AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wayanad Landslides: వయనాడులో తుదిదశకు చేరుకున్న సహాయకచర్యలు.. 357కి చేరుకున్న మృతుల సంఖ్య.. రాడార్‌, జీపీఎస్‌ టెక్నాలజీతో గాలింపు

కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతో పాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు. వయనాడులోని సూజిపుర వాటర్‌ఫాల్స్‌ దగ్గర చిక్కుకున్న ముగ్గురిని ఆర్మీ , ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. ఎంతో చాకచక్యంగా ముగ్గురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Wayanad Landslides: వయనాడులో తుదిదశకు చేరుకున్న సహాయకచర్యలు.. 357కి చేరుకున్న మృతుల సంఖ్య.. రాడార్‌, జీపీఎస్‌ టెక్నాలజీతో గాలింపు
Wayanad Landslides
Surya Kala
|

Updated on: Aug 04, 2024 | 6:54 AM

Share

ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో వణికిపోయిన కేరళ లోని వయనాడులో సహాయక చర్యలు తుదిదశకు చేరుకున్నాయి. ఆర్మీ , ఎన్డీఆర్‌ఎఫ్‌ , నేవీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రాడార్‌, జీపీఎస్‌ టెక్నాలజీని ఉపయోగించి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. దాదాపు 300 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతో పాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు. వయనాడులోని సూజిపుర వాటర్‌ఫాల్స్‌ దగ్గర చిక్కుకున్న ముగ్గురిని ఆర్మీ , ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. ఎంతో చాకచక్యంగా ముగ్గురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మేము సైతం అంటున్న సిని, రాజకీయ ప్రముఖులు

మరోవైపు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకువస్తున్నారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం రూ.3 కోట్లు విరాళం ప్రకటించిన హీరో మోహన్‌లాల్‌… బాధితుల కోసం స్వయంగా గ్రౌండ్‌లోకి దిగారు. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో సహాయక చర్యలు చేపట్టారు. తాత్కాలిక బ్రిడ్జ్‌ల నిర్మాణం, బాధితులకు సహాయం చేయడంలో పాలుపంచుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వయనాడు బాధితుల కోసం రూ.1 లక్ష విరాళం ప్రకటించారు. ఆయన భార్య టి.కె. కమల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.33,000 అందించారు. మరోవైపు కేరళ సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు కూడా తమ నెల జీతం రూ.50,000లను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నామని తెలిపారు.

100 ఇళ్లు నిర్మిస్తామన్న కాంగ్రెస్

వదర ప్రభావిత గ్రామాల్లో బాధితుల కోసం 100 ఇళ్లు నిర్మాస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా కేరళ రాష్ట్రానికి ఆపన్న హస్తం అందించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. అలాగే కోజికోడ్ బిజినెస్ క్లబ్ – 50 ఇళ్లు, నాయర్ సర్వీస్ సొసైటీ- 150 ఇళ్లు, కొట్టక్కల్ ఆర్య వైద్య సాల 10 ఇళ్లు నిర్మస్తామని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

బాధితులకు మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్

పశ్చిమ కనుమలలోని 56వేల 800 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనదని కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వయనాడ్‌లో కొండచరియల విధ్వంసానికి గురైన 13 గ్రామాలు కూడా దీని పరిధిలో ఉన్నాయి. మరోవైపు ఈ ఘటనలో సర్వం కోల్పోయిన వారికి మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 121 మంది మానసిక నిపుణుల బృందాన్ని వయనాడ్‌ పంపినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. వీరంతా సహాయక శిబిరాలు, ఆస్పత్రుల్లో ఉన్న బాధితులకు మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణీలకు, చిన్న పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు.

కొనసాగుతున్న బలితర్పణ

ఇక కేరళ రాష్ట్రవ్యాప్తంగా బలితర్పణం కొనసాగుతోంది. తమవారిని కోల్పోయిన బంధువులు లక్షలాదిగా ఒకచోటకు చేరి పిండప్రదానం చేశారు. తిరువననంతపురంలో అర్చకులు వేదమంత్రాల నడుమ లక్షలమంది తమవారికి పిండ సంతర్పణ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..