- Telugu News Photo Gallery Rain Alert for Andhra Pradesh and Telangana Next 4 days Latest Weather News Here
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజులు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
దక్షిణ థాయ్‌లాండ్‌ను ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. దాని ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
Updated on: Nov 28, 2023 | 12:54 PM

దక్షిణ థాయ్‌లాండ్‌ను ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. దాని ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని, ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడనుందని తెలిపింది.

బంగాళాఖాతంలో వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుపానుగా మారుతుందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. మరో నాలుగు రోజులు పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మంగళవారం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలతోపాటు పలు ప్రదేశాలలో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జనగాం, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.

ద్రోణి, ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కడలూరు, తిరునల్వేలి, మైలదుత్తరై, పెరంబలూరు, విల్లుపురం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.





























