పాదయాత్రల పర్వంలోకి మరో యువనేత.. 2024 ఎన్నికలే లక్ష్యంగా లోకేశ్ పాదయాత్ర.. చరిత్రలో ఎందరున్నా వైఎస్ఆర్ ప్రజాప్రస్థానమే చారిత్రాత్మకం
మరో పాదయాత్రకు రంగం సిద్దమైంది. తేదీ కూడా వెల్లడైంది. రాజకీయ ప్రస్థానంలో తమ అభ్యర్థిత్వాన్ని మెరుగుపరచుకునేందుకు ఏకైక అస్త్రంగా ఇపుడు అధినేతలు పాదయాత్రనే నమ్ముకుంటున్నారనడానికి తాజాగా ప్రకటించిన...
ఎస్.. మరో పాదయాత్రకు రంగం సిద్దమైంది. తేదీ కూడా వెల్లడైంది. రాజకీయ ప్రస్థానంలో తమ అభ్యర్థిత్వాన్ని మెరుగుపరచుకునేందుకు ఏకైక అస్త్రంగా ఇపుడు అధినేతలు పాదయాత్రనే నమ్ముకుంటున్నారనడానికి తాజాగా ప్రకటించిన నారా లోకేశ్ పాదయాత్ర ఉదాహరణగా నిలుస్తోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి శ్రీనగర్ దాకా భారీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దాటి ఇపుడు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. మొత్తం 3,500 కిలో మీటర్ల మేరకు ఆయన పర్యటించనున్నారు. తన రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం, అతిపెద్ద సాహస కార్యం ఇదేనని చెప్పాలి. ఇక ఏపీలో సోదరునితో కలహం కారణంగా తెలంగాణ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తరలి వచ్చిన వైఎస్ షర్మిల ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇటీవలెనే ఆమె 3 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటారు. తాజాగా మరో పద్దెనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ సమాయత్తమయ్యారు. ఇందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. 2024 ఏప్రిల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో దాదాపు ఏడాది పాటు కొనసాగేలా లోకేశ్ పాదయాత్ర రూట్ మ్యాప్‌ని తెలుగుదేశం పార్టీ సిద్దం చేస్తోంది.
జనవరి 27న ప్రారంభం
2023 జనవరి 27వ తేదీన లోకేశ్ తన పాదయాత్రను తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్గాలు తేదీని ధృవీకరించాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లోకేశ్ పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు. ఏడాది పాటు ప్రజల్లో వుండేలా ఈ యాత్రను రూపొందిస్తున్నారు. యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం ప్రధానాంశాలుగా లోకేశ్ పాదయాత్ర నిర్వహిస్తారని తెలుస్తోంది.
పాదయాత్రంటే గుర్తొచ్చేది వైఎస్సారే
గతంలో తన ఆరు పదుల వయస్సులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో పాదయాత్రల సరళిని పరిశీలిస్తే మనకు ముందుగా గుర్తొచ్చే నేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పాదయాత్రకు ముందు వైఎస్ఆర్, ఆయన సన్నిహిత నేత డా. కేవీపీ రామచంద్రరావు నిర్వహించిన ప్లానింగ్ సమావేశాల్లో పలువురు పాదయాత్ర వద్దని, వాహనంలో ప్రయాణిస్తూ జనావాస ప్రాంతాల్లో కొద్ది దూరం నడిచి, అక్కడికక్కడ ఏర్పాటు చేసే స్ట్రీట్ మీటింగుల్లో ప్రసంగిస్తే చాలని వైఎస్ఆర్‌కు నచ్చచెప్పారు. కానీ అది సరిపోదని భావించిన వైఎస్ఆర్.. సాహసోపేత నిర్ణయంతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 2003 ఏప్రిల్ 9వ తేదీన ఆనాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించారు. ప్రజాప్రస్థానం పేరిట కొనసాగిన పాదయాత్రలో వైఎస్ఆర్ రెండు నెలల పాటు సుమారు 1500 కిలోమీటర్లు నడిచారు. