Nagarjuna Sagar By Election: ఓవైపు గర్జిస్తున్న జానారెడ్డి.. మరోవైపు ‘వెయిట్’ అంటున్న టీఆర్ఎస్, బీజేపీలు.. సాగర్‌లో ఏం జరుగుతోంది?..

Sagar Bypoll: హాలియా సభతో కాంగ్రెస్‌ గర్జించింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. బైపోల్‌ వ్యూహాలతో...

Nagarjuna Sagar By Election: ఓవైపు గర్జిస్తున్న జానారెడ్డి.. మరోవైపు ‘వెయిట్’ అంటున్న టీఆర్ఎస్, బీజేపీలు.. సాగర్‌లో ఏం జరుగుతోంది?..
Nagarjuna Sagar By Election
Follow us

|

Updated on: Mar 28, 2021 | 3:12 AM

Nagarjuna Sagar By Election : హాలియా సభతో కాంగ్రెస్‌ గర్జించింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. బైపోల్‌ వ్యూహాలతో సాగర్‌లో రాజకీయ మథనం కోలాహలం సృష్టిస్తోంది. ఇప్పటికే నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. మరో రెండు రోజుల్లో ఆ ప్రక్రియ ముగియనుంది. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే పోలింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉపఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచిందని చెప్పాలి. ఇప్పటి వరకు సింగిల్ హ్యాండ్‌తో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, నాగార్జునసాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జానారెడ్డికి.. హాలియా మీటింగ్‌తో టి.కాంగ్రెస్ లీడర్స్ తోడయ్యారు. అలా ‘కాంగ్రెస్ జనగర్జన’ సభతో సాగర్ ప్రచారం ఒక్కసారిగా హీటెక్కింది. ‘నామినేషన్లు వేసి ఇంట్లో కూర్చుందామా? ప్రజాభిమానం ఎవరివైపో చూసుకుందామా?’ అంటూ హాలియా సభలో టీఆర్‌ఎస్‌, బీజేపీలకు జానారెడ్డి విసిరిన సవాల్‌తో.. సాగర్ బైపోల్‌ని ఇంకాస్త హీటెక్కించారని చెప్పాలి.

కాంగ్రెస్ హయాంలోనే సాగర్‌కు న్యాయం జరిగిందన్న జానా.. కేసీఆర్ వస్తే సాగర్‌కు ఏం చేశామో లైవ్‌లో చూపిస్తామన్నారు. ఉప ఎన్నిక సాగర్‌ ఆత్మగౌరవానికి, ప్రభుత్వ అహంకారానికి పోరాటమంటూ కొత్త నినాదం అందుకున్నారు. జానారెడ్డి 50వేల మెజారిటీతో గెలవడం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

అభ్యర్థుల ప్రకటన.. సాగర్‌లో జానారెడ్డిని అందరికంటే ముందే అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇక నామినేషన్లకు మంగళవారం ఒక్కరోజే మిగిలి ఉన్నా.. అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు మాత్రం ఇంకా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నాయి. ఓవైపు ప్రచారం సాగిస్తూనే.. మరోవైపు తమ అభ్యర్థులను ప్రకటించకుండా తాత్సారం చేస్తూ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. నెలక్రితమే హాలియాలో సభపెట్టి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన కేసీఆర్‌…క్యాండేట్‌ విషయంలో మాత్రం చాలా పకడ్బందీగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్నికల పోరులోకి దిగిన గులాబీ శ్రేణులు.. నెల రోజులుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మండలానికి ఒక ఎమ్మెల్యే, గ్రామానికో కీలక నేత ఎన్నిక బాధ్యతల్లో ఉండటంతో…అభ్యర్థిని చివరి నిమిషంలో ప్రకటించినా పెద్దగా ఇబ్బంది ఉండదనేది టీఆర్‌ఎస్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

సాగర్‌లో సెంటిమెంట్‌నే టీఆర్ఎస్ నమ్ముకుంటుందా? సాగర్‌లో టీఆర్‌ఎస్‌ సెంటిమెంట్‌ని నమ్ముకుంటుందా?.. సీనియర్‌ని దించుతుందా?.. అన్నది ఆసక్తికరంగా మారింది. ఏడుగురు నేతల అభ్యర్థిత్వాన్ని పరిశీలించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్.. కొన్ని సర్వేలు చేయించారట. చివరికి ఇద్దరిని షార్ట్‌ లిస్ట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వారిలో ఒకరు దివంగత నాయకుడు నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్‌ కాగా, మరొకరు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. సాగర్‌లో యాదవ సామాజికవర్గం గెలుపోటములను నిర్దేశిస్తుంది. అందుకే సెంటిమెంట్‌ పని చేస్తుందనే అంచనాతో నోముల భగత్‌కే సీటు దాదాపు ఖరారైంది. అయితే సీనియర్‌ నేత జానారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉండటంతో.. రాజకీయాలకు కొత్తయిన భగత్‌ పోటీ ఇవ్వగలరా అన్నసందేహంతోనే ఆ ప్రకటన ఆగిందంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. ఇక గుత్తాకు ఇస్తే ఎలా ఉంటుందనే ప్లాన్‌-బీని ఆలోచిస్తోంది టీఆర్ఎస్.

బీజేపీలోనూ కన్‌ఫ్యూజన్.. ఇక బీజేపీ అభ్యర్థి ప్రకటనపైనా కన్‌ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఎలాంటి ప్రకటన రాకముందే ఒకరు ఇప్పటికే నామినేషన్‌ వేయగా.. మరో ఇద్దరు గట్టిగా లాబీయింగ్‌ చేస్తున్నారు. అయితే, నామినేషన్‌ వేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి భార్య నివేదితకు పార్టీ బీఫామ్‌ ఇస్తుందా? లేదంటే వేరే అభ్యర్థిని దించుతుందా? అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. నివేదిత కాకుండా.. కడారి అంజయ్య, రవినాయక్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. లేదంటే టీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తారా? అన్న స్ట్రాటజీతో కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే టీఆర్ఎస్ టికెట్ ఫైనల్ అయ్యేవరకు వేచి చూద్దామన్నట్లుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తరువాత.. ఒకవేళ ఆ పార్టీ నుంచి ఎవరూ రాకపోతే అప్పుడు నివేదిత, అంజయ్య, రవినాయక్‌ లలో ఎవరో ఒకరిని ఫైనల్‌ చేయొచ్చనే ప్లాన్‌లో ఉంది బీజేపీ నాయకత్వం.

కాగా, మరో రెండు రోజులు మాత్రమే నామినేషన్ దాఖలుకు గడువు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓవైపు దూసుకుపోతుండగా.. టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం వేయిట్ అండ్ వాచ్ పాలిటిక్స్‌ను నడుపుతున్నాయి. మరి వీరి వెయిట్ అండ్ వాచ్ పాలిటిక్స్‌ ఎంతవరకు పనిచేస్తాయనేది తెలాలంటే మనమూ వేచి చూడాల్సిందే.

Also read:

Glass Bridge: చైనాలో మరో అద్భుత కట్టడం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..

GISAT-1: జీఐశాట్-1 శాటిలైట్ ప్రయోగం వాయిదా.. ప్రకటించిన ఇస్త్రో.. వాయిదాకు కారణమదేనా?