Central Cabinet Expansion : కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణకు మరో బెర్త్..! గిరిజన నేత సోయం బాపూరావుకు ఛాన్స్?
Central Cabinet Expansion : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణకు మరొక బెర్త్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ
Central Cabinet Expansion : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణకు మరొక బెర్త్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా జి. కిషన్ రెడ్డి పనిచేస్తుండగా, ఆయనకు సహాయ మంత్రి నుంచి స్వతంత్ర హోదా కలిగిన సహాయమంత్రిగా పదోన్నతి కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో తెలంగాణ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు కేబినెట్ విస్తరణలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటికే కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోత్‌ను కర్నాటక గవర్నర్‌గా పంపగా, మరికొందరికి ఉద్వాసన పలకనున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో గిరిజన వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్న అర్జున్ ముండాతో పాటు సహాయ మంత్రి రేణుక సింగ్ సరుటను మంత్రివర్గం నుంచి తొలగించి, ఎన్డీయే-1లో గిరిజన వ్యవహారాల మంత్రిగా పనిచేసిన జ్యుయల్ ఓరమ్‌కు మళ్లీ తిరిగి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. సహాయ మంత్రిగా తెలంగాణకు చెందిన గిరిజన – ఆదివాసీ నేత సోయం బాపూరావుకు చోటు కల్పించనున్నట్టు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈసారి విస్తరణలో చోటు కల్పించవచ్చని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబును గవర్నర్‌గా నియమించినందున, అదే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కొందరు నేతలు భావిస్తున్నారు. పైగా ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు కూడా లేకపోవడం మరో కారణమని వారు చెబుతున్నారు.
ముహూర్తం ఖరారు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు జూన్ 7న (బుధవారం) సాయంత్రం గం. 5.30 నుంచి గం. 6.00 మధ్య సమయాన్ని ముహూర్తంగా ఖరారు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలువురు నేతలకు ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ కాల్స్ వెళ్లగా, వారంతా తమ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హుటాహుటిన ఢిల్లీ బాట పట్టారు. ఈ జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా మొదటి వ్యక్తిగా చెప్పవచ్చు. మాల్వా-నిమార్ ప్రాంతంలో పర్యటిస్తున్న సింధియాకు ఫోన్ రావడమే ఆలస్యం తన పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీ బయల్దేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సింధియాతో పాటు శర్బానంద్ సోనోవాల్, నారాయణ్ రాణే, వరుణ్ గాంధీ, ఎల్జేపీ నేత పశుపతి పరాస్ తదితరులు కూడా ఢిల్లీ బాట పట్టారు.
యువ కేబినెట్ కేంద్ర మంత్రివర్గంలో గరిష్టంగా 81 మంది వరకు చోటు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం 53 మంది మంత్రులున్నారు. వారిలో థావర్‌చంద్ గెహ్లోత్‌ను కర్నాటక గవర్నర్‌గా నియమించినందున, 52 మందినే పరిగణలోకి తీసుకోవాలి. ఈ లెక్కన ఇంకా 29 మంది వరకు చోటు కల్పించవచ్చు. అయితే కొత్తగా 20 మందికి పైగానే కేంద్ర కేబినెట్‌లో చేర్చుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి విస్తరణలో యువ నేతలకు అధిక ప్రాధాన్యతనిచ్చి దేశంలోనే యువ మంత్రివర్గంగా తీర్చిదిద్దనున్నట్టు తెలుస్తోంది. అలాగే పాలనా అనుభవం కలిగిన మహిళా నేతలకు కూడా ప్రాధాన్యత కల్పించనున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలకు కూడా ఈసారి పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది.
