AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kunja Bojji: పెన్షన్ డబ్బులూ ప్రజల కోసమే..తుది శ్వాస వరకూ ప్రజాసేవలోనే..’కుంజా బొజ్జి’ ఓ అరుదైన నాయకుడు!

ఒక్కసారి ఒక వార్డుకు కార్పొరేటర్ అయితే చాలు ఇక ఆ నాయకుడిని కలవాలంటే అప్పాయింట్ మెంట్ ఉండాల్సిందే. ఇంకొంచెం రాజకీయంగా ఎదిగాడంటే ఆ నేతను కలవడం మాట దేవుడెరుగు.. కనీసం చూడాలన్నా టీవీల్లో చూడాల్సిందే.

Kunja Bojji: పెన్షన్ డబ్బులూ ప్రజల కోసమే..తుది శ్వాస వరకూ ప్రజాసేవలోనే..'కుంజా బొజ్జి' ఓ అరుదైన నాయకుడు!
Kunja Bojji
KVD Varma
|

Updated on: Apr 12, 2021 | 1:01 PM

Share

Kunja Bojji: ఒక్కసారి ఒక వార్డుకు కార్పొరేటర్ అయితే చాలు ఇక ఆ నాయకుడిని కలవాలంటే అప్పాయింట్ మెంట్ ఉండాల్సిందే. ఇంకొంచెం రాజకీయంగా ఎదిగాడంటే ఆ నేతను కలవడం మాట దేవుడెరుగు.. కనీసం చూడాలన్నా టీవీల్లో చూడాల్సిందే. అదీ ఆయన గారి పుట్టినరోజు పండగను జరుపుకునేటప్పుడు. ప్రస్తుతం నేతల తీరిది. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇటువంటి నాయకుడి గురించి కాదు. ప్రజా నాయకుడిగా.. నేతగా నిజాయతీగా జీవితాన్ని తన ప్రజల మధ్యలో.. ప్రజల కోసమే ధారబోసిన ఓ అరుదైన నాయకుడి గురించి. ఆయనే కుంజా బొజ్జి.

ఆయన నిజాయతీకి మారుపేరు. ఈనాటి తరానికి ఆదర్శం ఆ నేత. సైకిల్ పైనే నియోజకవర్గంలో తిరుగేవారు. ప్రజల బాగోగులు తప్ప తన గురించి ఏనాడూ ఆయన ఆలోచించలేదు. తనకు ఆ ప్రజలే ఏదో ఒకటి ఇస్తారనుకొనేవారు. తనదగ్గర ఉన్నదంతా ప్రజల కోసమే ఖర్చు చేశేవారు. మాజీ ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులను కూడా ప్రజాసేవకే వెచ్చించే వారు. ఆయన పేరు కుంజా బొజ్జి. ఆ పేదల ఎమ్మెల్యే ఇక లేరు. శాశ్వత సెలవు తీసుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కుంజా బొజ్జి అతి సామాన్యమైన జీవితాన్ని గడిపారు. ప్రజల కష్టాల నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయన అదే ప్రజల కష్టంలో తోడుగా తుది శ్వాస వరకూ నిలిచారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అడవి వెంకన్న గూడెం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొజ్జి.

చిన్నప్పుడే సీపీఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. ఆ పార్టీ తరఫున అనేక పోరాటాలు చేశారు. అనేక పర్యాయాలు అరెస్టు అయి జైలు జీవితం గడిపారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన నేత ఆయన. ఆయన గ్రామానికి కనీసం బస్సు సౌకర్యం కూడా ఉండేది కాదు. అటువంటి గ్రామం నుంచి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు కుంజా బొజ్జి. తరువాత సైకిల్ పై తన ప్రయాణాలు సాగించేవారు. ఎంత దూరం అయినా ప్రజల కోసం సైకిల్ పైనే వెళ్లేవారు. ఈయనకు మావోయిస్టుల నుంచి ఎన్నో సార్లు బెదిరింపులు వచ్చేవి. కానీ, ఏనాడూ ఆ బెదిరింపులకు అయన లొంగలేదు. పార్టీ కోసం, ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించారు. దీంతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు.

ప్రజల్లో ఆయనకు ఉన్న నమ్మకంతోనే వరుసగా మూడుసార్లు భద్రాచలం నుంచి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. 1985-1999 వరకు మూడు సార్లు అధిక మెజారిటీతో గెలిచిన నేతగా ఆయనకు గుర్తింపు ఇచ్చారు ప్రజలు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్​పైనే తన కార్యాలయానికి వెళ్లిన నాయకుడు కుంజా బొజ్జి. అంతంత మాత్రం ఆర్ధిక స్థితిలోనూ ఆయన తనకున్నదానిని ప్రజల కోసమే ఖర్చు చేశేవారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా..పూరిగుడిసె లోనే జీవనం సాగించిన ప్రజా నాయకుడు ఆయన. వయసు మీదపడినా తునికాకు సేకరిస్తూ జీవించారు కుంజా బొజ్జి. గత ఏడాది ఆయన భార్య మరణించడంతో ఒంటరి అయ్యారు. అప్పటి నుంచి ఆయన భద్రాచలంలో కూతురి ఇంటివద్ద ఉంటున్నారు. ఆయన ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందజేశాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తన దగ్గరకు వచ్చిన ప్రజలకు ఎదో ఒక సహాయం చేయాలని పరితపించేవారు.

అరుదైన నాయకుడిగా కుంజా బొజ్జి చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పటి తరం నేతలకు ఆయన జీవితం ఆదర్శప్రాయం. కుంజా బొజ్జి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఎప్పుడూ నిరాడంబరంగానే జీవించారు. చివరి శ్వాస వరకూ పార్టీ సిద్ధాంతాలను వదల కుండా ప్రజాజీవితంలో హుందాగా జీవించారు కుంజా బొజ్జి. ఆయన జీవితం రాజకీయ నాయకులకే కాదు..ఈనాటి యువతకూ స్ఫూర్తినిస్తుంది.

Also Read: వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీ, ఏబీవీపీ కార్యకర్తల అడ్డంకులు

KTR Warangal Tour : టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ ఓరుగల్లు పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు, టూర్‌ వెనుక ఆంతర్యం?