Covid Vaccination: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం.. దానిపై వున్న నియంత్రణ ఎత్తవేత

కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు ఉన్న ఓ నిబంధనను ఎత్తివేసింది. ఈ వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఓ ట్వీట్ పోస్టు చేశారు.

Covid Vaccination: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం.. దానిపై వున్న నియంత్రణ ఎత్తవేత
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 03, 2021 | 6:12 PM

Government crucial decision on corona vaccination: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వేగాన్ని పుంజుకుంటోంది. మార్చి ఒకటిన ప్రారంభమైన రెండో విడత వ్యాక్సినేషన్‌కు భారీ స్పందన లభిస్తోంది. దాంతో కేంద్ర ప్రభుత్వం బుధవారం (మార్చి 3న) కీలక ప్రకటన చేసింది. గత రెండు రోజులుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. ఇకపై 24 గంటలు కొనసాగించుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న ఆసుపత్రులు, లాబోరేటరీలు తమ కన్వీనియెన్స్ ప్రకారం వేళలను నిర్ణయించుకోవచ్చని, అవసరాన్ని బట్టి 24 గంటలూ వ్యాక్సినేషన్ కొనసాగించవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

కోవిన్ పోర్టల్‌లో సమయాన్ని పేర్కొన్నప్పటికీ.. ఆ సమయం కంటే ముందుగానీ.. ఆ సమయం తర్వాత గానీ వ్యాక్సిన్ పంపిణీ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రుల సామర్థ్యాన్ని బట్టి వ్యాక్సిన్ పంపిణీ సమయాలను ఆసుపత్రులు, లాబోరేటరీల వారే నిర్దేశించుకోవచ్చన్నారు. ఇలాంటి సమయాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందిస్తే సరిపోతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ భారీగా నిల్వ చేసుకోవద్దని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మంత్రి నిర్దేశించారు. కాగా ఇప్పటివరకు దేశంలో కోటి 56లక్షల మందికి కోవిడ్‌ వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోనే ఉన్నట్లు తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. నిత్యం సగటున 15వేల కేసులు నమోదవుతున్నప్పటికీ, రోజువారీ కొవిడ్‌ మరణాల సంఖ్య గణనీయం తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కోవిడ్‌ మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, దిల్లీ, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లోనూ కరోనా మరణాలు సంభవించలేదని వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 98 మంది కోవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేవలం 4 రాష్ట్రాల్లోనే 88 శాతం మరణాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం (మార్చి 2న) ఒక్కరోజే మహారాష్ట్రలోనే అత్యధికంగా 54 మంది మృత్యువాతపడ్డారు. కేరళలో 16, పంజాబ్‌లో 10 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మంగళవారం నాడు 14,989 కేసులు నమోదు కాగా, వీటిలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 7863 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కేరళలో 2938, పంజాబ్‌లో 729 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. కేరళ, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో క్రియాశీల కేసులు తగ్గాయి, మహారాష్ట్ర, పంజాబ్‌, దిల్లీ, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో మాత్రం ఇవి క్రమంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

ALSO READ: తమిళనాట రంజుగా రాజకీయం.. అన్నా డిఎంకేపై బీజేపీ గుస్సా.. చిన్నమ్మతో చెలిమికి ఛాన్స్!

ALSO READ: హైకమాండ్‌కు మరోసారి షాకివ్వనున్న అసంతృప్త నేతలు.. త్వరలో భేటీ.. ఆ వెంటనే గట్టి సందేశం