Viral Video: పెట్రోల్ బంక్ వద్ద కారులో చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు తీసిన జనాలు! షాకింగ్ వీడియో
పెట్రోల్ బంకు వద్దకు వచ్చిన ఓ కారులో ఉన్నట్లుండి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దెబ్బకు నివ్వెరపోయిన బంకు సిబ్బంది ఏం జరుగుతోందో తెలియక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బకెట్లతో నీళ్లు తెచ్చి ఆర్పసాగారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న మంటల ధాటికి పెట్రోల్ బంకు మొత్తం పేలిపోయేది..
మంగళూరు, నవంబర్ 11: కర్ణాటక రాష్ట్రం మంగళూరులో ఆదివారం సాయంత్రం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చిన కారులో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కర్ణాటకలోని మంగళూరులోని లేడీహిల్‌ప్రాంతంలో గల నారాయణ గురు సర్కిల్‌లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలేం జరిగిందంటే..
నారాయణ గురు సర్కిల్‌లో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు మారుతి 800 కారు ఒకటి ఆదివారం సాయంత్రం పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చింది. అయితే సరిగ్గా అదే సమయానికి కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో మంటలు కారు మొత్తం వ్యాపించడంతో నల్లని దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇక వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంకు సిబ్బంది.. బకెట్లతో నీళ్లు పోసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంధనం నింపేందుకు వచ్చిన కారు పెట్రోల్ పంపు దగ్గర ఆగిన వెంటనే మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం కారు ఇంజన్ నుంచి మంటలు వ్యాపించాయి. కొద్ది సేపటికే కారు పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు పెట్రోల్ బంకులో పెద్ద ఎత్తున్న పెట్రోల్‌తోపాటు డీజిల్ నిల్వలు కూడా ఉండటంతో ఉద్యోగులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
A Maruti 800 caught fire at a petrol pump in Lady Hill, Mangaluru, on Sunday, creating a moment of panic pic.twitter.com/kq80wvV9Xf
— News Karnataka (@Newskarnataka) November 11, 2024
కొద్ది సేపటి తర్వాత అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే కారు పూర్తిగా దగ్ధమైంది. అదే పెట్రోలు ట్యాంకుకు మంటలు వ్యాపించి ఉంటే పెను విపత్తుకు దారితీసేదని పలువురు పేర్కొన్నారు. మంటల్లో కారు దగ్ధమవుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.