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల గుండా వైఎస్ఆర్ పాదయాత్ర కొనసాగి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా వెళ్ళింది. చివరికి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద వైఎస్ఆర్ పాదయాత్ర ముగిసింది. మండుటెండలో కాళ్ళకు బొబ్బలెక్కినా ఆయన కొనసాగించిన పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలో మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత 2004లో జరిగిన సమైక్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడానికి పునాదులు వేసింది. తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 మే 16వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన పాదయాత్రలో రైతాంగ సమస్యలే ప్రధానంగా వినిపించిన నేపథ్యంలో చారిత్రాత్మక నిర్ణయంతో వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన ఫైలుపైనే ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం చేశారు. హైదరాబాద్ నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో అశేష జనవాహిని మధ్య సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అదే వేదిక మీద ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. తిరుగులేని రాజకీయ చతురతతో, వ్యూహాలతో ఆరేళ్ళ పాటు బలమైన ముఖ్యమంత్రిగా కొనసాగిన వైఎస్ఆర్.. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలు కాకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈనాటి పరిస్థితి దిశగా దారి తీసేవి కావంటే అతిశయోక్తి కాదు. నిజానికి పాదయాత్రల పర్వానికి వైఎస్ఆర్ కంటే ముందే చాలా మంది శ్రీకారం చుట్టారు. అయినా తెలుగు రాజకీయాలపై రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వేసిన ముద్ర ఇంకొకరికి సాధ్యం కాలేదు. నిజానికి ఆయన తర్వాత పాదయాత్రలు చేసిన షర్మిల, జగన్మోహన్ రెడ్డి మూడువేల కిలోమీటర్లకుపైగా నడిచారు. షర్మిల ప్రస్తుతం తెలంగాణలోను మూడువేల కిలోమీటర్ల మైలురాయిని దాటారు. చంద్రబాబు 2,800 కిలోమీటర్లకు పైగా నడిచారు. అయితేనేం పాదయాత్ర అంటే తొలుత గుర్తొచ్చే పేరు ఖచ్చితంగా వైఎస్ఆర్ దే.
మహాత్మాగాంధీనే ఆద్యుడు
దేశ చరిత్రను పరిశీలిస్తే పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం, తాము ప్రవచిస్తున్న సిద్దాంతాలను ప్రజలకు పరిచయం చేయడం వంటివి స్వతంత్ర పోరాట కాలంలోనే మొదలయ్యాయి. పాదయాత్రలకు ఆద్యునిగా చెప్పుకోవాల్సి వస్తే అది ఖచ్చితంగా మహాత్మా గాంధీనే. 1930లో ఆయన ఉప్పు సత్యాగ్రహం పేరిట నిర్వహించిన పాదయాత్ర భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత కీలక మైలురాయి. ఆ తరువాత ఆయన 1933-34లో అంటరానితనానికి వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారు పూజ్య బాపూజీ. ఆ తర్వాతి కాలంలో అంటే 1951లో ఆచార్య వినోభా భావే భూదాన్ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ నగర శివారులో వున్న పోచంపల్లి నుంచి బీహార్‌లోని బుద్దగయా వరకు పాదయాత్ర చేశారు. చేనేత చీరలకు ప్రసిద్ది గాంచిన పోచంపల్లి.. భూదాన్ పోచంపల్లిగా వినుతికెక్కడానికి వినోభా భావే భూదానోద్యమమే కారణమన్నది అందరికీ తెలిసిందే. స్వతంత్ర భారత రాజకీయాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది. మాజీ ప్రధాన మంత్రి, దివంగత నేత చంద్రశేఖర్ పాదయాత్ర. 1983లో అధికార కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న తరుణంలో చంద్రశేఖర్ ప్రజల కష్టసుఖాలు, దేశంలో పరిస్థితులు తెలుసుకునేందుకు ఆరు నెలల పాటు 4,260 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. ఇందులోభాగంగా ఆయన కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు నడిచారు.
