వదలొద్దు.. ప్రతిమాటను తిప్పికొట్టండి.. మంత్రుల సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
వదలొద్దూ.. ప్రతిమాటను తిప్పికొట్టిండి.ప్రాజెక్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండగట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. ZPTC, MPTC, GHMC ఎన్నికల్లో రిజల్ట్స్ అంతకు మించి వుండాలన్నారు. లడాయి మొదలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి కౌంటర్ అటాక్ జోరందుకుంది.

వదలొద్దూ.. ప్రతిమాటను తిప్పికొట్టిండి.ప్రాజెక్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండగట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. ZPTC, MPTC, GHMC ఎన్నికల్లో రిజల్ట్స్ అంతకు మించి వుండాలన్నారు. లడాయి మొదలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి కౌంటర్ అటాక్ జోరందుకుంది. సమైక్య పాలన కంటే కేసీఆరే తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులపై కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టాలని.. ఘాటుగా ఎండగట్టాలని మంత్రులకు దిశా నిర్దేశం చేశారారు. బీఆర్‌ఎస్ హయాంలో గోదావరి, కృష్ణా నీటి వాటాల విషయంలో జరిగిన అన్యాయాన్ని లెక్కలతో నిలదీయాలని సీఎం రేవంత్ సూచించారు.
సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినందుకు మంత్రులను ముఖ్యమంత్రి అభినందించారు. ఆ తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా–గోదావరి బేసిన్లలోని పరిస్థితి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి నదీజలాల అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన పనులు, ఖర్చులు వంటి అన్ని అంశాలను సభలో సమగ్రంగా చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ హయాంలోనే డీపీఆర్ వెనక్కి..!
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ కేంద్రం నుంచి తిరిగి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం. ఎన్జీటీ కేసు సమయంలో తాగునీటి ప్రాజెక్టుగా మాత్రమే చేపడతామని అప్పటి ప్రభుత్వం కోర్టులో చెప్పడంతో, 7.25 టీఎంసీలకే పరిమితి విధించారని సీఎం వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 90 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయపడినట్లు సమాచారం.
29న అసెంబ్లీ.. మూడు రోజుల విరామం?
అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 29వ తేదీన ప్రారంభమైన తర్వాత మూడు రోజుల విరామం ఇచ్చి, జనవరి 2 నుంచి తిరిగి కొనసాగించే అంశంపైనా మంత్రులతో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి బేసిన్లపై సమగ్ర చర్చకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ విధానం పాలమూరుతోపాటు మూడు జిల్లాలకు మరణశాసనం అయిందన్నారు. పదేళ్లలో కేసీఆర్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు.ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. కేసీఆర్ వ్యాఖ్యలను ఘాటుగా తిప్పికొట్టాలి.. అలాగే బీఆర్‌ఎస్ వైపల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలని సీఎం రేవంత్ మంత్రులకు సూచించారు
ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలపై చర్చ
వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలపైనా సమావేశంలో ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాల సవరణ, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై కూడా ప్రాథమికంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్?
గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ అంశంపైనా మంత్రులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిని కొనసాగిస్తూ, కొత్తగా ఏర్పడిన డివిజన్లతో మరో రెండు నగరపాలక సంస్థలు ఏర్పాటు చేసే అవకాశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. వీటిలో ఒకదానికి ‘సైబరాబాద్’ అనే పేరు ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. ప్రారంభంలో ఒక్కో నగరపాలక సంస్థకు 70–80 డివిజన్లు ఏర్పాటు చేసి, భవిష్యత్తులో వాటిని 100కు పెంచే ప్రతిపాదనలపైనా చర్చ జరిగింది. నగర విస్తరణకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విస్తరణతో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, అభివృద్ధి పనులు వేగవంతం అవువుతాయని మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం.
సర్పంచులతో భారీ సభ యోచన
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గెలిచిన స్థానాలు, సర్పంచుల విద్యార్హతలు వంటి అంశాలపైనా సమావేశంలో చర్చ జరిగింది. గెలిచిన సర్పంచులను ఉమ్మడి జిల్లాల వారీగా మూడు బృందాలుగా విభజించి శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. సంక్రాంతి నాటికి హైదరాబాద్‌లో సర్పంచులతో భారీ సభ నిర్వహించాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. అన్ని జెడ్పీ పీఠాలను క్లీన్‌స్వీప్ చేసేలా కార్యచరణ చేపట్టాలన్నారు. గ్రామపంచాయతీల విధులపై పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి.
‘నీళ్లు–నిజాలు’పై గట్టి వాదనలు
అసెంబ్లీ సమావేశాల్లో ‘నీళ్లు–నిజాలు’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని, నదీజలాల వాటాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులపై గట్టి వాదనలు వినిపించాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతులు లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సభలో ప్రస్తావించనున్నారు. గత ప్రభుత్వ విధానాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని సీఎం మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలకు ఇంకా సమయం వుంది. ఇప్పుడే సవాళ్లు- ప్రతి సవాళ్లు ఓ రేంజ్‌లో రీసౌండ్ ఇస్తున్నాయి. ఇక సభలో రభస ఏ లెవల్‌లో వుంటుందో అనే చర్చ జోరందుకుంది.




