Komatireddy Venkat Reddy: గ్రూపు రాజకీయాలు చేయడం నాకు రాదు.. పీసీసీ పదవిపై ఎంపీ కోమటిరెడ్డి కామెంట్..
పార్టీలో గ్రూపు రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. సీనియర్ నాయకుడినైన తనకు అన్ని అర్హతలున్నా.. పదవి దక్కకపోవడం కొంత బాధగా ఉందన్నారు.
పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధ ఉంటుందని… బాధ ఉన్నంత మాత్రాన పార్టీ మారతారా ? అంటూ ప్రశ్నించారు. ఆ బాధ తోనే అప్పుడు అలా మాట్లాడానని పేర్కొన్న కోమటిరెడ్డి… చాలా పార్టీల నుంచి ఆఫర్ వచ్చినా పోలేదని స్పష్టం చేశారు. గతంలో మంత్రి పదవికే తాను రాజీనామా చేసానని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఏ పదవి అవసరం లేదని వెల్లడించారు. భువనగిరి ఎంపీ గా రూపాయి ఖర్చు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించారని… నాకు పార్టీ మార్చే అవసరం లేదన్నారు. పార్టీలో గ్రూపులు కట్టే అవసరం తనకు లేదని… మోసం చేసే అలవాటు అసలే లేదని పేర్కొన్నారు.
ఇదిలావుంటే… తెలంగాణలో ఇవాళ ఆవిర్భావం కానున్న వైఎస్ షర్మిల పార్టీకి ఆయన ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేశారు. పార్టీ సభ జరుగనున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఆగి ఉన్న YSR అభిమానులతో ఎంపీ కాసేపు ముచ్చటించారు. ఆవిర్భావ వేడుకలకు రావాలంటూ వారు కోరడంతో సున్నితంగా తిరస్కరించారు.