Lakhimpur Kheri clash: ‘నా కొడుకు కారులో లేడు.. ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు’ : కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా
Lakhimpur Kheri clash: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటనపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఎట్టకేలకు నోరు విప్పారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల్లో కొందరు ముగ్గురు

Lakhimpur Kheri clash: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటనపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఎట్టకేలకు నోరు విప్పారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల్లో కొందరు ముగ్గురు బీజేపీ కార్యకర్తలను, కారు డ్రైవర్‌ని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. ఈ ప్రమాదంలో కారు కింద పడి ఇద్దరు రైతులు మరణించడం దురదృష్టకరమన్నారు. ఈ సంఘటన సమయంలో తన కుమారుడు అక్కడ లేడని చెప్పారు. లఖింపూర్ ఖేరీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను కొందరు బీజేపీ కార్యకర్తలు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.
నిరసన తెలుపుతున్న రైతుల్లో కొంతమంది నల్ల జెండాలు చూపించారన్నారు. అనంతరం వారు కారుపై రాళ్లు రువ్వడంతో కారు అదుపు తప్పి బోల్తాపడిందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఇద్దరు రైతులు కారు కింద పడటంతో మరణించారని వివరించారు. అంతేకాదు అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ముగ్గురు బీజేపీ కార్యకర్తలను, కారు డ్రైవర్‌ని అనవసరంగా కొట్టి చంపారన్నారు. పోస్టుమార్టంలో అసలు విషయాలు తెలుస్తాయని అన్నారు. కొంతమంది రైతు నాయకులు ఆరోపించినట్లుగా తన కుమారుడు సంఘటన స్థలంలో లేడని మిశ్రా వివరించే ప్రయత్నం చేశారు.
అంతేకాదు నిరూపించడానికి తన వద్ద ఫోటో, వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ ఘటన జరిగే సమయంలో తన కుమారుడు ఉప ముఖ్యమంత్రి వేదిక వద్ద ఉన్నారని, వేలాది మంది ప్రజలు, పోలీసు అధికారులు కూడా అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు యునైటెడ్ కిసాన్ మోర్చా (SKM) ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటనకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా జిల్లా మెజిస్ట్రేట్‌లు, కమిషనర్ల కార్యాలయం ఎదుట ప్రదర్శనకు పిలుపునిచ్చింది. మరోవైపు ఈ ఘటనపై రైతు నాయకులు యోగేంద్ర యాదవ్, దర్శన్ పాల్ సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.