Organ Trafficking: పోస్టుమార్టం పేరుతో మృతదేహం కళ్లు మాయం.. వైద్యులే కాజేశారంటూ బంధువుల ఆరోపణలు
ఉరి వేసుకుని మృతి చెందిన యువతి మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం యువతి మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా.. ఆమె ‘కళ్లు’ మాయమయ్యాంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే అందుకు కారణమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు..
లక్నో, డిసెంబర్ 12: ఉరి వేసుకుని మృతి చెందిన యువతి మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం యువతి మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా.. ఆమె ‘కళ్లు’ మాయమయ్యాంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే అందుకు కారణమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. యువతి మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలంటూ మంగళవారం (డిసెంబర్ 12) ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
కట్నం వేదింపులకు యువతి బలి..
ఉత్తరప్రదేశ్‌లోని బదాయు జిల్లాకు చెందిన పూజ (20) అనే యువతి ముజారియా ప్రాంతంలోని రసుల గ్రామంలో ఆదివారం ఉరికి వేలాడుతూ కనిపించింది. వరకట్నం కోసం ఆమెను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె మృతదేహాన్ని సోమవారం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా.. ఆమె కళ్లు మాయమైనట్లు గుర్తించారు. పోస్టుమార్టం సమయంలోనే కళ్లను తొలగించారంటూ వైద్యులు, సిబ్బందిపై కుటుంబ సభ్యులు ఆరోపించారు.
రెండో సారి పోస్టుమార్టం నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ
ఈ క్రమంలో వారు జిల్లా మేజిస్ట్రేట్ మనోజ్ కుమార్‌ను ఆశ్రయించారు. ఆసుపత్రి వైద్యులు అవయవ అక్రమ రవాణాలో పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. రెండో సారి పోస్టుమార్టం చేస్తారన్నారు. ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మేజిస్ట్రేట్ మనోజ్ కుమార్ తెలిపారు. దీనిపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రదీప్ వర్ష్నే మాట్లాడుతూ.. రెండవ సారి పోస్ట్ మార్టం నిర్వహిస్తామని, మొత్తం ప్రక్రియను వీడియో తీసి, ఆ నివేదిక సమర్పించాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించారని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.