AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Cabinet: రేపు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. ఆర్థిక వ్యవస్థపై ఫోకస్.. లాక్‌డౌన్ సడలింపు, వ్యవసాయంపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జూన్ 8వ తేదీన జరగనుంది. లాక్‌డౌన్‌ను మరింత సడలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Telangana Cabinet: రేపు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. ఆర్థిక వ్యవస్థపై ఫోకస్.. లాక్‌డౌన్ సడలింపు, వ్యవసాయంపైనే ప్రధాన చర్చ!
Balaraju Goud
|

Updated on: Jun 07, 2021 | 6:51 AM

Share

Telangana Cabinet on June 8: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జూన్ 8వ తేదీన జరగనుంది. లాక్‌డౌన్‌ను మరింత సడలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు జనం రాకపోకలకు అనుమతించాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో నిర్వహించనున్న మంత్రి మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో వైద్యం, కరోనా పరస్థితులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి‌తో మరికొన్ని అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశముంది.

అలాగే, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా.. ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశముంది. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతుబంధుపై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.

ముఖ్యంగా లాక్‌డౌన్‌ మూడో విడతపై గత నెల 30న మంత్రి మండలి సమావేశమైంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత ఇళ్లకు చేరుకునేందుకు గంటసేపు అనుమతించింది. గత నెల 31 నుంచి ఇది అమలవుతోంది. మూడో విడత లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 9తో ముగుస్తుండటంతో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి మండలి మరోసారి సమావేశమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలతో దుకాణాలు, వ్యాపార సముదాయాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నడుస్తున్నాయి. వ్యాపారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనుమతి వేళలను సాయంత్రం 5 గంటల వరకు పెంచి, ఇళ్లకు తిరిగి వెళ్లడానికి మరో గంట అనుమతించాలనుకుంటోంది. ఇదే క్రమంలో రాత్రిపూట పకడ్బందీగా కర్ఫ్యూ అమలు చేయనుంది.

కరోనా థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో.. థర్డ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత తగు ఏర్పాట్ల మీద కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కరోనాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ప్రధానంగా టీకాల లభ్యత, కేంద్ర విధానాలపై చర్చించనున్నారు. గ్లోబల్‌ టెండర్లకు స్పందన లేకపోవడంతో నేరుగా సంస్థలతో చర్చించి, చౌకధరలకు కొనుగోళ్లు జరపాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆంక్షల అమలుతో పాటు హైరిస్క్‌ ఉన్నవారికి, సూపర్ స్పెడర్లకు టీకాల కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహిస్తోంది. ఐటీ ఉద్యోగులు, ఇతరులకూ వ్యాక్సిన్లు పెద్దసంఖ్యలో వేస్తున్నారు. మరోవైపు, కరోనా పరీక్షలను సైతం ముమ్మరం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత తగ్గింది. ఇంజక్షన్లు, మందులు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో 19 డయాగ్నస్టిక్ సెంటర్లను ఇవాళ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఆ ప్రారంభ కార్యక్రమం రెండు రోజులు వాయిదా పడింది. ఆ డయాగ్నస్టిక్ సెంటర్లను జూన్ 9 నుంచి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు, వివిధ కార్యక్రమాలు, పథకాల అమలు దృష్ట్యా ఆదాయం పెరగాల్సిన అవసరం ఉండడంతో లాక్‌డౌన్‌ సడలింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు వెసులుబాటు ఇస్తే రిజిస్ట్రేషన్లు, రవాణా, ఆబ్కారీ తదితర శాఖల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. రాష్ట్ర కేబినెట్ సమావేశం నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌.. లాక్‌డౌన్‌ వల్ల కరోనా నియంత్రణ ఎంతవరకసాధ్యమైంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు ప్రభావితమైందనే అంశాలపై ఆర్థిక, వైద్య ఆరోగ్యం, పోలీసు, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ తదితర శాఖల నుంచి నివేదికలు కోరారు. సీఎం కేసీఆర్‌.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వారికి ఫోన్‌ చేస్తున్నట్లు తెలిసింది.

మరోవైపు ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. నీటిపారుదల శాఖలో అదనపు ఆయకట్టు కోసం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం, వాటి పురోగతి, మరమ్మతులు, నిర్వహణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయడం వంటి అంశాలూ మంత్రి మండలి సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ నెల 15 నుంచి రైతుబంధు సాయం పంపిణీ, వానాకాలం సీజన్‌కు ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సరఫరా, ఆయకట్టు పెరుగుదల, కల్తీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించనుంది. రాష్ట్రంలో కల్తీ విత్తనాల నిరోధం కోసం క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత విధానం, బయో ఫెర్టిలైజర్స్‌నూ చట్టపరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత విత్తన విధానం, బయో ఫెర్టిలైజర్స్‌కు సంబంధించి ఆర్డినెన్స్‌లకు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు కొత్త ఉద్యోగ నియామకాలు, ఇతర విధాన నిర్ణయాలు తీసుకోనుంది.

Read Also… Etela Rajender: ఈటల రాజేందర్ బీజేపీలో చేరే ముహూర్తం ఫిక్స్.. జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం.. ఎప్పుడంటే..?