Free Bus Rides in Telangana: టీఎస్‌ఆర్టీసీ బస్ కండెక్టర్ ఓవరాక్షన్.. మహిళకు టికెట్ కొట్టి డబ్బులు వసూల్! విధుల నుంచి తొలగింపు
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శనివారం (డిసెంబర్ 9) మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధి పుట్టిన రోజు సందర్భంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సు లన్నింటిలో మహిళలు టికెట్ లేకుండా ఉచితంగా ఎన్నిసార్లైనా ప్రయాణించొచ్చు. దీంతో ఈ పథకం శనివారం మధ్యాహ్నం నుంచి..
నిజామాబాద్, డిసెంబర్ 10: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శనివారం (డిసెంబర్ 9) మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధి పుట్టిన రోజు సందర్భంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సు లన్నింటిలో మహిళలు టికెట్ లేకుండా ఉచితంగా ఎన్నిసార్లైనా ప్రయాణించొచ్చు. దీంతో ఈ పథకం శనివారం మధ్యాహ్నం నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఈ బస్సు కండక్టర్ మాత్రం ఎవరు ఏ పథకం తీసుకొస్తే నాకేంటీ.. నేను మాత్రం మహిళలకు టికెట్లు ఇస్తానంటూ రుబాబు చేస్తున్నాడు. ఓ మహిళకు టికెట్ కూడా ఇచ్చాడు. దీంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలేం జరిగిందంటే..
నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో టీఎస్‌ఆర్టీసీ బస్సు కండక్టర్ నర్సింహులు ఒక మహిళకు టికెట్ జారీ చేశాడు. ఉచిత ప్రయాణం సౌలభ్యం ఉన్నా లెక్కచేయకుండా మహిళకు సదరు కండక్టర్ టికెట్ జారీ చేశాడు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చిందని వాదించినా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.90 ఛార్జీ వసూలు చేశాడు. ఓ ప్రయాణికుడు గమనించి కండక్టర్ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దాకా వెళ్లింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. కండక్టర్‌ను డిపో స్పేర్‌లో ఉంచామని, ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. విచారణ తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎండీ సజ్జనార్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో ఒక మహిళకు టికెట్ జారీ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించాం. సంబంధిత కండక్టర్ ను డిపో స్పేర్ లో ఉంచడం జరిగింది. విచారణ అనంతరం ఆయనపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది.
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 10, 2023
అంతేకాకుండా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకు మార్గదర్శకాలు జారీ చేశారు. మహాలక్ష్మి పథకం కింద వయసుతో సంబంధం లేకుండా అందరు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పించాలని, ఇందుకోసం ఏదైనా ఐడీ కార్డు ఉంటే చాలని తెలిపారు. పథకం ప్రారంభమైన మొదటి వారం రోజులు మాత్రం ఎటువంటి గుర్తింపు కార్డు లేకున్నా మహిళలు ప్రయాణించొచ్చని వెల్లడించారు.
మరోవైపు సదరు కండక్టర్‌ను విధుల నుంచి తప్పించినట్లు ఆర్ఎం జానిరెడ్డి మీడియాకు తెలిపారు. ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన రెండో రోజే ఆర్టీసీ బస్ కండక్టర్ మహిళ వద్ద డబ్బులు వసూలు చేసి, టికెట్ ఇవ్వడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.