Modi Cabinet: రెండున్నరేళ్ళ తర్వాత భారీ ప్రక్షాళన.. వీరికి ప్రమోషన్ వెనుక సీక్రెట్ ఇదే..!

Modi Cabinet: రెండున్నరేళ్ళ తర్వాత భారీ ప్రక్షాళన.. వీరికి ప్రమోషన్ వెనుక సీక్రెట్ ఇదే..!
Secret

రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ళ తర్వాత తన మంత్రివర్గాన్ని భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఏకంగా 43 మందితో...

Rajesh Sharma

|

Jul 07, 2021 | 7:49 PM

Modi cabinet reshuffle secret behind promotion for four: రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ళ తర్వాత తన మంత్రివర్గాన్ని భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఏకంగా 43 మందితో భారీ మార్పులు చేశారు. కొందరిని మంత్రి పదవి నుంచి తప్పించారు. మరికొందరికి కొత్తగా అవకాశమిచ్చారు. ఇంకొదరికి ప్రమోషన్ కూడా ఇచ్చేశారు. త్వరలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న తరుణంలో చేపట్టిన కేబినెట్ రిషఫిల్ కాబట్టి.. ఆయా రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టంగానే కనిపిస్తోంది. ఎన్నికలు జరగనున్న యుపీ, పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం దక్కినట్లు కనిపిస్తోంది. జులై ఏడు సాయంత్రం రాష్ట్రపతిభవన్‌లో ప్రమాణ స్వీకారం జరిగింది.

అనేక శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు. ప్రధాని మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి విస్తరణలో భారీ మార్పులే జరిగాయి. ఇప్పటికే హర్షవర్ధన్‌, రమేశ్‌ పోఖ్రియాల్‌ సహా కేంద్రమంత్రులు పలువురు తమ పదవులకు రాజీనామా చేయడంతో కొత్తవారికి అవకాశం దక్కింది. ఇందుకు ముందుగానే కసరత్తు జరిపారు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా. పలు భేటీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా కూడా పాలుపంచుకున్నారు. పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా సమాలోచనలు జరిపారు. ఇక కొందరు సహాయ మంత్రులను కూడా తాజా విస్తరణలో కేబినెట్‌ మంత్రులుగా పదోన్నతి ఇచ్చారు. గత రెండేళ్లుగా ఆయా శాఖలో వారి పనితీరుతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రమోషన్‌ ఇచ్చారని రాజకీయ పరిశీలకులు అంఛనా వేస్తున్నారు.

తెలంగాణకు చెందిన సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డి రెండేళ్ళ క్రితం అనూహ్యంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు. చురుకుగా వ్యవహరిస్తూ అధినేతల నజర్‌లో పడ్డ కిషన్ రెడ్డికి తాజాగా కేబినెట్ హోదా దక్కింది. ఆయనకు కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి కల్పించి.. కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. అయితే తెలంగాణలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు. కానీ స్థానికంగా అధికారంలో టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా పార్టీని ఎదిగేలా చేయడంతోపాటు.. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దే క్రమంలోనే కిషన్ రెడ్డికి పదోన్నతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

అనురాగ్‌ ఠాకూర్‌, హర్‌దీప్‌ సింగ్‌ పూరి, పురుషోత్తం రూపాలా, మనుసుఖ్‌ మాండవీయలను కేబినెట్‌లోకి తీసుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ ఎంపీ అయిన అనురాగ్‌ ఠాకూర్‌ ఆర్థికశాఖ సహాయ మంత్రిగా ఉండగా ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. దానికి కారణం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడమేనంటున్నారు. కేంద్ర పౌర విమానయానశాఖ, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖలకు సహాయ మంత్రిగా హర్‌దీప్‌ సింగ్‌ పూరి వ్యవహరిస్తుండగా ఆయన పనితీరు బాగుండడంతో పాటు వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయనకు కేబినెట్‌ హోదా ఇచ్చినట్లు సమాచారం.

ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ పార్టీ బలోపేతం చేసే దిశగా కిరణ్‌ రిజిజును కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఆయన క్రీడల శాఖకు సహాయ మంత్రిగా వ్యవహరించారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే కిరణ్‌కు పదోన్నతి లభించిందంటున్నారు. గుజరాత్‌లో వచ్చే ఏడాది (2022) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సహాయ మంత్రులకు కేబినెట్‌ హోదా కల్పించారు మోదీ. పంచాయతీ రాజ్‌ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా, పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మనుసుఖ్‌ మాండవీయను కేబినెట్‌లో తీసుకున్నారు.

ALSO READ: తెలంగాణలో పొలిటికల్ జోష్.. రెండున్నరేళ్ళ ముందే దూకుడు పెంచిన రాజకీయ పార్టీలు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu