Lock down రైల్వే చార్జీలపై రాజకీయ రచ్చ

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో తమ స్వస్థలాలకు పెద్ద ఎత్తున బయలుదేరడంతో వారి ప్రయాణ ఖర్చులను ఎవరు భరించాలనే విషయంపై జాతీయ స్థాయిలో రచ్చ రగులుకుంది. విదేశాలలో ఉన్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు ఎయిర్ ఇండియా ద్వారా ఫ్రీగా విమానాలు నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం...

Lock down రైల్వే చార్జీలపై రాజకీయ రచ్చ
Follow us

|

Updated on: May 04, 2020 | 10:24 AM

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో తమ స్వస్థలాలకు పెద్ద ఎత్తున బయలుదేరడంతో వారి ప్రయాణ ఖర్చులను ఎవరు భరించాలనే విషయంపై జాతీయ స్థాయిలో రచ్చ రగులుకుంది. విదేశాలలో ఉన్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు ఎయిర్ ఇండియా ద్వారా ఫ్రీగా విమానాలు నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం.. మనదేశంలోనే వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రైళ్లలో ఉచితంగా వారి గమ్యస్థానాలకు ఎందుకు చేరడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో వలస కార్మికుల రైలు ప్రయాణ ఖర్చులను కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని సోనియాగాంధీ ప్రకటన చేయడం రాజకీయ రచ్చకు దారి తీసింది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు కేవలం 50 రూపాయలు చెల్లించడం ద్వారా ఎంత దూరమైనా తమ స్వస్థలాలకు ప్రయాణం చేయవచ్చని రైల్వే శాఖ రెండు రోజుల క్రితం ప్రకటించింది. అయితే గత నెలా పదిహేను రోజులుగా ఎలాంటి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారి నుంచి 50 రూపాయలు టికెట్ ధర వసూలు చేయడం దేనికన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అదే సమయంలో విదేశాల నుంచి భారతీయులను ఉచితంగా విమానం ద్వారా తరలిస్తున్నప్పుడు అత్యంత చౌకగా జరిగే రైలు ప్రయాణాలకు 50 రూపాయలు వసూలు చేయడం దేనికి అన్న చర్చ మొదలయింది.

వలస కార్మికుల రైలు ప్రయాణ ఛార్జీలను తమ రాష్ట్రాల యూనిట్లు భరిస్తానని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం ఉదయం ప్రకటించడంతో ఈ విషయం కొత్త మలుపు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటనను సీరియస్‌గా తీసుకున్న బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. భారీగా ఖర్చు అయ్యే విమాన ప్రయాణ ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరిస్తూ.. అందులో పది శాతం కూడా ఖర్చు గాని రైలు చార్జీలను వలస కార్మికుల నుంచి వసూలు చేయడం ఎందుకు అని ఆయన ట్విట్టర్ వేదికగా రైల్వే మంత్రిని ప్రశ్నించారు. అనంతరం రైల్వే శాఖ అధికారులతో కూడా ఆయన మాట్లాడారు.

రైల్వే శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత సుబ్రహ్మణ్యస్వామి వలస కార్మికుల రైలుఛార్జీలపై ట్వీట్ చేశారు. వలస కార్మికుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చిందని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. వారి తరలింపునకు అయ్యే ఖర్చులో 85 శాతం కేంద్ర ప్రభుత్వం, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చిందని సుబ్రహ్మణ్యస్వామి తాజాగా ట్వీట్ చేశారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల రైల్వే ఛార్జీలను భరిస్తుంటే ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలు ఏం భరిస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ ప్రబలిన క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయాలు చేయవద్దని ఆయన కాంగ్రెస్ పార్టీకి సూచించారు.