారులతో హైదరాబాద్‌లో కేబుళ్లు వేయడంలో ఆటంకాలు తలెత్తాయి.

క్వార్టర్లీ నివేదికను కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖకు పంపలేదనే విమర్శ తాజాగా మొదలయ్యాయి. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును తీసుకురాలేని బీజేపీ అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడంతో వివాదం తలెత్తింది. ఐటీఐఆర్‌ గురించి బండి సంజయ్‌ రాసిన లేఖ ఓ అబద్ధాల జాతరంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా కేంద్రం పక్కన పెట్టేసిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఐటీఐఆర్‌ ప్రాజెక్టు కోసం టీఆర్‌ఎస్‌ ప్రయత్నం చేస్తోందని చెబుతున్నారు గులాబీ దళం చెబుతోంది. జూన్‌, 2014లో ఐటీఐఆర్‌పై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ మొదటి సారి లేఖ రాశారు. సెప్టెంబరు, 2014లో పూర్తి వివరాలతో కేంద్రానికి మరో వినతిపత్రం అంద జేశారు. ఆ తర్వాత ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఈ అంశాన్ని ప్రధాని ముందు కేసీఆర్ లేవనెత్తేవారు. ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఫ్యూచర్ సీఎంగా ప్రొజెక్టవడం ప్రారంభమయ్యాక కేటీఆర్ కూడా కేంద్ర ఐటీ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చొచ్చారు.

2017లో ఐటీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం రివ్యూ మీటింగ్ నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం చొరవ నిరాశాజనకంగా కేంద్ర మంత్రులు పలు మార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేయకుండా.. ప్రధానికి, దత్తాత్రేయకు లెటర్ రాసిందనే వాదన తెరమీదికి తెచ్చారు కమలనాథులు. నిర్మాణాత్మకంగా రైల్వే, ఎంఎంటీఎస్, రేడియల్ రోడ్లు డెవలప్ చేయలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) 2017 నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని బీజేపీ నేతలు హైలైట్ చేస్తున్నారు.

ఐటీఐఆర్‌లో భాగంగా హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు ఓఆర్ఆర్ ద్వారా రెండు మార్గాల్లో అనుసంధానం చేయాలని తలపెట్టారు. హైటెక్ సిటీ కేంద్రంగా నార్త్- వెస్ట్ (వాయువ్యం) 86.70 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో ఐటీఐఆర్ జోన్ ఒకటిని ప్రతిపాదించారు. జోన్ 2 ఐటీఐఆర్ దక్షిణ ప్రాంతంలో వుంటుంది. ఇందులో హార్డ్ వేర్ పార్క్, ఫ్యాబ్ సిటీ, ఏఐఐఐసీ వర్క్ సెంటర్ ఏర్పాటును ప్రతిపాదించారు. మహేశ్వరం మండలం పరిధిలో ఉన్న ఈ జోన్ మొత్తం విస్తీర్ణం 79.22 చదపు కి.మీ.లు. ఐటీఐర్ మూడో జోన్ నార్త్-ఈస్టర్న్ విభాగంగా పరిగణిస్తున్నారు. పోచారం నుంచి ఉప్పల్ మున్సిపాలిటీ ప్రాంతాలలోని నేషనల్ హైవే 202తో కలుపుతున్న అంతర్గత కారిడార్ ఇది. దీని విస్తీర్ణం 10.25 చ.కి.మీ.లు. ఐటీఐఆర్‌లో పశ్చిమ ప్రాంత విస్తీర్ణం 11.50 చ.కి.మీ.లు. దీనిని జోన్ నాలుగుగా పరిగణిస్తూ.. జోన్ 1, జోన్ 2 ప్రాంతాలతో జోన్ 4 ప్రాంతం ఓఆర్ఆర్ వెంబడి అనుసంధానించాలని తలపెట్టారు. హైదరాబాద్ నగరానికి తూర్పు ప్రాంతంలో అయిదో జోన్ ఏర్పాటును ప్రతిపాదించారు. జోన్ 2 ప్రాంతం, జోన్ 3 ప్రాంతం ఓఆర్ఆర్ వెంబడి అనుసంధానిస్తూ 14.32 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని తలపెట్టారు.

ALSO READ:  విజయవంతంగా కోవిడ్ వ్యాక్సినేషన్.. మరికొన్ని రకాల వ్యాక్సిన్లకు త్వరలో అనుమతులు

ALSO READ: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం.. దానిపై వున్న నియంత్రణ ఎత్తవేత