Kalingapatnam beach: శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్ దీన గాథ, కాలగర్భంలో కలిపేస్తారేమోనన్న ఆవేదన
శ్రీకాకుళం జిల్లాకు తలమానికంగా చెప్పుకునే చారిత్రక ఆనవాల్లలో ఒకటైన పోర్టు కళింగపట్నం బీచ్ ఒకటి. రాష్ట్రంలోనే అతి పొడవైన సుమారు 193 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న..
Kalingapatnam beach: శ్రీకాకుళం జిల్లాకు తలమానికంగా చెప్పుకునే చారిత్రక ఆనవాల్లలో ఒకటైన పోర్టు కళింగపట్నం బీచ్ ఒకటి. రాష్ట్రంలోనే అతి పొడవైన సుమారు 193 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న తీరంలో అతి పెద్ద బీచ్ కూడా ఇదే కావడం గమనార్హం. బ్రిటిష్ కాలంలో రంగూన్‌కు సముద్ర మార్గం గుండా సరుకులు, మనుషుల రాక పోకలు సాగించే ఈ పోర్టు కనుమరుగైనా, ఆ పేరుతో వున్న సువిశాల మైన బీచ్ మాత్రం గతవైభవానికి చిహ్నంగా మిగిలిన ఏకైక తీపి గుర్తు. అటువంటి బీచ్ మానవ తప్పిదం కారణంగా వంశధార నది ఆక్వా మాఫియా కబంద హస్తంల్లో కబ్జాకు గురి కాకుండంతో రెండేళ్ల క్రితం నది దిశ మారి అప్పట్లో నదికి వచ్చిన వరదల కారణంగా సముద్ర గర్భంలో కలిసి పోయింది. రెండేళ్లు కావస్తున్నా ఆ బీచ్ పునరుద్ధరణకు ఏమాత్రం చొరవ తీసుకొక పోవడంతో ఆ చారిత్రక ఆనవాళ్లు చెదిరిపోయే పరిస్థితి నెలకొంది.
ఒడిషాలో పుట్టి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 110 కిలో మీటర్ల మేర ప్రవహించే వంశధార జీవ నది గార మండలం, పోర్టు కళింగపట్నం వద్ద సముద్రంలో కలుస్తున్నది. ఆ కలిసే సంగర ప్రదేశం వద్ద రెండేళ్ల క్రితం సువిశాల మైన బీచ్ వుండేది. అయితే నది సమీపంలో కలిసే ప్రదేశానికి మూడు కిలోమీటర్ల ముందు ఎడమ గట్టు వైపు పోలాకి మండలం, రేవు అంపలాం గ్రామానికి సమీపంలో పదేళ్లుగా ఆక్వా మాఫియా తిష్ట వేసి ఏకంగా నదినే ఆక్రమించేసి నదీ ప్రవాహాన్నే మార్చివేశారు.
రెండేళ్ల క్రితం ఆక్వా మాఫియా చేసిన ఆకృత్యానికి సువిశాలమైన, సుందరమైన, అహ్లాదకరమైన ఆ అందాలు సముద్ర గర్భంలో కలిసి పోయాయి. దేశ నలుమూలల నుంచి జిల్లాకు వచ్చేసిన వారంతా పోర్టు కళింగపట్నం బీచ్ టచ్ చేయకుండా, అక్కడి ఆహ్లాదకరమైన అందాలను ఆస్వాదించ కుండా వెళ్లే పరిస్థితి లేని ఈ తరుణంలో ఆ బీచ్ కనుమరుగు అయిన విషయం రెండేళ్లైనా మరవకుండా ఆ ప్రదేశానికి వచ్చి తీవ్ర నిరాశగా వెను దిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం హయాంలో చేసిన ప్రయత్నం నెరవేరలేదు.
ఇంతలా ఆ బీచ్ కాల గర్భంలో కలిసి పోయి రెండేళ్లు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ బీచ్ పునరుద్ధరణ కోసం ఏమాత్రం చర్యలు చేపట్టక పోవడంతో ఈ ఏడాది గనక వంశధార నదికి మళ్లీ వరదలు వస్తే ఎక్కడ బీచ్ కనుమరుగు అయినట్లే పోర్టు కళింగపట్నం గ్రామం కూడా సముద్రంలో కలిసి పోతుందో అన్న భయం తమను వెంటాఠుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ఈ బీచ్ ను సందర్శించేందుకు వచ్చిన సందర్శకులు మాత్రం మళ్లీ ఆ పాతకాలం నాటి బీచ్ కు పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందో అన్న ఆశతో పదే పది మార్లు అక్కడికి వచ్చి తీవ్ర నిరాసతో వెనుదిరుగు తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.