Chinese Corona: చైనాలో కరోనా విలయతాండవం.. తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయిన డ్రాగన్ కంట్రీ.. మనదేశంలో జరిగేది ఇదేనా?

చైనాలో పరిస్థితిని తెలుసుకునేందుకు భారతీయ మీడియా సంస్థలు తమకున్న సొంత సోర్సుల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ ప్రయత్నాలు మనకు షాక్ ఇచ్చే సమాచారాన్ని తెచ్చిపెడుతున్నాయి.

Chinese Corona: చైనాలో కరోనా విలయతాండవం.. తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయిన డ్రాగన్ కంట్రీ.. మనదేశంలో జరిగేది ఇదేనా?
Jinping
Follow us

|

Updated on: Dec 27, 2022 | 1:34 PM

యావత్ ప్రపంచాన్ని దాదాపు రెండేళ్ల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసిన డ్రాగన్ కంట్రీ ఎప్పుడు తాను తవ్వుకున్న గోతిలో తానే పడుతుంది. 2020 జనవరిలో వూహన్ లాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయ్యిందని, ఆ వైరస్ చైనా ప్రయోగశాలలోనే ఉద్భవించిందని తొలి రోజుల నుంచి అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్త ఒకరు దీన్ని ధ్రువీకరించారు కూడా. జీవాయుధాలను రూపొందించే క్రమంలో కరోనా వైరస్ వూహన్ లాకైబరేటరీ నుంచి లీకై, అది క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించి యావత్ మానవాళిని గడగడలాడించిందని ఆ అమెరికన్ శాస్త్రవేత్త వెల్లడించారు. ఆయన ప్రకటన వెలువడిన కొన్ని రోజుల వ్యవధిలోనే చైనా తాను తయారు చేసిన కరోనా వైరస్ బారిన మరోసారి పడి విలవిల్లాడడం మొదలైంది. నిజానికి చైనా కరోనాను నియంత్రించ లేకనే జీరో కోవిడ్ పాలసీని అవలంబించిందని పలువురి అభిప్రాయం. జీరో కోవిడ్ విధానాన్ని అవలంబించడం ద్వారా దేశంలో నిర్బంధాన్ని పెంచి, తద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించాలని చైనా ప్రయత్నించింది. ఈ విధానం సక్సెస్ అయినట్లుగా దాదాపు రెండేళ్ల కాలం పాటు మనకు కనిపించింది. కానీ తాజాగా గత నెల రోజులుగా చైనాలో చోటుచేసుకున్న పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిర్బంధాన్ని ఛేదించుకొని చైనీయులు ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం పరిస్థితిని తారుమారు చేసింది. చైనీయుల ఒత్తిడిని భరించలేక ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని ఉపసంహరించుకుంది. దాంతో ఉన్నట్లుండి చైనాలో కరోనా విలయతాండవం మొదలైంది. కరోనా వైరస్ చైనాలో శరవేగంగా విస్తరించింది. దేశ రాజధాని బీజింగ్ నగరంలో దాదాపు 70 శాతం మందికి కరోనా సోకినట్లుగా సమాచారం అందుతోంది. వాణిజ్య నగరమైన షాంఘైలో కూడా కరోనా విజృంభిస్తోంది. దురదృష్టవశాత్తు చైనాలో మీడియా సొంతంగా పనిచేయదు. ప్రభుత్వం ఏది చెబితే దానిని మాత్రమే ప్రచురించాల్సి ఉంటుంది, ప్రసారం చేయాల్సి ఉంటుంది. అందుకే చైనాలో అసలు పరిస్థితి ఏమిటి అంటే ఎవరు కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో చైనాలో పరిస్థితిని తెలుసుకునేందుకు భారతీయ మీడియా సంస్థలు తమకున్న సొంత సోర్సుల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ ప్రయత్నాలు మనకు షాక్ ఇచ్చే సమాచారాన్ని తెచ్చిపెడుతున్నాయి.

