దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు.. YCP ఎంపీ కొత్త డిమాండ్..!
పార్లమెంట్ సమావేశాల్లో ఒక సెషన్ దక్షిణాదిలో నిర్వహించాలనే డిమాండ్‌ను వైసీపీ ఎంపీ గురుమూర్తి తెరమీదకు తీసుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దక్షిణాదిలో పార్లమెంటు సమావేశాల ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో వేసవిలో తీవ్ర ఉక్కపోత, శీతాకాలంలో తీవ్ర చలితో పాటు వాయు కాలుష్యం ఏర్పడుతోందన్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఒక సెషన్ దక్షిణాదిలో నిర్వహించాలనే డిమాండ్‌ను వైసీపీ ఎంపీ గురుమూర్తి తెరమీదకు తీసుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దక్షిణాదిలో పార్లమెంటు సమావేశాల ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో వేసవిలో తీవ్ర ఉక్కపోత, శీతాకాలంలో తీవ్ర చలితో పాటు వాయు కాలుష్యం ఏర్పడుతోందన్నారు. ఢిల్లీ వెదర్ పార్లమెంటు సభ్యుల పనితీరును ప్రభావితం చేస్తోందంటున్నారు. అందుకే 1950వ దశకం నుంచే దక్షిణ భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి అన్న డిమాండ్ మొదలైందన్నారు. ఈ విషయమై 1968లో స్వతంత్ర ఎంపీ ప్రకాశ్‌వీర్ శాస్త్రి ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టారని గుర్తు చేశారు. నాడు 18 మంది ఎంపీలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేశారని.. నాటి కేరళ, మైసూరు ప్రభుత్వాలు పార్లమెంటు సమావేశాలకు మౌలిక వసతులు కల్పిస్తామని ముందుకు వచ్చాయన్నారు. అయితే అప్పట్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. అప్పట్లో ప్రభుత్వ పని మొత్తం పేపర్ వర్క్ మీద నడిచేదని.. ఇప్పుడు అలా కాదు.. ఏ ఫైల్ ఎక్కడి నుంచి అయినా పరిశీలించి క్లియర్ చేయవచ్చన్నారు.
పైగా ఇప్పుడు ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య పన్నుల్లో వాటా, డిలిమిటేషన్ తో తగ్గే సీట్ల సంఖ్య విషయంలో విభేదాలు ఉన్నాయన్నారు. దక్షిణాదిలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందుతుందన్నారు. ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గతంలో అంబేద్కర్ సైతం హైదరాబాద్ దేశానికి రెండవ రాజధానిగా ఉత్తమ నగరం అని సూచించారని గుర్తుచేశారు. శత్రు దేశాలకు ఢిల్లీ సమీపంలో ఉందని..ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ను పార్లమెంటు సమావేశాలు సహా రెండవ రాజధానిగా పరిగణిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.