- Telugu News Photo Gallery Spiritual photos Vinayaka Chavithi 2024: Mangalore Ganesha idol sent to California, Mannagudde family making Ganapati idols for 95 years
Vinayaka Chavithi 2024: 95 ఏళ్లుగా గణేశ విగ్రహాలను తయారు చేస్తున్న ఫ్యామిలీ.. మంగళూరు నుంచి కాలిఫోర్నియాకు చేరుకున్న బొజ్జ గణపయ్య
వినాయక చవితి పండగ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా గణేష చతుర్థి పండుగ సందడి మొదలైంది. గణపతి నవరాత్రి ఉత్సవాలు, మండపాల్లో గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం సర్వత్రా సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు వినాయక చవితి పండగ జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారత్ కు సుదూర ప్రాంతం అయిన కాలిఫోర్నియాలో వినాయకుడిని ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తోండగా.. ఇప్పటికే మంగళూరు నుంచి వినాయక విగ్రహం అమెరికాకు చేరుకుంది.
Updated on: Sep 03, 2024 | 5:04 PM

కాలిఫోర్నియాలోని షేర్లేకర్ కుటుంబం మంగళూరు నుంచి గణపన విగ్రహాన్ని అగ్రరాజ్యం అమెరికాకు తెప్పించుకుంది. కాలిఫోర్నియాకు చెందిన ఓ కుటుంబం మంగళూరులోని మన్నగుడ్డే సమీపంలోని ఓ కుటుంబం తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని విమానంలో తమ ఇంటికి తెప్పించుకున్నారు.

మంగళూరు మన్నగుద్దెకు చెందిన డాక్టర్ మోహన్ రాయ్ ప్రారంభించిన గణేశ విగ్రహ నిర్మాణం 95 ఏళ్లుగా నిరంతరం కొనసాగుతోంది. ఇప్పుడు ఆయన నాలుగో తరం వినాయక విగ్రహాల తయారీ పనులు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు వేర్వేరు హోదాల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ గణేశ విగ్రహాన్ని తయారు చేసేందుకు మాత్రం రెండు నెలలు సెలవు తీసుకుంటారు. కుటుంబ సమేతంగా విగ్రహాలను సిద్ధం చేస్తారు.

ఇప్పటికే ఇంట్లో 260 గణేశ విగ్రహాలను తయారు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగే గణేశోత్సవాలకు విగ్రహాల తరలింపు జరుగుతోంది, ఈ కుటుంబానికి చెందిన గణేశ విగ్రహానికి దేశ విదేశాల్లో డిమాండ్ ఉంది.

ఈ కుటుంబం పర్యావరణ అనుకూల గణపయ్య విగ్రహాలను తయారు చేస్తుంది. విగ్రహం మట్టితో తయారు చేస్తారు. మన్నగుద్దె సమీపంలోని మోహన్ రాయ్ వారసుల ఇల్లు వినాయక చవితి సందర్భంగా అక్షరాలా గణపతి దేవాలయంగా మారుతుంది.

95 సంవత్సరాల క్రితం, ఈ ఇంటి పెద్ద శ్రీ మోహన్ రాయలు గణపతి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇక్కడ తయారు చేసే గణపతులను మట్టి వంటి పర్యావరణ హిత పదార్ధాలతో తయారుచేస్తారు.

గణేశుడి జన్మనక్షత్రం చిత్త నక్షత్రం రోజున గణపతి విగ్రహాల తయారీకి ముహూర్తంగా భావించి ఆ రోజు నుంచి విగ్రహాల తయారీని మొదలు పెడతారు. పౌర్ణమి రోజున విగ్రహాలకు రంగులు వేయడం ప్రారంభిస్తారు. దాదాపు రెండు నెలల వ్యవధిలో మొత్తం 260 పెద్ద, చిన్న గణపతి విగ్రహాలను తయారు చేశారు. దేశ విదేశాల్లో ఉన్న ఈ కుటుంబ సభ్యులంతా ఒక్కరోజైనా ఈ గణపతి విగ్రహాన్ని తయారు చేయడంలో చేతులు కలుపుతారు.

ఈ కుటుంబం మంగళూరులో 16 ప్రసిద్ధ పబ్లిక్ గణేష్ ఉత్సవాలకు గణేశ విగ్రహాలను సరఫరా చేస్తుంది. గణపతి విగ్రహాన్ని విమానంలో అమెరికాలోని షేర్లేకర్ కుటుంబానికి కూడా పంపించారు. ఈ కుటుంబం విగ్రహం కొనుగోలుదారుల నుంచి ఇంత డబ్బులు ఇవ్వమని డిమాండ్ చెయ్యరు. ఎవరైతే వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేస్తారో.. వారు భక్తితో ఇష్టంగా ఇచ్చిన డబ్బులను స్వీకరిస్తారు.




