- Telugu News Photo Gallery Political photos YCP Manifesto 2024: CM Jagan said in YCP manifesto that Visakhapatnam is capital of Andhra Pradesh
YS Jagan: ‘కచ్చితంగా గెలుస్తా’.. విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్..
విశాఖపట్నం నగరాన్ని ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని చేస్తానంటున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఈసారి నేరుగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఆ అంశాన్ని చేర్చడం టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారింది. గతంలో విశాఖ రాజధాని అని చెప్పి ఎన్నికలకు వెళ్లాల్సిందని నిన్నటి వరకు ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తూ వచ్చాయి..
Updated on: Apr 27, 2024 | 9:36 PM

విశాఖపట్నం నగరాన్ని ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని చేస్తానంటున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఈసారి నేరుగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఆ అంశాన్ని చేర్చడం టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారింది. గతంలో విశాఖ రాజధాని అని చెప్పి ఎన్నికలకు వెళ్లాల్సిందని నిన్నటి వరకు ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తూ వచ్చాయి.. ఈ నేపథ్యంలో రాజధాని అంశాన్ని మేనిఫెస్టోలో ప్రస్తావిస్తారా లేదా అన్న చర్చ జరుగుతూ వచ్చింది. తాజాగా వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టగానే విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పారు.

రాజధానిగా మార్చి విశాఖను రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుస్తామన్నారు. మళ్లీ 2024 లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, రాగానే విశాఖ రాజధానిగా పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. శనివారం తాడేపల్లి లోని తన క్యాంప్ కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేశారు సీఎం జగన్..

రాజధాని... గ్రోత్ ఇంజిన్: రాజధానిగా మార్చిన తర్వాత విశాఖను రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా తీర్చి దిద్దుతామన్నారు వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

విశాఖలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం: తాను ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని, విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని అక్కడి నుంచే పాలన చేస్తానని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేసి ఉన్నారు. తాజాగా మేనిఫెస్టో ప్రకటిస్తున్న నేపథ్యంలో కూడా మరొకసారి దీన్ని నొక్కివక్కాణించారు. నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని.. మేనిఫెస్టోలో పెడితే భగవద్గీత, ఖురాన్, బైబిల్ లో పెట్టినట్లేనని అందుకే అమలు చేసి తీరుతానని హామీ ఇచ్చారు.

ఇటీవల ముఖ్యమంత్రి ఎన్నికల షెడ్యూల్‌కు ముందు విశాఖలో పర్యటించిన సమయంలో కూడా విజన్ విశాఖ పేరుతో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో కూడా తాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని విశాఖ నుంచే పాలన కొనసాగిస్తానని కూడా చెప్పడం విశేషం. తాజాగా మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చడంపై రాష్ట్ర మొత్తం మీద ఆసక్తికర చర్చ జరుగుతుంది.
