- Telugu News Photo Gallery TSRTC to soon introduce AC electric buses in Hyderabad City, Says MD Sajjanar
TSRTC: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయ్..! ఫొటోలు చూశారా..
హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నమూనాలు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (ఐపీఎస్) పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ పలు సూచనలు సైతం చేశారు. వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
Updated on: Aug 07, 2023 | 9:18 PM

TSRTC electric buses: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. రానున్న రోజుల్లో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. వీటిని పలు రూట్లలో నడపనున్నారు.

దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నమూనాలు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (ఐపీఎస్) పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ పలు సూచనలు సైతం చేశారు. వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

ఈ క్రమంలో ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ (OGL)కు 550 ఎలక్ట్రిక్ బస్సులకు TSRTC ఆర్డర్ ఇచ్చింది. వీటిలో 500 బస్సులను హైదరాబాద్ నగరంలో నడిపేందుకు.. 50 బస్సులు హైదరాబాద్ - విజయవాడ మార్గంలో నడపాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే.. ఇప్పటికే విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. అయితే, హైదరాబాద్లో తొలి దశలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వాటిలో 20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో.. మరో 30 ఐటీ కారిడార్లో నడుస్తాయి. వాటిలో 25 బస్సులను త్వరలోనే ప్రారంభించనున్నారు.

మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) హైదరాబాద్ నగరంలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. అందులో 50 ఏసీ బస్సులుండగా.. మిగతావి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులు ఉండనున్నాయి. సిటీలో మొత్తం మరో 800 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ ప్రాసెస్ లో ఉన్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

12 మీటర్ల పొడవు ఉండే.. ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు హైటెక్ హంగులు ఉండనున్నాయి. 35 సీట్ల సామర్థ్యంతో మొబైల్ చార్జింగ్, సీటు బెల్ట్ సదుపాయం, సీసీటీవీ కెమెరాలు ఉండనున్నాయి. గమ్యస్థానాల వివరాల కోసం బస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులు, ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్) ఉండనుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.





























