AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడలా..ఇక్కడిలా.. గులాబీ బాసా..? మజాకా ?

దక్షిణాదిలో పాగా వేయాలనేది కమలం నేతల కల. ఇందుకోసం రకరకాల రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు . అందులో ఒకటి ఆపరేషన్‌ ఆకర్ష్. బలమైన నేతలు పార్టీలోకి వస్తే చేర్చుకోవాలనేది బీజేపీ ప్లాన్‌. ఇప్పటికే కొంతమంది నేతలకు గాలం వేసింది. పార్టీలో చేర్చుకుంది. అయితే ఏపీలో చేపట్టిన తరహాలోనే అదే ఆపరేషన్‌ తెలంగాణలో కూడా చేపట్టాలని బీజేపీ ప్రణాళికలు వేసిందట. అయితే వెంటనే పసిగట్టిన గులాబీ బాస్‌ కమలం కలలకు బ్రేక్‌ వేశారనే ప్రచారం రాజకీయవర్గాల్లో నడుస్తోంది. కేంద్రంలో […]

అక్కడలా..ఇక్కడిలా.. గులాబీ బాసా..? మజాకా ?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 01, 2019 | 8:33 PM

Share
దక్షిణాదిలో పాగా వేయాలనేది కమలం నేతల కల. ఇందుకోసం రకరకాల రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు . అందులో ఒకటి ఆపరేషన్‌ ఆకర్ష్. బలమైన నేతలు పార్టీలోకి వస్తే చేర్చుకోవాలనేది బీజేపీ ప్లాన్‌. ఇప్పటికే కొంతమంది నేతలకు గాలం వేసింది. పార్టీలో చేర్చుకుంది. అయితే ఏపీలో చేపట్టిన తరహాలోనే అదే ఆపరేషన్‌ తెలంగాణలో కూడా చేపట్టాలని బీజేపీ ప్రణాళికలు వేసిందట. అయితే వెంటనే పసిగట్టిన గులాబీ బాస్‌ కమలం కలలకు బ్రేక్‌ వేశారనే ప్రచారం రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్‌ చేపట్టింది. నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను పార్టీలో విలీనం చేసుకుంది. అదే స్పీడ్‌లో టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులపై కన్నేసింది. వారిని కూడా లాగాలని ప్లాన్‌ వేసింది. ఇందు కోసం ఓ ప్రత్యేక వ్యూహం కూడా రచించింది.
టీఆర్‌ఎస్‌కు ఆరుగురు రాజ్యసభ ఎంపీలు. వీరికి బాస్‌ సీనియర్‌ నేత కేశవరావు.
అయితే ఈ ఆరుగురిలో నలుగురి లాగితే…టీఆర్‌ఎస్‌ విలీనం కూడా పూర్తయ్యేది. ధర్మపురి శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. టెక్నికల్‌‌గా గులాబీ మెంబర్‌ కానీ… పార్టీ యాక్టివిటీస్‌లో పాల్గొనడం లేదు. డీఎస్ ఎలాగూ టిఆర్ఎస్ కు దూరంగా ఉన్నారు కాబట్టే ఆయన ద్వారా మిగతా సభ్యులను లాగాలి అనుకుంది బీజేపీ. జోగినపల్లి సంతోష్ స్వయానా సీఎం ఫ్యామిలీ మెంబర్‌. కెప్టెన్ లక్ష్మి కాంతారావు కేసీఆర్ కు సన్నిహితుడు సో వీరిద్దరిని టచ్ చేయలేరు.  కేకే, బండా ప్రకాష్, బడుగుల లింగయ్య యాదవ్‌లపై కన్నేసింది బిజెపి..వీరితో సంప్రదింపులు జరపాలని డీఎస్ కు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.
2019 ఎన్నికల ఫలితాల తరువాత ఢిల్లీలో జరిగిన టిఆర్ ఎస్ పార్లమెంట్ సభ్యుల సమావేశానికి డిఎస్ వ్యూహాత్మకంగా హాజరయ్యారు.. తొలుత డిఎస్ ఎందుకు హాజరయ్యారు? అని అందరూ ఆశ్చర్యపడ్డారు. తీరా అసలు విషయం తెలిశాక గులాబీ బాస్ అలెర్ట్ అయ్యారట. డీఎస్‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ వేస్తున్న స్కెచ్చును కేసీఆర్ త్వరగానే పసిగట్టారట. కొడుకు అరవింద్ ఎలాగూ బీజేపీ ఎంపీ కాబట్టి.. తండ్రి కొడుకులు బీజేపీ పెద్దల డైరెక్షన్‌తో వేస్తున్న ఎత్తులను ఆదిలోనే దెబ్బకొట్టారట.
ఎప్పటికప్పుడు తమ సభ్యుల పై నిఘా పెట్టిన కేసీఆర్…. బిజెపి వ్యూహాన్ని గమనించి తమ ఎంపీలను అలర్ట్‌ చేశారట. బండా ప్రకాష్, బడుగుల లింగయ్యయాదవ్‌లను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసిందట. అయితే వారి నుంచి మాత్రం కనీసం స్పందన రాలేదట. వీరిద్దరి నుంచి రియాక్షన్ రాకపోవడంతో కేకేకు ఆఫర్‌ ఇచ్చిందట. ఎంపీ పదవి రెన్యూవల్‌ చేస్తామని చెప్పిందట. అయితే ఇక్కడో కండీషన్‌ పెట్టిందట. పదవి కంటే ముందు విలీనం చేయాలని చెప్పిందట. ఇందులో భాగంగానే ఆర్టీసీపై కేకే ప్రకటన చేశారని గులాబీ నేతల్లో డౌట్‌ వచ్చింది. దీంతో వెంటనే  గులాబీ బాస్‌ ఆయనతో మాట్లాడి వ్యవహారం చక్కబెట్టి… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లారట.
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో గులాబీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలితే….మళ్లీ ప్లాన్‌ వర్క్‌వుట్‌ చేయాలని కమలం పెద్దలు అనుకున్నారట. తీరా బంపర్‌ మెజార్టీతో గెలవడంతో ప్రణాళిక అమలును వాయిదా వేశారట.