స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీ ప్రాణాలకే రిస్క్..
మీరు రోజు స్నానం చేసే నీటి ఉష్ణోగ్రత మీ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మీకు తెలుసా? వేడి నీటితో స్నానం చేస్తే కండరాలకు హాయిగా ఉన్నా.. అది గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియక చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. వేడి నీరు మంచిదా? చల్లటి నీరు మంచిదా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలు ఇక్కడ ఉన్నాయి.

ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారం ఎంత ముఖ్యమో, వ్యక్తిగత పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. పరిశుభ్రతలో స్నానం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మన దినచర్యలో భాగం. అయితే స్నానం చేసేటప్పుడు నీటి ఉష్ణోగ్రత విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. కొందరు వేడి నీటిని ఇష్టపడితే, మరికొందరు చల్లటి నీటితో స్నానం చేస్తారు. అసలు ఏది ఆరోగ్యానికి మంచిది? ఈ విషయంలో ఢిల్లీలోని ధర్మశిల నారాయణ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యనిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
గోరువెచ్చని నీటి ప్రయోజనాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 37 నుండి 40°C మధ్య ఉండే గోరువెచ్చని నీరు స్నానానికి ఉత్తమమైనది. వేడి నీటి స్నానం రక్త నాళాలను వెడల్పు చేసి, రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఇది సహాయపడుతుంది. మంచి నిద్ర పట్టేలా చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
వేడి నీటితో నష్టాలు
చాలా వేడి నీటితో స్నానం చేయడం ప్రమాదకరం. ఎక్కువ వేడి నీరు చర్మంపై ఉండే రక్షిత కొవ్వు పొరను కరిగించి, చర్మాన్ని పొడిగా మారుస్తుంది. తామర ఉన్నవారికి ఇది మరింత హానికరం. వృద్ధులకు లేదా రక్తపోటు సమస్యలు ఉన్నవారికి అతి వేడి నీరు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చల్లటి నీటి ప్రయోజనాలు
10 నుండి 15 డిగ్రీలు ఉష్ణోగ్రత కలిగిన నీటితో స్నానం చేయడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్త నాళాలను కుంచించుకుపోయేలా చేసి, కండరాల వాపును తగ్గిస్తుంది. అలా, ఎండార్ఫిన్‌లను విడుదల చేయడం వల్ల స్నానం తర్వాత చాలా శక్తివంతంగా అనిపిస్తుంది.
చల్లటి నీటితో నష్టాలు
గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారికి అకస్మాత్తుగా చల్లటి నీరు తగలడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వేసవిలో చల్లటి నీరు, చలికాలంలో గోరువెచ్చని నీరు వాడటం సాధారణం. కానీ మీ వయస్సు, శారీరక స్థితిని బట్టి నీటి ఉష్ణోగ్రతను ఎంచుకోవడం మంచిదని డాక్టర్ గౌరవ్ జైన్ సూచిస్తున్నారు.