జీరో కోవిడ్ పాలసీకి గుడ్ బై

ప్రపంచానికి కరోనా గురించి 2020 జనవరిలోనే తెలిసినప్పటికీ అంతకు రెండు, మూడు నెలల ముందుగానే చైనాలో ఈ వైరస్ ప్రబలినట్లుగా కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. డ్రాగన్ కంట్రీలో గత మూడు సంవత్సరాలుగా జీరో కోవిడ్ విధానంతో కఠిన నిబంధనలను అక్కడి ప్రభుత్వం కొనసాగించింది. అపార్ట్మెంట్లకు బయట నుంచి తాళాలు వేసి మరి ప్రజలు రోడ్డు మీదికి రాకుండా నిర్బంధాన్ని అమలు చేశారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిర్బంధాన్ని ఆ దేశస్తులు భరించలేకపోయారు. అదే సందర్భంలో జరిగిన ఒక అగ్ని ప్రమాద ఘటన ఆ దేశ ప్రజలను రోడ్డెక్కేలా చేసింది. ఫలితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పీక్ లెవెల్‌కు చేరింది. ఏకంగా దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ దిగిపోవాలంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. దాంతో జీరో కోవిడ్ విధానాన్ని అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దాంతో కోవిడ్ ఒక్కసారిగా జడలు విప్పింది. కరోనా కేసులు సంఖ్య కోట్లకు పడగలెత్తింది. అదే సమయంలో మృతుల సంఖ్య కూడా వేలల్లోకి చేరిపోయింది. దేశ రాజధాని బీజింగ్‌తో పాటు దేశంలో కీలక నగరాల్లో స్మశాన వాటికలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఇదంతా అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నప్పటికీ ఆ దేశ ప్రభుత్వం మాత్రం అధికారికంగా దీన్ని ధ్రువీకరించడం లేదు. దేశంలో పరిస్థితి అదుపు తప్పుతున్నా ప్రపంచానికి వాస్తవాలను వెల్లడించేందుకు చైనా ప్రభుత్వం సాహసించడం లేదు. నిజానికి గత నెల రోజులుగా చైనాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత వారం ఒక్కరోజులో మూడు కోట్ల 70 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. భారతదేశం కూడా అప్రమత్తమయింది. ఇప్పుడు చైనా దేశ జనాభాలో దాదాపు 60 శాతం అంటే సుమారు 80 కోట్ల మందికి కరోనా సోకినట్లుగా అంచనాలు వినిపిస్తున్నాయి. అక్కడి ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క రోగులు వరండాల్లో చికిత్స పొందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా కరోనా వైరస్ చైనాలో విజృంభిస్తుంది. ఇటీవల వరకు ఆర్టిపిసిఆర్ పరీక్షలను నిర్వహించిన చైనా ప్రభుత్వం, ఇప్పుడు వాటిని నిలిపివేసింది. తమకు కరోనా పరీక్షలు ‌నిర్వహించాల్సిందిగా లెక్కలేనంత సంఖ్యలో తరలివస్తున్న ప్రజలను అక్కడి ప్రభుత్వం అదుపు చేయలేకపోతోంది. లెక్కకు మించి వస్తున్న ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఆర్టిపిసిఆర్ కిట్లు లేక పరీక్షలను నిలిపివేయాల్సి వచ్చింది. ప్రజలు ఎవరికి వారే రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంతో దేశ ప్రజలంతా ప్రైవేటు లాభాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిలిపివేయడం, రాపిడ్ యాంటిజన్ కిట్లతోనే పరీక్షలు కొనసాగించడం వల్ల ప్రస్తుతం చైనాలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు లాబ్స్ నిర్వహిస్తున్న రాపిడ్ యాంటిజన్ పరీక్షల లెక్కలు ప్రభుత్వానికి చేరడం లేదు. కరోనా వైరస్‌పై చైనా చేస్తున్న యుద్ధంలో తనను తాను కమాండర్-ఇన్-చీఫ్‌గా అభివర్ణించుకున్న దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇప్పుడు నెలకొన్న పరిస్థితిని ఎదుర్కొనే మార్గం తెలియక బిక్కచచ్చిపోతున్నట్టు కనిపిస్తోంది.

