ఆ కారణంగానే అబ్బాయిలకు.. అమ్మాయిలను ఇవ్వడం లేదు.. ప్రముఖ నేత సంచలన వ్యాఖ్యలు..
దేశంలో నిరుద్యోగ సమస్య కారణంగానే.. పెళ్లీడుకొచ్చినా యువకులకు అమ్మాయిలు దొరకడం లేదంటూ వ్యాఖ్యానించారు. పెళ్లయ్యే వయసులో ఉన్న యువకులకు వధువులు దొరక్కపోవడంతో..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందంటూ విమర్శించారు. కేంద్రం, రాష్ట్రంలోని శివసేన (షిండేవర్గం) – బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించే క్రమంలో పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య కారణంగానే.. పెళ్లీడుకొచ్చినా యువకులకు అమ్మాయిలు దొరకడం లేదంటూ వ్యాఖ్యానించారు. పెళ్లయ్యే వయసులో ఉన్న యువకులకు వధువులు దొరక్కపోవడంతో.. కొన్ని శక్తులు సామాజిక సమస్యలు సృష్టిస్తున్నాయని.. దీనికి ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాల వైఫల్యమేనంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. బుధవారం ఎన్సీపీ జన్ జాగర్ యాత్ర ప్రచారంలో భాగంగా పవార్ మాట్లాడారు. దేశంలో రెండు వర్గాల ప్రజల మధ్య చీలిక ఏర్పడిందని.. తద్వారా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం జరుగుతోందంటూ వివరించారు. దేశంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారని.. వారికి వేరే పనులు కూడా దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగం లేని వాళ్లకు అమ్మాయిలను ఎవరు ఇస్తారు..? అందుకే వివాహాలు సకాలంలో జరగడం లేదని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకుని.. తప్పుదోవ పట్టిస్తున్నారంటూ పేర్కొన్నారు. బాగా చదువుకున్న వాళ్లు.. తమకు ఉద్యోగాలు కావాలని ప్రభుత్వాల్ని నిలదీయాలి.. అది వాళ్ల హక్కు అని పవార్ సూచించారు.

Sharad Pawar
దేశంలో రైతులు ఉత్పత్తి పెంచితే ఆకలి సమస్య తీరుతుంది.. కానీ, అధికారంలో ఉన్నవారు వారి శ్రమకు తగినట్లు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు సిద్ధంగా లేరన్నారు. దీనికి బదులుగా దళారుల ప్రయోజనాలను కాపాడుతూ సామాన్య ప్రజలను ద్రవ్యోల్బణ చట్రంలోకి నెట్టేస్తున్నారని తెలిపారు. ఓసారి తాను ఓ ఊరికి వెళ్లినప్పుడు.. అక్కడ 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న కొందరు యువకులు పిచ్చాపాటిగా మాట్లాడుతూ కనిపించారని శరద్ పవార్ తెలిపారు. ఎందుకిలా ఖాళీగా ఉన్నారు అని వారిని ప్రశ్నిస్తే.. తమ ప్రాంతంలో చేయడానికి ఏం పనుల్లేవని బదులిచ్చారన్నారు. వారిలో కొందరు డిగ్రీలు, మరికొందరు పీజీలు కూడా చేశారన్నారు. పని కోసం వేరే ఊరు వెళ్లొచ్చు కదా అంటే.. ఎంత దూరం వెళ్లాలంటూ వారే తనను ప్రశ్నించారని.. పని లేక పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని.. వారు తనతో చెప్పారని శరద్ పవార్ గుర్తు చేసుకున్నారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వినబడుతున్నాయని పవర్ పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో ఉపాధి అవకాశాలను పెంపొందించే విధానాలను అవలంబించడానికి బదులుగా, వర్గాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పవార్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీ ఇచ్చి మరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని ప్రశ్నిస్తే.. రెండు వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు యాదృచ్ఛికంగా ఏదో ఒక అంశాన్ని సృష్టిస్తున్నారంటూ బీజేపీ పై మండిపడ్డారు.





Sharad Pawar
మరిన్ని జాతీయ వార్తల కోసం..




