Chiranjeevi: పాలిటిక్స్ లో మెగాస్టార్ మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా..? మెగా ఫ్యాన్స్ తీర్మానాల వెనుక ఎవరున్నారు?
మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? తమ్ముడి పార్టీలోనే చేరబోతున్నారా? ఈరోజు జరిగిన మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనం సంచలన తీర్మానాలు చేయడం వెనుక ఎవరున్నారు? మెగా-పవర్ కలిస్తే.. పొలిటికల్ పవర్ సాధ్యమేనా?
మెగా బ్రదర్స్ ఒక్కటయ్యారా? జనసేనే తమకు జీవనాడి అని భావిస్తున్నారా? ఆత్మయ సమావేశంలో మెగా అభిమానులు తీసుకున్న షాకింగ్ నిర్ణయానికి అసలు కారణమేంటి? విజయవాడలో మెగాభివమానుల ఆత్మీయ సమ్మేళనం కొత్త చర్చకు దారి తీసింది. చిరంజీవి(Chiranjeevi), పవన్‌కల్యాణ్‌తోపాటు(Pawan Kalyan).. మెగా ఫ్యామిలీలో ఉన్న రామ్‌చరణ్, నాగబాబు, వరుణ్‌తేజ్, సాయిధరమ్, వైష్ణవ్‌తేజ్ ఫ్యాన్స్ అంతా కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మెగా ఫ్యాన్స్ అంతా ఇక జనసేన వెంట నడవాలని తీర్మానించారు. పవన్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని.. మెగాభివమానులంతా కలిసి ఏకతాటి పైకి రావాలని నిర్ణయించడమేకాదు.. 2024లో జనసేనని అధికారంలోకి తీసుకొచ్చేలా పనిచేయాలని భావిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో నిర్ణయాలతో అటు పొలిటికల్‌గా.. ఇటు ఇండస్ట్రీ పరంగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెగా అభిమానుల సంచలన నిర్ణయానికి అసలు కారణమేంటి? జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కల్యాణ్ వెంట నిలిచింది నాగబాబే. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నర్సాపురం ఎంపీ పదవికి పోటీ కూడా చేశారు. ఇప్పటికీ జనసేన సభల్లో నాగబాబు కనిపిస్తున్నారు. అంతేకాదు తమ్ముడిపై సోషల్‌మీడియాలో ఈగకూడా వాలకుండా చూసుకుంటున్నారు నాగబాబు.
కాని మెగా అన్నయ్య చిరంజీవి మాత్రం జనసేన అనే పదాన్ని కూడా ఇప్పటివరకు ఉచ్ఛరించలేదు. పవన్‌కి సపోర్ట్ చేస్తున్నట్లుగాని.. ఆయన పార్టీ తరఫున ప్రచారానికి కూడా రాలేదు. 2014 తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించలేదు.. మళ్లీ వస్తానని కూడా చెప్పలేదు. కాని విజయవాడలో జరిగిన మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనం జరిగిన విధానం.. అక్కడ అభిమానుల ప్రకటనలు చూస్తే.. చిరు రాజకీయాల్లోకి వస్తారా అనే అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. చిరంజీవికి దగ్గరగా ఉండే స్వామినాయుడు లాంటి సీనియర్ అభిమానులు కూడా జనసేనకు సపోర్ట్ చేస్తామనడం చూస్తుంటే పవన్ కల్యాణ్, చిరంజీవి రాజకీయ కలయిక ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది.
చిరంజీవి ఈ మధ్య సీఎం జగన్‌కి సన్నిహితంగా ఉంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలకు గాని.. వ్యతిరేకులకు గాని.. దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం సంచలనం రేపుతోంది. తమ సమావేశం గురించి చిరంజీవికి తెలియదని అభిమానులంటున్నారు. నాగబాబు ద్వారా త్వరలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయని చెబుతున్నారు. చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ గురించి కూడా నాగబాబే క్లారిటీ ఇస్తారని సీనియర్ అభిమానులు చెబుతుండడం చూస్తుంటే.. ఇకనుంచి జనసేనకి మెగాస్టార్ సపోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. మెగా అభిమానులంతా పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తారంటున్నారు. గ్రామస్థాయి నుంచి అభిమానులంతా కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. 2024లో పవన్ కళ్యాణ్ ను సీఎంని చేయడమే మా లక్ష్యం అంటున్నారు ఫ్యాన్స్.
పొలిటికల్‌గా మెగా బ్రదర్స్ ఒకటైతే.. జనసేనకు ప్రయోజనం ఉంటుందని అభిమానులఅంటున్నారు. అన్నదమ్ముళ్ల మధ్య అంగీకారం తర్వాతే ఫాన్స్ ను ముందుగా బయటికి పంపించి ఉండవచ్చని చర్చ కూడా మొదలైంది.