కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి.. అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశం

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి..

కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి.. అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశం
Atp Collector
Follow us
K Sammaiah

|

Updated on: Mar 12, 2021 | 2:09 PM

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లోని సమావేశ భవనంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జాగ్రత్తగా చేపట్టాలని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఓటు విలువైనదేనని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదని, కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమన్నారు. కౌంటింగ్ హాల్లో ఫ్యాన్లు, నీటి సరఫరా, లైటింగ్ సౌకర్యం కల్పించాలని, గాలి వెలుతురు వచ్చేలా చూడాలని, అన్ని చోట్ల విద్యుత్ సౌకర్యం ఉండాలని, జనరేటర్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా కౌంటింగ్ చేపట్టాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పనిచేయాలని, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మరియు సిబ్బంది అందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు.

జిల్లాలో ఒక నగర పాలక సంస్థ, 10 మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 10వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా పూర్తయిందని, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కూడా సజావుగా జరిగేలా అన్ని విధాల సిద్ధం కావాలన్నారు. ఇంతకుముందు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విజయవంతంగా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ను చేపట్టామని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కూడా ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించామని, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జయప్రదం చేయాలన్నారు. ఇందుకు అనుగుణంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై నిబంధనల గురించి జిల్లా కలెక్టర్ కూలంకషంగా వివరించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కౌంటింగ్ ఎలా చేపట్టాలి అనే అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి, మాస్టర్ ట్రైనర్ మరియు రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, కౌంటింగ్ సూపర్ వైజర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More:

వరంగల్‌లో జాతీయ జెండావిష్కరించిన గవర్నర్‌.. తమిళిసైకి ఘన స్వాగతం పలికిన మంత్రి ఎర్రెబెల్లి