గవర్నర్ల నియామకంలోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, జాట్ వంటి సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిచ్చినట్టు స్పష్టమవుతోంది. ఈ తరహాలో ఇప్పటికే కేబినెట్లో ఉన్నవారితో కలుపుకుని కనీసం 24 మంది ఓబీసీ నేతలు కేబినెట్లో ఉండేలా కూర్పు జరుగుతోంది. ఈసారి విస్తరణలో విద్యాధికులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీహెచ్డీ, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు వైద్య విద్య, న్యాయ విద్య వంటి వృత్తిపరమైన విద్యనభ్యసించిన ఎంపీలకు ప్రాధాన్యతనిస్తూ.. సమాజంలో ఆయా రంగాల్లో పేరు తెచ్చుకున్న నిపుణులకు చోటు కల్పించనున్నట్టు తెలుస్తోంది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం ఉండేలా కేబినెట్ కూర్పు ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఆశావహులు.. అవకాశాలు ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆ రాష్ట్రాలకు కేబినెట్ విస్తరణలో ఎక్కువ ప్రాధాన్యత లభించనుంది. ఇందులో 80 పార్లమెంట్ స్థానాలు కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకం. ఈ రాష్ట్రంలో బీజేపీ నేతలతో పాటు మిత్రపక్షం అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్‌కు కేబినెట్లో చోటు కల్పించనున్నట్టు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ సర్కారు ఏర్పాటు చేసేందుకు సహకరించిన యువనేత జ్యోతిరాధిత్య సింధియాకు ప్రతిఫలంగా కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఖరారు చేస్తారని గతంలోనే విస్తృతంగా చర్చ జరిగింది. దాన్ని నిజం చేస్తూ ఆయనకు ఆహ్వానం కూడా అందింది. మరోవైపు అస్సాం మాజీ సీఎం శర్బానంద్ సోనోవాల్, రాష్ట్రంలో పార్టీని గెలిపించి వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి పదవిని హిమంత బిశ్వ శర్మ కోసం త్యాగం చేశారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఖరారైంది. కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరిన ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన నేత జితిన్ ప్రసాదకు వివిధ సమీకరణాల నేపథ్యంలో కేబినెట్లో చోటు కల్పించనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎన్డీయే విస్తరణ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎన్డీయే మిత్రపక్షాలన్నింటికీ చోటు కల్పించనున్నట్టు తెలుస్తోంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత రాందాస్ అథవాలే మినహాయిస్తే పేరుకు ఎన్డీయే ప్రభుత్వమే అయినా, ఉన్నదంతా బీజేపీ మంత్రులే. శివసేన, అకాలీదళ్ ఎన్డీయేను వీడి వెళ్లిపోవడం, పదవుల విషయంలో పేచీతో జేడీ(యూ) చేరకపోవడం, ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ మృతి వంటి కారణాలతో కేంద్ర మంత్రివర్గం బీజేపీకే పరిమితమైంది. ఈసారి విస్తరణలో మిత్రపక్షాలందరికీ చోటు కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఎన్డీయేలో భాగమైన జేడీ(యూ) ఇప్పుడు జరుపుతున్న విస్తరణలో చేరుతోందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ ధృవీకరించిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి ఆర్సీపీ సింగ్‌కు బెర్త్ ఖరారుకానున్నట్టు తెలుస్తోంది.
ఆయనతో పాటు నితీశ్ సూచించిన మరొకరికి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత, కేంద్ర మంత్రిగా ఉన్న రాంవిలాస్ పాశ్వాన్ మరణం తర్వాత పార్టీలో చీలక ఏర్పడింది. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను వేరు చేసి మిగతా నేతలంతా పశుపతి పరాస్ నేతృత్వంలో ఒక్కచోటకు చేరారు. ఈ వర్గానికి నేతృత్వం వహిస్తున్న పరాస్‌కు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే చీలిక అనంతరం మిగిలిన చిరాగ్ పాశ్వాన్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. మరో మిత్రపక్షం అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్ ఎన్డీయే-1లో సహాయమంత్రిగా పనిచేశారు. అప్పుడు కూడా యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిపిన విస్తరణలో చోటు కల్పించగా, ఈ విస్తరణలోనూ అదే మాదిరిగా చోటు కల్పించనున్నట్టు తెలుస్తోంది. (Mahatma Kodiyar, TV9 Telugu, Delhi)