Aghori Remand: జైల్లోనూ వర్షిణితో కలిసుంటా..! మరో బాంబు పేల్చిన లేడీ అఘోరీ..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీని పోలీసులు ఎట్టకేలకూ అరెస్ట్ చేశారు. మంగళవారం యూపీలో అఘోరీతో పాటు ఇటీవల తనను పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరినీ హైదరాబాద్ తరలించారు. పూజల పేరుతో రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారని...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీని పోలీసులు ఎట్టకేలకూ అరెస్ట్ చేశారు. మంగళవారం యూపీలో అఘోరీతో పాటు ఇటీవల తనను పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరినీ హైదరాబాద్ తరలించారు. పూజల పేరుతో రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారని, మరో 5 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఓ మహిళ ఫిబ్రవరిలో మోకిలా పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు అఘోరిపై చీటింగ్, బెదిరింపుల కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు అఘోరీ యూపీలో ఉన్నట్లు గుర్తించి అక్కడికెళ్లి పట్టుకొచ్చారు.
హైదరాబాద్ తీసుకొచ్చిన అనంతరం మోకిలా పోలీసులు దాదాపు 2 గంటల పాటు అఘోరీని ప్రశ్నించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా నడిచింది. తన తరఫున వాదించడానికి లాయర్లు లేరని.. తనకు అంత స్తోమత లేదని అఘోరీ న్యాయమూర్తికి తెలిపింది. దీంతో కోర్టు తరఫున ఒక అడ్వొకేట్‌ను కేటాయించారు. అనంతరం.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
అరెస్టు అనంతరం స్పందించిన లేడీ అఘోరీ సంచలన కామెంట్లు చేసింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కోర్టుకు సహకరిస్తున్నానని చెప్పింది. అయితే జైలుకు వెళ్లినా తన భార్య వర్షిణితోనే ఉంటానని తేల్చి చెప్పింది. కొంతకాలంగా అఘోరీ, వర్షిణిల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ కూతురిని మాయమాటలతో లోబరుచుకుని, కేదార్నాథ్ తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని వర్షిణి కుటుంబం ఆరోపిస్తుంది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. తమను ఎవరైనా అరెస్టు చేయాలని చూస్తే, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తూ ఈ జంట ఓ సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసింది.
ఇదిలా ఉంటే బెయిల్ కోసం త్వరలోనే పిటిషన్ ఫైల్ చేస్తానని అఘోరీ తరఫు లాయర్ ప్రకటించారు. మరోవైపు అఘోరీని ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అఘోరీ జైలుకెళ్లడంతో వర్షిణి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడింది.
