Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెజవాడ దుర్గమ్మ సేవకులకు హడల్, ఏసీబీ దాడులతో ఎవరి సీటుకు ఎసరొస్తుందోనన్న గుబులు, అవినీతి అధికార్ల బేజారు

అమ్మవారి ఆలయంలో మొదటిసారి పాపభీతి కనిపిస్తోంది. దుర్గమ్మ ఆగ్రహిస్తుందని కాదు...ఏసీబీ దాడులతో ఎవరి సీటుకు ఎసరొస్తుందోనన్న భయం...

బెజవాడ దుర్గమ్మ సేవకులకు హడల్, ఏసీబీ దాడులతో ఎవరి సీటుకు ఎసరొస్తుందోనన్న గుబులు, అవినీతి అధికార్ల బేజారు
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 24, 2021 | 6:05 PM

అమ్మవారి ఆలయంలో మొదటిసారి పాపభీతి కనిపిస్తోంది. దుర్గమ్మ ఆగ్రహిస్తుందని కాదు…ఏసీబీ దాడులతో ఎవరి సీటుకు ఎసరొస్తుందోనన్న భయం. ఇప్పటికే 15 మంది సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడటంతో…తమదాకా వస్తుందేమోనని మరికొందరు హడలిపోతున్నారు. మూడు వెండిసింహాల మాయం తదితర అంశాల్లో ఈవో వైఫల్యంపై ఏసీబీ నివేదిక ఇచ్చింది. 16 అంశాల్లో ఈవో పాత్రపై దేవాదాయశాఖ నివేదిక సమర్పించింది. ఏడు విభాగాల్లో అక్రమాలపై ఈవో, ఏఈవోలపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. అంతేకాదు, దుర్గగుడిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకుంది. జమ్మిదొడ్డిలోని ఆలయ పరిపాలనా కార్యాలయంలో 15 మంది అధికారుల బృందం ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఇంద్రకీలాద్రి అక్రమాల్లో ఈవో పాత్రపైనా ఆరోపణలు ఈవో సురేష్‌బాబు పాత్రపై విచారణ జరపాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కట్ చేస్తే, ఏమో..తెలీదు..చెప్పలేను…ఇలాగే ఉంది దుర్గగుడి ఈవో సురేష్‌ రియాక్షన్‌. ఏసీబీ ఎంక్వైరీపై టీవీ9 ప్రశ్నిస్తే…చైర్మన్‌తో మాట్లాడుకోండంటూ దాటవేశారు ఈవో. దుర్గగుడి అక్రమాలన్నింటికీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసే బాధ్యుడన్నారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. చీరల నుంచి కానుకల లెక్కింపులో అక్రమాలదాకా అన్నిట్లో మంత్రి పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. మంత్రి తప్పులకు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నారన్నారు బుద్ధా వెంకన్న. అటు, వెల్లంపల్లి శ్రీనివాస్‌పై ఆరోపణల్ని మంత్రి పేర్ని నాని ఖండించారు. అవినీతిని ఉపేక్షించని ప్రభుత్వం కాబట్టే..స్వచ్ఛందంగా ఎంక్వయిరీ చేయిస్తోందన్నారు. దేవాదాయశాఖ మంత్రిపై కొందరు నిందలు మోపడం దారుణమన్నారు పేర్నినాని.

అటు ఏసీబీ విచారణను స్వాగతించారు దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడు. ఏసీబీ నివేదికపై పాలకమండలి సభ్యులతో కమిటీ వేస్తామన్నారు. కమిషనర్‌ చెప్పిన కొన్ని విషయాలతో తాము ఏకీభవించమన్నారు సోమినాయుడు. మ్యాక్స్‌ సెక్యూరిటీకి టెండర్‌ ఇవ్వాలని డిసెంబర్‌లో నిర్ణయించామని చెప్పారు. ఈవో, కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినా.. ఇప్పటిదాకా కమిషనర్‌ ఏ విషయం చెప్పలేదన్నారు చైర్మన్‌ పైలా సోమినాయుడు. ఈవోగా సురేష్‌బాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస వివాదాలు చుట్టుముట్టాయి. దేవాదాయశాఖకు, ఏసీబీకి నిత్యం ఫిర్యాదులు వెళ్లేవి. ప్రాథమికంగా సాక్ష్యాలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. దుర్గగుడిలో కొంతమంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. ప్రతి పనిలో కమిషన్లదే రాజ్యంగా మారింది. విభాగాధిపతుల నుంచి ఉన్నతాధికారి వరకు కళ్లకు గంతలు కట్టుకోవడంతో అక్రమానిదే రాజ్యమైంది. బినామీలు చెలరేగిపోయారు. కోట్లు దోచుకున్నారు.

మూడు సింహాల వ్యవహారంలోనూ ఈవో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కనిపించకుండా పోయిన వెండి సింహాలు స్టోర్‌ రూంలో ఉన్నాయని ఒకసారి, తనిఖీ చేయాలని ఇంకోసారి పొంతన లేకుండా చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జాప్యం చేశారు. సంబంధిత బాధ్యులను గుర్తించడంలోనూ లేట్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివాదం చెలరేగిన దుర్గగుడి అధికారులు సైలెంట్‌గా ఉండిపోయారు. సెక్యూరిటీ టెండర్లు, దర్శన టిక్కెట్లు,‌ చీరల విక్రయాల్లోనూ భారీగా అవకతవకలను గుర్తించింది ఏసీబీ. ప్రసాదం కౌంటర్‌లో, సామగ్రి కొనుగోలులో ఇలా ప్రతి సెక్షన్‌లో అక్రమాలు ఏసీబీ ఎంక్వయిరీలో బయటపడ్డాయి. ఇంత జరిగినా ఈవోకు తెలియకుండా పోతుందా అనేది చర్చనీయాంశమైంది.

Read also :

చీటింగ్‌.. విలాసవంతంగా బతకడం, అదే టార్గెట్‌. సిటీలో కిలాడీ లేడీ ట్రాప్‌లో పడి 11 కోట్లు సమర్పించుకున్న వ్యాపారి, సూసైడ్