ఆ విషయంలో చంద్రబాబుదే సాహసం
దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ నాయకులు పాదయాత్రలు చేసినప్పటికీ తెలుగు వారికి చిరస్మరణీయంగా గుర్తుండిపోయే పాదయాత్ర మాత్రం ఖచ్చితంగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. 2003లో కాంగ్రెస్ పార్టీలో ఆయన్ను తిరుగులేని నేతగా చేయడంతోపాటు బలమైన ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను గుప్పిట భిగించిన నేతగా ఆయన పరిణితి చెందారు ఆనాటి పాదయాత్ర ద్వారా. 2009 సెప్టెంబర్ 2న ఆయన హెలికాప్టర్ కూలిన దుర్ఘటనలో మరణించడం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపి వేసింది. తండ్రి మరణం తర్వాత సీఎం కావాలనుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా తోసిపుచ్చడంతో వైఎస్ జగన్ కూడా పాదయాత్రనే నమ్ముకున్నారు. తొలుత తన తండ్రి హఠాత్మరణంతో గుండెలాగి మరణించిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర పేరిట జగన్ నడక ప్రారంభించారు. ఈక్రమంలో ఆయనపై క్విడ్ ప్రోకో ఆరోపణలతో ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆయన జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ తరుణంలో పాదయాత్ర బాధ్యతలను చేపట్టిన జగన్ సోదరి షర్మిల సుదీర్ఘ పాదయాత్రను కొనసాగించారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పేరిట 2012 అక్టోబరు 18తేదీన షర్మిల పాదయాత్ర ప్రారంభించి 2013 జులై 29వ తేదీ వరకు 230 రోజుల పాటు దాదాపు 3 వేల కిలోమీటర్ల మేర నడిచారు. జగన్ జైలులో వున్న తరుణంలో పార్టీ వీక్ అవుతున్న సందర్భంలో షర్మిల సాహసించి జరిపిన పాదయాత్ర వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడకు ఎంతో ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఇక అదేసమయంలో అంటే 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు పదుల వయస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేయడం ఓ సంచలనంగానే చెప్పుకోవాలి. 2003లో పాదయాత్ర చేసేప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వయస్సు 54 ఏళ్ళుకాగా.. చంద్రబాబు తన 63వ ఏట రాజకీయ పునర్వైభవం కోసం 2013లో పాదయాత్ర చేశారు. ‘వస్తున్నా.. మీకోసం’ అంటూ చంద్రబాబు 2,817 కిలోమీటర్లు నడిచారు. 208 రోజులపాటు 16 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో పర్యటించారు. విశాఖపట్నం అగనంపూడి వద్ద పాదయాత్రకు ముగింపు పలికారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, విభజిత ఏపీకి చంద్రబాబు సీఎం అవడం మనకు తెలిసిన చరిత్రే.
ఎక్కడ మొదలైనా ఇచ్ఛాపురంలోనే ముగింపు
2009 తండ్రి మరణం తర్వాత, 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కావాలన్న కోరిక భగ్నమవడంతో 2017లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సిద్దమయ్యారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి నుంచి ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 3,600 కిలోమీటర్లకుపైగా జగన్ పాదయాత్ర నిర్వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరి నెలలో ఆయన పాదయాత్ర పూర్తి చేశారు. ఆ తర్వాత జరగిన ఎన్నికల్లో జగన్ తిరుగులేని మెజారిటీతో ఏపీ సీఎం అయ్యారు. ఇలా చరిత్రలో ఎన్నో పాదయాత్రలో అవి నిర్వహించిన వారికి తాము కోరుకున్న పదవులను కట్టబెట్టాయి. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2014లో చంద్రబాబు, 2019లో వైఎస్ జగన్ ఇలా పాదయాత్రల ద్వారానే సీఎంలు కాగలిగారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో తనదైన పట్టును భిగించాలనుకుంటూ, తండ్రి చంద్రబాబుకు తగిన వారసుడు అనిపించుకునే ప్రయత్నంలో భాగంగా నారా లోకేశ్ సుదీర్ఘ పాదయాత్రకు సిద్దమయ్యారు. జనవరి 2023 నుంచి జనవరి 2024 దాకా ఏపీవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించేందుకు లోకేశ్ సిద్దమవుతున్నారు. ఇందుకోసం రూట్ మ్యాప్ సిద్దమవుతున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడో విశేషం చెప్పుకోవాలి. తెలుగు రాజకీయ నాయకుల పాదయాత్రలు ఎక్కడ ప్రారంభమైన చివరికి ఇచ్ఛాపురంలోనే ముగుస్తున్నాయి. 2003లో వైఎస్ఆర్, 2019లో వైఎస్ జగన్ వేర్వేరు ప్రాంతాల నుంచి పాదయాత్రలు ప్రారంభించి ఇచ్ఛాపురంలోనే ముగింపు పలికారు. ప్రస్తుతం లోకేశ్ కూడా చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నడవడం మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయనున్నారు. మరి లోకేశ్ రాజకీయ లక్ష్యం ఈ పాదయాత్ర ద్వారా ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాలి.