పదవులపై కన్ను పార్టీ బేజారు.. టి.బిజెపిలో వింత రాజకీయం
అందివచ్చిన అవకాశాలకంటే.. అచ్చిరాని పదవులకే ప్రాధాన్యత ఇవ్వడం తెలంగాణ బిజెపిని ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న రీతిన నడుపుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకునే బిజెపి నేతలు.. రాజకీయంగా వేళ్ళూనుకుపోవడానికి అందివచ్చిన అవకాశాలను పదవుల రేసుకోసం వదిలేసుకుంటున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర బిజెపి అధ్యక్షుని ఎంపిక ప్రాసెస్ నడుస్తున్న తరుణంలో ఆర్టీసీ సమ్మెను రాజకీయ ఎదుగుదలకు వాడుకోవడంలో తెలంగాణ కమలం నేతలు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. ఓసారి చూస్తే […]

అందివచ్చిన అవకాశాలకంటే.. అచ్చిరాని పదవులకే ప్రాధాన్యత ఇవ్వడం తెలంగాణ బిజెపిని ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న రీతిన నడుపుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకునే బిజెపి నేతలు.. రాజకీయంగా వేళ్ళూనుకుపోవడానికి అందివచ్చిన అవకాశాలను పదవుల రేసుకోసం వదిలేసుకుంటున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర బిజెపి అధ్యక్షుని ఎంపిక ప్రాసెస్ నడుస్తున్న తరుణంలో ఆర్టీసీ సమ్మెను రాజకీయ ఎదుగుదలకు వాడుకోవడంలో తెలంగాణ కమలం నేతలు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.
ఓసారి చూస్తే తెలంగాణ బిజెపి ట్రాక్‌లో ఉన్నట్లు కనిపిస్తుంది.. వారం తిరిగేసరికి బోల్తా పడుతున్న పరిస్థితికి మారిపోతుంది. అందివచ్చిన అవకాశాలను వాడుకోవడం లేదు. కీలక నేతలు అసలైన టైమ్‌లో సైలెంట్ అయిపోతున్నారట. కమలం నేతలు ఎందుకు కలిసికట్టుగా ముందుకు వెళ్లలేకపోతున్నారు? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? అందివచ్చిన అవకాశాలు అందుకోవడం లేదా? గ్రూపుల గోల పార్టీలో పెరిగిందా? అసలు తెలంగాణ కమలంలో ఏం జరుగుతోంది?
కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతి హై టెన్షన్ క్రియేట్ చేసింది. అంతిమయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతిమయాత్రను బస్‌డిపోకు తీసుకువెళ్లేందుకు కార్మికులు చేసిన ప్రయత్నంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో తనపై పోలీసులు చేయి చేసుకున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపణలు చేశారు.
బండి సంజయ్‌పై దాడి విషయంపై లోకల్‌గా కొంత సానుభూతి వచ్చింది. అయితే ఈ అంశాన్ని పార్టీ పరంగా ఉపయోగించుకుని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమ్మెపై ఉధృతంగా ముందుకు వెళుతుందని సంజయ్ అనుచరులు భావించారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం వేరే జరిగింది. కనీసం ఈ ఘటనను ఏ ఒక్క నేత పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దాంతో సంజయ్ స్వయంగా ఢిల్లీ వెళ్ళి.. కరీంనగర్ పోలీసుల ఓవరాక్షన్‌పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫోటోలను జతపరిచి పరిస్థితిని వివరించారు. అటు జాతీయ మానవహక్కుల కమిషన్ కూడా కరీంనగర్ పోలీసుల యాక్షన్‌పై తెలంగాణ డిజిపిని నివేదిక కోరినట్లు సమాచారం.
ప్రతి అంశంలో ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వం దుమ్ము దులిపే రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్… ఈవిషయంలో మాత్రం ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇతర నేతలు ఎవరూ కనీసం స్పందించలేదు. మీడియా ముఖంగా ఖండించలేదు. సహచర బీజేపీ ఎంపీ అరవింద్ ఒక్కరే ప్రెస్‌మీట్ పెట్టి సంజయ్‌పై దాడిని ఖండించారు.
అయితే ఎంపీపై దాడి జరిగితే కనీసం ఒక్క నేత ఎందుకు స్పందించలేదని బీజేపీ ఆఫీసులో ఆరా తీస్తే అసలు విషయాలు బయటపడ్డాయి. డిసెంబర్‌లో కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రాబోతున్నారు. అధ్యక్ష రేసులో సంజయ్ కూడా ఉన్నారు. ఈ ఇష్యూను హైలెట్ చేస్తే సంజయ్‌కు మైలేజీ వస్తుంది. అధ్యక్ష రేసులో ఆయన ముందుకు వెళుతారు. ఇది గమనించిన పార్టీ పెద్దలు ఈ ఘటనకు ప్రయారిటీ ఇవ్వలేదనేది సంజయ్ అనుచరుల ఆరోపణ. సంస్థాగత ఎన్నికల నేపథ్యంలోనే ఎవరి ఎజెండాను వారు అమలు చేస్తున్నారని నాంపల్లి ఆఫీసులో గుసగుసలు విన్పిస్తున్నాయి.
