‘దయచేసి నిగ్రహంతో వ్యవహరించండి’, ఆసుపత్రి బెడ్ పై నుంచి మమత సందేశం
నందిగ్రామ్ లో నిన్న సాయంత్రం గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం హాస్పిటల్ బెడ్ పై నుంచే వీడియో సందేశమిచ్చారు.
నందిగ్రామ్ లో నిన్న సాయంత్రం గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం హాస్పిటల్ బెడ్ పై నుంచే వీడియో సందేశమిచ్చారు. దయచేసి అందరూ (బహుశా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి) సంయమనంతో, నిగ్రహంగా వ్యవహరించాలని, ప్రజా జీవనానికి భంగకరమయ్యే ఎలాంటి చర్యలకు పాల్పడరాదని ఆమె కోరారు. శాంతియుతంగా ఉండండి.. ప్రజలకు ఇబ్బందులు కలిగించే పనులేవీ చేయకండి.. నిన్నటి ఘటనలో నేను ప్రజలను ఉద్దేశించి గ్రీట్ చేస్తుండగా నా కాలు కారు డోర్ లో చిక్కుకుని పోయింది. ఆ సందర్భంలో, ఆ హడావుడిలో మోకాలి భాగం గాయపడింది. నాకు ఛాతీ నొప్పి కూడా వచ్చింది. అయితే మందులు తీసుకుంటున్నాను..కోల్ కతా లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను’ అని ఆమె చెప్పారు.
రెండు మూడు రోజుల్లో కోలుకోగలుగుతానని ఆశిస్తున్నానని, ముఖ్యంగా కాలినొప్పి ఇంకా తగ్గక పోవచ్చు నని, అందువల్ల వీల్ చైర్ లోనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆమె చెప్పారు దయచేసి మీరంతా నాకు సపోర్ట్ ఇవ్వాలని మమత కోరారు. కాగా తన ఈ సందేశంలో ఆమె.. తనపై దాడి జరిగిందని కానీ, ఇది కుట్ర అని గానీ ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు. .
అటు మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని అటు బీజేపీ, ఇటు తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఆమెదంతా డ్రామా అని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఇది దాడేనని, బీజేపీ కార్యకర్తలే దీనికి బాధ్యులని తృణమూల్ కాంగ్రెస్ ప్రత్యారోపణ చేస్తోంది. అటు ఈ నెల 14 వరకు మమత తన ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే మరికొన్ని రోజులు ఆమె హాస్పిటల్ లో చికిత్స తీసుకోవలసి ఉంటుంది. ఆరుగురు డాక్టర్ల ప్రత్యేక బృందం ఆమె వైద్య చికిత్సలో నిమగ్నమై ఉంది .
మరిన్ని ఇక్కడ చదవండి:
Tv9 Telugu: 7హెచ్ మీడియా ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో సత్తా చాటిన టీవీ9.. ఫైనల్‌లో అద్భుత విజయం