వ్యాక్సిన్ రూపకల్పన కూడా డొల్లే

ఎవరికైనా తమకు కరోనా సోకినట్లు అనుమానం వస్తే రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం చైనీయులకు సూచించింది. అదేసమయంలో రెండేళ్ళకు పైగా ఆ దేశంలో కొనసాగుతూ వస్తున్న కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. ఒకరకంగా చెప్పాలంటే చాలా దేశాలు ఎప్పుడో అమల్లోకి తెచ్చిన ‘కరోనాతో సహజీవనం’ అనే కాన్సెప్ట్‌ను చైనా ఇపుడు అమల్లోకి తీసుకువచ్చింది. కరోనా వైరస్ అనేది ఇకపై పాండెమిక్ కాదని, ఎండమిక్ దశకు చేరుకుందని తాజాగా చైనా అంగీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాంతో కరోనా సోకిన లక్షణాలు కనిపించిన ప్రజలు ఎవరికి వారి స్వయంగా క్వారంటైన్ వెళ్ళిపోతున్నారు. ఎలాంటి లాక్ డౌన్లు విధించనప్పటికీ సూపర్ మార్కెట్లు, దుకాణాలు, మార్కెట్లు జనం లేక వెలవెల బోతున్నాయి. ప్రపంచానికి కరోనా వైరస్‌ను పరిచయం చేసిన చైనా, అందరికంటే ముందుగా కానీ వ్యాక్సిన్లు కనుగొన్నట్టుగా ప్రకటించింది. కానీ చైనా కొనుగొన్న వ్యాక్సిన్ అంత ప్రభావంతం కాదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. దానికి తోడు తాము కనుగొన్న వ్యాక్సిన్‌ను దేశంలో పెద్ద ఎత్తున పంపిణీ చేయలేకపోయింది డ్రాగన్ కంట్రీ ప్రభుత్వం. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. చైనా కనుగొన్న వ్యాక్సిన్ ఒకవేళ ప్రభావవంతమే అయితే చైనీయులందరికీ ఎందుకు పంపిణీ చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. చైనా కనుగొన్న వ్యాక్సిన్ ప్రభావవంతమైనదే అయితే జీరో కోవిడ్ విధానానికి బదులు వ్యాక్సిన్ పంపిణీపైనే ఆ దేశ ప్రభుత్వం శ్రద్ధ చూపేది కదా అన్నది విశ్లేషకుల ప్రశ్న. చైనా దేశ జనాభా సుమారు 150 కోట్లు. ఆ జనాభాకు వ్యాక్సిన్ పంపిణీ చేయడం అనేది చైనాలో వున్న మెకానిజానికి పెద్ద టాస్క్ ఏమీ కాదు. పెద్దగా యంత్రాంగం లేరప్పటికీ భారతదేశం సుమారు 25 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇప్పటివరకు పంపిణీ చేసింది. మూడు రకాల వ్యాక్సిన్లను దేశీయంగా ఉత్పత్తి చేయడంతో పాటు రష్యా. అమెరికా దేశాల్లో తయారైన వ్యాక్సిన్ లను కూడా పరీక్షించి, మన దేశంలో పంపిణీకి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుమతించింది. ఫలితంగా దేశంలో 220 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది. తాజాగా మరోసారి వ్యాక్సిన్ పంపిణీని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో బూస్టర్ డోసు క్యాంపులు ఏర్పాటవుతున్నాయి.

అప్రమత్తత అవసరం

కానీ చైనాలో అందుకు పూర్తిగా విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్‌ను పుట్టించిన చైనా, దాన్ని నిరోధించే యంత్రాంగాన్ని సృష్టించలేక చతికిలబడింది. కోట్ల సంఖ్యలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులను నియంత్రించలేక కొట్టుమిట్టాడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే చైనా తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయింది. చైనాలో నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశాయి. అమెరికా, యూకే, ఇండియా వంటి దేశాలు తక్షణం చర్యలకు ఉపక్రమించాయి. చైనా నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్పోర్టులోని ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని ఎయిర్‌పోర్టుల అథారిటీలను ఆదేశించింది. నాలుగైదు రోజుల వ్యవధిలోనే ఆ ఆదేశాలను ఉపసంహరించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అప్రమత్తంగా ఉండాలని, ఆక్సిజన్ నిల్వలను సిద్ధం చేసుకోవాలని కేంద్రం అప్రమత్తం చేసింది. చైనాతోపాటు జపాన్, యూఎస్ఏ, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. భారతదేశంలో పది రోజుల క్రితం వరకు రెండంకెల సంఖ్యకు పరిమితమైన కరోనా పాజిటివ్ కొత్త కేసుల సంఖ్య, తాజాగా మూడు అంకెలకు చేరింది. డిసెంబర్ 26న వెల్లడైన గణాంకాలను పరిశీలిస్తే ఒక్క రోజు వ్యవధిలో దేశవ్యాప్తంగా 247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసుకోవాలని, ఐసీయూ పడకల సంఖ్య పెంచుకోవాలని, ఐసోలేషన్ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. దానికి తోడు రెండు, మూడు సందర్భాలలో దేశ ప్రజలను ఉద్దేశించి.. రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను చేయాల్సిన సూచనలు చేశారు. కరోనా పూర్తిగా అంతరించిపోలేదని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని, ప్రజలు స్వచ్ఛందంగా కరోనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని మోదీ పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలోను మోదీ ఈ సూచనలను పునరుద్ఘాటించారు. ప్రస్తుతానికి ఇండియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు. చైనాలో కనుగొన్న ఓమిక్రాన్ బిఎఫ్.7 రకానికి చెందిన కరోనా వైరస్ వేగంగా వ్యాపించే లక్షణం ఉన్నప్పటికీ, భారతదేశంలో దీని ప్రభావం అంతగా ఉండే అవకాశం లేదని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇప్పటికే దేశంలో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య అధికంగా ఉంది. దాదాపు 25 కోట్ల మంది బూస్టర్ డోసు కూడా తీసుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత దేశంలో నాలుగు వేవ్ వచ్చే అవకాశాలు పెద్దగా లేవని, ఒకవేళ వచ్చినా కేసుల సంఖ్య ఒకటో, రెండో దశ మాదిరిగా ఉండకపోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ చైనాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.