Omicron Variant: ఒమిక్రాన్‌పై నిర్లక్ష్యం కూడదని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు!

Omicron Variant: ఒమిక్రాన్‌పై నిర్లక్ష్యం కూడదని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు!

కరోనా మహమ్మారి అంతిమ దశలో ఉందని సంబరపడితే అంతకంటే తెలివితక్కువ తనం మరోటి ఉండదు. కరోనా వైరస్‌(Corona Virus) ఇప్పట్లో..

Balu

| Edited By: Ravi Kiran

Jan 25, 2022 | 2:43 PM

కరోనా మహమ్మారి అంతిమ దశలో ఉందని సంబరపడితే అంతకంటే తెలివితక్కువ తనం మరోటి ఉండదు. కరోనా వైరస్‌(Corona Virus) ఇప్పట్లో అంతమయ్యే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. ఇప్పటికే అనేక వేరియంట్లతో ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఆ మహమ్మారి మరిన్ని కొత్త రూపాలతో విరుచుకుపడే అవకాశాలున్నాయని, ఈ దశలో ప్రజలుఅప్రమత్తంగా ఉండటమే శ్రేయస్కరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. కరోనా విషయంలో ఒమిక్రానే(Omicron) చివరి వేరియంట్‌ అని, ఇక్కడితో ఆ వైరస్‌ అంతమవుతుందని అనుకోవడమే ప్రమాదకరమని చెబుతోంది. ఎప్పుడు పీడ విరగడవుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే ఒమిక్రాన్‌ అల్లకల్లోలం చేస్తోంది. తగ్గేదేల్యే అంటూ విజృంభిస్తోంది. మన దేశంలో కొద్ది రోజుల నుంచి రోజువారీ కేసులు మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. అయితే థర్డ్‌ వేవ్‌(Third Wave)కు కారణమైన ఒమిక్రాన్‌ ఇప్పుడు సామాజిక వ్యాప్తి దశలో ఉందని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌ 2 జీనోమిక్స్‌ సీక్వెన్సింగ్‌ కన్సార్టియమ్‌ హెచ్చరిస్తోంది. కరోనా ప్రమాద స్థాయి అలాగే ఉందని అంటోంది. అయితే మూడో వేవ్‌ ఉధృతి ఫిబ్రవరి మూడో వారానికి కల్లా తగ్గుముఖం పడుతుందనే చల్లటి కబరు కూడా చెప్పింది. రానున్న 15 రోజుల్లో థర్డ్‌ వేవ్‌ తారస్థాయికి చేరుకుంటుందట! అందుకని అప్రమత్తతో మెలగడం ఎంతైనా అవసరమని సూచిస్తోంది.

ఒమిక్రాన్‌ ఎంత వేగంగా విస్తరిస్తున్నదంటే గత రెండు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మందికి అంటుకుంది. దాదాపు 170 దేశాలలో తన తడాఖా చూపిస్తోంది. ఒమిక్రాన్‌ పూర్తిగా కనుమరుగైతే కరోనా ఖతమైనట్టేనని చాలా మంది అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు.. ఆ భావనతోనే కరోనా నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఇక ఏమీ కాదులేనన్న భరోసాతో జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. ఆరంభంలో ఒమిక్రాన్‌ ఢిల్లీని కుదిపేసింది. తర్వాత ముంబాయిని వణికించింది. ఇప్పుడా రెండు మహానగరాలలో మూడో వేవ్‌ కాసింత తగ్గు ముకం పట్టింది కానీ.. దేశంలో మిగతా చోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో శరవేగంగా విస్తరిస్తోంది. ఇదే ఆందోళన కలిగించే అంశం.

కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడంతో సహజంగానే పలు సంస్థలలో సిబ్బంది తగ్గారు. కరోనా సోకిన వారు ఇంటిపట్టునే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఈ ప్రభావం వైద్యరంగంమీద కూడా ఉంది. అందుకే వైద్య సిబ్బందిలో పని ఒత్తడి పెరిగింది. ఇలాంటి పరిస్థితులను ఒమిక్రాన్‌ సద్వినియోగం చేసుకుంటోంది. అయితే ఇప్పుడు వస్తున్న కేసులన్నీ ఒమిక్రాన్‌వేనని చెప్పడానికి లేదు. ఎందుకంటే పది నుంచి 20 శాతం వరకు డెల్టా వేరియంట్‌ కేసులు కూడా ఉన్నాయట. అంటే డెల్టా ఉండగానే ఒమిక్రాన్‌ విరుచుకుపడుతున్నదన్నమాట! అందుకే ఇప్పుడు అత్యంత జాగరూకత అవసరం. అయితే సెకండ్‌ వేవ్‌లో కనిపించినంత భయానక పరిస్థితులులు మూడో వేవ్‌లో లేకపోవడం కొంచెం ఊరటకలిగించే విషయం. అప్పుడు ఆక్సిజన్‌ దొరకక నానా అవస్థలు పడ్డారు కరోనా బాధితులు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఒమిక్రాన్‌ సోకితే కొంచెం జ్వరంగా ఉంటుందని, జలుబు వస్తుందని, నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుందని ఇలాంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ భావనే ప్రమాదకరం. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదమే! అశ్రద్ధ చూపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో కరోనా ఫస్ట్‌ వేవ్‌కు కారణమైన ఆల్ఫా వేరియంట్‌ కంటే సెకండ్‌ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంటే ఎక్కువ నష్టాన్ని కలిగించింది. అనేక మంది ప్రాణాలను తీసింది. 18 ఉత్పరివర్తనాలున్న డెల్టాతో పోలిస్తే, 50 మ్యుటేషన్లున్న ఒమిక్రాన్‌ 70 రెట్లు అధికంగా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్‌ సోకినా ప్రాణాలకు ముప్పు ఉండదన్న గ్యారంటీ ఏమీ లేదు. అయినా కొందరు నిర్భీతితో నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. ఇలా కోవిడ్‌ నిబంధనలకు పాతర వేస్తూ వెళితే మాత్రం ఒమిక్రాన్‌ నుంచి కొత్త వేరియంట్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. రెండు డోసుల టీకాలు తీసుకున్నవారికి కూడా ఒమిక్రాన్‌ సోకుతున్నదంటే రాబోయే వేరియంట్ ప్రమాదకరంగానే ఉండవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. అంటే డెల్టా వేరియంట్‌గా ప్రాణాలకు ముప్పుతేవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కనుక జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. తస్మాత్‌ జాగ్రత్త!!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu