AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AMMK-BJP Friendship: తమిళనాట రంజుగా రాజకీయం.. అన్నా డిఎంకేపై బీజేపీ గుస్సా.. చిన్నమ్మతో చెలిమికి ఛాన్స్!

తమిళనాడులో నాలుగో కూటమి ఏర్పాటు కానున్నదా? అందుకు చిన్నమ్మ శశికళే సారథ్యం వహించబోతున్నారా? బీజేపీ కూడా చిన్నమ్మతో స్నేహం కోసం వెయిట్ చేస్తోందా? తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి.

AMMK-BJP Friendship: తమిళనాట రంజుగా రాజకీయం.. అన్నా డిఎంకేపై బీజేపీ గుస్సా.. చిన్నమ్మతో చెలిమికి ఛాన్స్!
Rajesh Sharma
|

Updated on: Mar 03, 2021 | 4:01 PM

Share

Fourth Front in Tamilnadu with BJP and AMMK: తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పోలింగుకు మరో నెల రోజులే వున్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, ఎత్తులు, సీట్ల సర్దుబాట్ల తకరారు కొనసాగుతోంది. ఎవరు ఎవరితో కలిసి వుంటారో.. ఎవరు ఎవరితో ఎందుకు విడిపోతారో తెలియని కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఈ క్రమంలోనే అనూహ్య రీతిలో కమలనాథులు.. చిన్నమ్మతో జతకట్టే సంకేతాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. శశికళ పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి దినకరన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రహస్యంగా కల్వడమే ఈ ఊహాగానాలకు తెరలేపింది.

రాష్ట్ర శాసనసభకు ఏప్రిల్ ఆరో తేదీన ఎన్నికలు జరగనున్న నేపత్యంలో తమిళ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. అధికార అన్నా డిఎంకే, విపక్ష డిఎంకే కూటముల్లో సీట్ల సర్దుబాట్లు తుది అంకానికి చేరుకున్నాయని భావిస్తున్న సమయంలో సరికొత్త పొత్తులపై ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఆసక్తికర పరిణామాలు, అనూహ్య భేటీలు, తెరచాటు మంతనాలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం పెద్ద పార్టీగా మూడో కూటమి రెడీ అవుతుండగా.. అందులో చేరే అవకాశాలు మూసుకుపోవడంతో చిన్నమ్మ నాలుగో కూటమి దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్ పలువురు నేతలతో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు.

రెండు ప్రధాన కూటములు అన్నా డిఎంకే, డిఎంకేలలో టిక్కెట్ దక్కని వారు, అసంతృప్త నేతలతో దినకరన్ టచ్‌లో వుంటున్నారు. అదే సమయంలో ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో దినకరన్ భేటీ అవడం ఆసక్తికరమైన పరిణామం. అన్నా డిఎంకేతో సీట్ల సర్దుబాటు పెద్ద తలనొప్పిగా మారడంతో బీజేపీ మరో మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు అమిత్ షా దినకరన్‌తో భేటీకి అంగీకరించడం ద్వారా తెలుస్తోంది. అతి తక్కువ స్థానాలను ఆఫర్ చేస్తోన్న అన్నా డిఎంకేను వదిలేసి.. నాలుగో కూటమిలో చేరేందుకు బీజేపీ కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కథనాలే నిజమైతే.. బీజేపీ రూపంలో శశికళకు పెద్ద ఊపే లభించే ఛాన్స్ వుంది. అయితే ఇక్కడే ఇంకో కథనం కూడా తెరమీదికి వస్తోంది. తమిళనాడులో ఏఎంఎంకే నేతలకు 15 సీట్లు ఇస్తామని, వారంతా బీజేపీ గుర్తుపైనే పోటీ చేయాలని అమిత్ షా షరతు విధించినట్లు తెలుస్తోంది. దీనికి దినకరన్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో బంతి శశికళ కోర్టుకు చేరినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుండగా.. మూడో కూటమిగా భావిస్తున్న కమల్, శరత్ కుమార్ వర్గం.. శశికళకు షాకిచ్చినట్లు తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. మూడో కూటమి ఏర్పాటుకు ముందుగా శశికళే వ్యూహం పన్నినా.. చివరికి కమల్ హాసన్ అవినీతి మచ్చ వద్దని శరత్ కుమార్‌ను వారించడంతో థర్డ్ ఫ్రంట్‌లోకి చిన్నమ్మ ఎంట్రీకి దారులు మూసుకుపోయాయి. డీఎంకే కూటమి నుంచి వైదొలగిన ‘ఇండియా జననాయక కట్చి’మూడో కూటమిని ఏర్పాటు చేసి అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన నటుడు శరత్‌కుమార్‌ అధ్యక్షునిగా ఉన్న ’సమత్తువ మక్కల్‌ కట్చి’ని చేర్చుకుంది. ఆ మరుసటి రోజునే ఐజేకే అధ్యక్షుడు రవి పచ్చముత్తు, శరత్‌కుమార్‌ ‘మక్కల్‌ నీది మయ్యం’అధ్యక్షులు కమల్‌హాసన్‌ను కలుసుకుని మూడో కూటమిలోకి ఆహ్వానించారు. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండమని ఆఫర్‌ కూడా ఇచ్చారు. ఇందుకు సమ్మతించిన కమల్‌.. శశికళ ఎంటరవకుంటేనే తాను మూడో కూటమి సీఎం అభ్యర్థిగా ప్రొజెక్టు అవుతానని కండీషన్ పెట్టినట్లు చెప్పుకుంటున్నారు.

మూడో కూటమి ప్రతిపాదనను ముందుగా తీసుకువచ్చిన శశికళ తానే చొరవ చూపి.. శరత్ కుమార్‌ను కమల్ హాసన్ వద్దకు పంపగా.. కమల్ హాసన్ ఆమె జైలు శిక్షను ఉటంకిస్తూ అవినీతి మచ్చ మూడో కూటమికి వద్దని షరతు పెట్టినట్లు సమాచారం. శరత్ కుమార్ కూడా శశికళ కంటే కమల్ హాసనే ముఖ్యమన్న ఉద్దేశంతో చిన్నమ్మను అవాయిడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక థర్డ్ ఫ్రంట్‌లోకి తన పార్టీకి ఎంట్రీ లేదని గుర్తించిన చిన్నమ్మ.. బీజేపీవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా శశికళ పార్టీ పట్ల సానుకూలంగా వుందనడానికి అమిత్ షా ప్రతిపాదనే కారణంగా కనిపిస్తోంది.

ఇదే గనక జరిగితే.. తమిళనాట ఉద్భవించబోయే.. నాలుగో కూటమిలో బీజేపీతోపాటు ఏఎంఎంకే కూడా వుండే అవకాశం వుంది. అదే సమయంలో అన్నా డిఎంకే, డిఎంకే కూటముల్లో అసంతృప్త నేతలకు గాలమేయడం ద్వారా నాలుగో కూటమిని బలోపేతం చేసుకునేందుకు చిన్నమ్మ వ్యూహరచన చేస్తోంది. తమ కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు కోసం భారీ ఎత్తున మనీ ఇస్తామన్న సంకేతాలను కూడా దినకరన్ ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తద్వారా తమిళనాట ఎన్నికలంటే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే పోటీ అనే ఆనవాయితీకి తమ కూటమి ఏర్పాటుతో తెరదించాలని చిన్నమ్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతర్గత కీచులాటతో నష్టపోయి ప్రభుత్వాన్ని డీఎంకే చేతుల్లో పెట్టేకంటే శశికళతో సర్దుకుపోవడమే మేలని బీజేపీ ఇప్పటికే అన్నాడీఎంకే నాయకులకు సూచించగా.. వారు విముఖత ప్రదర్శించినట్లు సమాచారం. మరోవైపు సీట్ల కేటాయింపు వ్యవహారంలో అన్నాడీఎంకేపై బీజేపీ అసంతృప్తితో ఉంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న టీటీవీ దినకరన్‌ చెన్నైలో అమిత్‌షాను రహస్యంగా కలిశారు. ఏఎంఎంకేకు 10–15 సీట్లు ఇస్తాం, అయితే కమలం చిహ్నంపై పోటీచేయాలని అమిత్‌షా షరతు విధించినట్లు తెలుస్తోంది. దీంతో నాలుగో కూటమిలో బీజేపీ చేరడం ఖాయమని దినకరన్‌ ధీమాతో ఉన్నారు. అయితే బీజేపీ చిహ్నంపై పోటీ చేసేందుకు మాత్రం దినకరన్‌ ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. ఇందువల్లే ఏఎంఎంకే, బీజేపీ చర్చల్లో అడుగు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.

అన్నాడీఎంకే, బీజేపీలకు వెల్‌కమ్: ఏఎంఎంకే

బీజేపీ-ఏఎంఎంకే స్నేహం చిగురుస్తుందన్న సంకేతాల నేపథ్యంలో బుధవారం ఏఎంఎంకే నేత దినకరన్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. తమ పార్టీ సారథ్యంలో ఏర్పాటవుతున్న నాలుగో కూటమిలోకి అన్నా డిఎంకే, బీజేపీలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏఎంఎంకే సారథ్యంలో నాలుగో కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏఎంఎంకే–అన్నాడీఎంకే మధ్య రహస్య సయోధ్య వ్యూహంపై ప్రస్తుతానికి ఏమీ చెప్పకూడదంటూ మరో వెరైటీ కామెంట్ కూడా చేశారాయన. డీఎంకే అధికారంలోకి రాకుండా అడ్డుకోవమే లక్ష్యంగా ఎన్నికలను ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే, బీజేపీలను సైతం తమ నాలుగో కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.

ఇదిలా వుండగా… అన్నా డిఎంకే-బీజేపీలు తమ ఎస్.ఎం.కే. పార్టీని, తమ పార్టీ అధినేత, నటుడు శరత్ కుమార్‌ను ఘోరంగా అవమానించారని సినీ నటి రాధిక ఆరోపించారు. అందుకే ఆ కూటమిని వీడి.. మూడో ఫ్రంట్ ఏర్పాటుకు కమల్ హాసన్‌తో జత కట్టినట్లు ఆమె వెల్లడించారు. తమ ఎస్.ఎం.కే. పార్టీని తక్కువ అంఛనా వేస్తున్న వారికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని ఆమె వ్యాఖ్యానించారు. తమకు ఏ స్థాయిలో ప్రజా బలం వుందో చాటుతామని ఆమె ఛాలెంజ్ చేశారు.