Wayanad Tiger Attack: యువ రైతుపై దాడి చేసిన పులిని చంపేందుకు అటవీ శాఖ ఉత్తర్వులు.. కానీ ఒక్క షరతు
కేరళలోని వాయనాడ్ జిల్లాలో గత శనివారం యువ రైతుపై పులి దాడి చేసి చంపి, కొంత భాగం పాక్షికంగా భక్షించిన సంగతి తెలిసిందే. మృతి చెందిన రైతుని ప్రజీష్ (36)గా అధికారులు గుర్తించారు. ప్రజీష్‌పై పులి దాడి అనంతరం స్పందించిన కేరళ అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజీష్‌పై దాడికి తెగ బడిన పులిని చంపేందుకు అనుమతిస్తూ అదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పులిని సురక్షితంగా బందించలేని పక్షంలో మాత్రమే దానిని చంపేందుకు అనుమతించినట్లు..
తిరువనంతపురం, డిసెంబర్ 11: కేరళలోని వాయనాడ్ జిల్లాలో గత శనివారం యువ రైతుపై పులి దాడి చేసి చంపి, కొంత భాగం పాక్షికంగా భక్షించిన సంగతి తెలిసిందే. మృతి చెందిన రైతుని ప్రజీష్ (36)గా అధికారులు గుర్తించారు. ప్రజీష్‌పై పులి దాడి అనంతరం స్పందించిన కేరళ అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజీష్‌పై దాడికి తెగ బడిన పులిని చంపేందుకు అనుమతిస్తూ అదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పులిని సురక్షితంగా బందించలేని పక్షంలో మాత్రమే దానిని చంపేందుకు అనుమతించినట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఈ మేరకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ డి జయప్రకాష్ జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించారు.
ప్రజీష్‌ను చంపిన ప్రాంతంలో సంచరిస్తున్న పులిని చంపేందుకు అటవీ శాఖ అనుమతి ఇచ్చింది. అది ప్రజీష్‌పై దాడి చేసిన పులి అని నిర్ధారణ అయిన తర్వాత దానిని సురక్షితంగా బంధించేందుకు ప్రయత్నించాలన్నారు. అలా బంధించడంలో విఫలమైతే దానిని చంపవచ్చని పేర్కొన్నారు. సదరు పులి నరమాంస భక్షక జంతువు కాబట్టి, ఆ ప్రాంతంలో సంచరించే వారికి అది ప్రమాదకరమని తెలిపారు. అందువల్లనే దానిని చంపేందుకు అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. అటవీ శాఖ పులి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో 11 కెమెరాలను ఏర్పాటు చేసింది. కెమెరా ట్రాప్‌ల ఆధారంగా ఆ ప్రాంతంలో పులి ఇంకా సంచరిస్తోందని అటవీ శాఖ నిర్ధారించింది.
ప్రజేష్ మృతి అనంతరం.. సుల్తాన్ బతేరి సమీపంలోని మూడకొల్లి, వాకేరి గ్రామస్తులు ప్రజీష్ మృతదేహాన్ని భద్రపరిచిన తాలూకా ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టడంతో పులిని చంపేందుకు ఆదేశాలు జారీ చేశారు. తొలుత పులిని సురక్షితంగా పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని, నరభక్షక పులిని చంపేంత వరకూ ప్రజీష్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమని గ్రామస్థులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్ సత్వరమే చర్యలు తీసుకుంటామని మృతుడి కుటుంబానికి హామీ ఇచ్చారు. పులిని చంపేందుకు కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. నష్టపరిహారంగా రూ.10 లక్షలు అందజేస్తామన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పిస్తామన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి అవాంతరాలు కలుగకుండా పోలీసులు ఆ గ్రామంలో గస్తీకి ఉంచారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో (జనవరిలో) వాయనాడ్ జిల్లాలో పులి దాడి ఘటనలో మరో రైతు (52 ఏళ్లు) కూడా మరణించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.