HINDUTWA ISSUE: ప్రతిసారిలాగే ఈసారి కూడా అదే టాపిక్.. కానీ పార్టీల వైఖరే ఈసారి భిన్నం.. ఎందుకంటే..?

HINDUTWA ISSUE: ప్రతిసారిలాగే ఈసారి కూడా అదే టాపిక్.. కానీ పార్టీల వైఖరే ఈసారి భిన్నం.. ఎందుకంటే..?
Uttar Pradesh Assembly polls

2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎవరినీ ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయకుండానే బీజేపీ ఘన విజయం సాధించింది. 403 సీట్లున్న యుపీ అసెంబ్లీలో ఏకంగా 325 సీట్లను ఆనాటి ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. అప్పటికి గోరఖ్‌పూర్ ఎంపీగా రెండుసార్లు గెలిచిన కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న యోగీ ఆదిత్యనాథ్‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ కూర్చొబెట్టింది.

Rajesh Sharma

| Edited By: Ram Naramaneni

Jan 24, 2022 | 3:18 PM

HINDUTWA ISSUE ROCKES IN UTTAR PRADESH POLLS: హిందుత్వ… ఈ అంశం ప్రతీ ఎన్నికల్లో వినిపించేదే అయినా.. ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మరీ ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) ఎన్నికల్లో కాస్త ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రతీ సారి కంటే ఈసారి ఇంకాస్త ఎక్కువగానే వినిపిస్తోందీ అంశం. దానికి కారణం గత అయిదేళ్ళలో యుపీలో చోటుచేసుకున్న పరిణామాలే అని ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఇక రాజకీయ పార్టీల వైఖరి కూడా హిందుత్వపై కాసింత మారినట్లుగానే పరిగణించాల్సిన పరిస్థితి ప్రస్తుత ఎన్నికల్లో కనిపిస్తోంది. దానికి కారణలేమంటే రాజకీయ విశ్లేషకులు పలు అంశాలను తెరమీదికి తెస్తున్నారు. 2017 ఎన్నికల్లో ఎవరినీ ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయకుండానే బీజేపీ(Bjp) ఘన విజయం సాధించింది. 403 సీట్లున్న యుపీ అసెంబ్లీలో ఏకంగా 325 సీట్లను ఆనాటి ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. అప్పటికి గోరఖ్‌పూర్ ఎంపీగా రెండుసార్లు గెలిచిన కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న యోగీ ఆదిత్యనాథ్‌(Yogi Adityanath)ని రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ కూర్చొబెట్టింది. ఈ నిర్ణయం వెనుక భవిష్యత్ కార్యాచరణ వ్యూహం వుందని ఆనాడే పలువురు ఊహించారు. అనుకున్నట్లుగానే 2017-2022 మధ్య కాలంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పలు మార్పులు జరిగాయి. ముఖ్యంగా చెప్పాలంటే అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణం ప్రారంభం కావడం, కాశి విశ్వేశ్వర ఆలయ ప్రాంగణం సుందరీకరణ పూర్తి కావడం, అలహాబాద్ సహా పలు నగరాలు, పట్టణాల పేర్లను మార్చి వేయడం వంటివి గత అయిదేళ్ళలో జరిగాయి. అలహాబాద్‌కు ప్రయాగ్ రాజ్ అని, అయోధ్య టెంపుల్ దగ్గరలోని ఫైజాబాద్ రైల్వేస్టేషన్‌కు అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్ అని నామకరణం చేశారు.

ఈ క్రమంలో యుపీలో రాజకీయ పరిణామాలు మతాల ప్రాతిపదికన మారిపోయాయి అని చెప్పాల్సి వస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం జరుగుతున్న యుపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సూటిగాను, సమాజ్ వాదీ పార్టీ పరోక్షంగాను ముస్లింల మద్దతు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన పార్టీలు హిందుత్వకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడని సంకేతాలు కనిపిస్తున్నాయి. యుపీలో ముస్లింల ఓట్లు 19 శాతంగా వున్నాయి. ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్.. ప్రస్తుత ఎన్నికలు 80 శాతానికి 20 శాతానికి మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. అంటే పరోక్షంగా ఆయన 19 శాతం వున్న ముస్లింల ఓట్లను ప్రస్తావించినట్లేనని జాతీయస్థాయి మీడియా సంస్థలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో 19 శాతం వున్న ముస్లింల ఓట్లకు ఆశపడే కంటే హిందువులకు వ్యతిరేకంగా ముద్ర వేయించుకోకపోవడమే బెటర్ అని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని అంటున్నారు. యుపీలోని మొత్తం 403 సీట్లలో 255 సెగ్మెంట్లలో ముస్లింల ఓట్లు 6 శాతం కంటే తక్కువగా వున్నాయి. సో.. ఆ సెగెంట్లలోని హిందువుల ఓట్లు విషయంలో ప్రతికూలత రాకూడదన్న ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు హిందుత్వకు వ్యతిరేకంగా వెళ్ళకుండా జాగ్రత్తపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు. అయితే 35 నుంచి 50 శాతం ముస్లింల ఓట్లున్న నియోజకవర్గాలు కూడా పెద్ద సంఖ్యలోనే వున్నాయి. ఈ నియోజకవర్గాలలో ముస్లింల ఓట్లు ఎంఐఎంవైపు మొగ్గుచూపుతాయా లేక విపక్ష సమాజ్ వాదీ పార్టీవైపు మొగ్గుచూపుతాయా అన్నది తేలాల్సి వుంది.

తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ముస్లింల ర్యాలీలపై కొద్దిమేరకు వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత ముస్లింల ఓట్ల కోసం ప్రత్యేకంగా ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదని భావించిన అఖిలేశ్.. ఎంఐఎం బలపడుతున్న సంకేతాలు రావడంతో కొన్ని నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా 30 శాతం కంటే ఎక్కువగా ముస్లింల ఓట్లు ఉన్న ప్రాంతాల్లో వారి ఓట్లు పోలరైజ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందుకోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను రూపొందించేలా ఎస్పీ వ్యూహకర్తలకు అఖిలేశ్ నిర్దేశించినట్లు సమాచారం. ఇక ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్.. తొలిసారి అసెంబ్లీ బరిలో ప్రత్యక్ష పోరుకు సిద్దమయ్యారు. ఆయన గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు యోగీ తీసుకున్న నిర్ణయం అఖిలేశ్ యాదవ్‌పై ఒత్తిడికి కారణమైంది. ఆయనా గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పటికీ ఎమ్మెల్సీ కోటాలోనే ఆయన పదవీకాలాన్ని పూర్తి చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో యోగీ ఆదిత్యనాథ్‌తోపాటు అఖిలేశ్ యాదవ్ కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో వున్నారు. ఈనేపథ్యంలో అఖిలేశ్ కూడా ప్రత్యక్ష పోరుకు రెడీ అయ్యేలా ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ఇద్దరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నిక బరిలోకి దిగడం ఆసక్తి రేపుతోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu