Hyderabad: తెల్లవారుజామున జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద భారీ పేలుడు.. పలు ఇళ్లు ధ్వంసం! వీడియో వైరల్
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. హోటల్ లోని రిఫ్రిజిరేటర్ పేలడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో నిద్రలో ఉన్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్లను నుంచి బయటకు పరుగులు తీశారు..
హైదరాబాద్, నవంబర్ 10: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 చెక్‌పోస్ట్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఆదివారం (నవంబర్ 11) తెల్లవారుజామున చెక్‌పోస్టు సమీపంలోని తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్‌లో ఈ పేలుడు సంభవించింది. రెస్టారెంట్‌లోని రిఫ్రిజిరేట్‌లోని కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగిసి పడ్డాయి.
పేలుడు ధాటికి హోటల్ ప్రహరీ గోడ ధ్వంసమై.. సమీప ఇళ్ల మీదకు రాళ్లు ఎగసిపడ్డాయి. దీంతో రెస్టారెంట్ పక్కనే ఉన్న బస్తీవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదం వల్ల బస్తీలోని పలు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రాళ్లు ఎగిరి 100 మీటర్ల దూరంలోని దుర్గాభవానీ నగర్ బస్తీలో పడ్డాయి. సమీపంలోని 4 గుడిసెలు ధ్వంసమయ్యాయి. పలు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఓ యువతికి గాయాలయ్యాయి. అయితే ఎటంటి ప్రాణ హాని జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పేలుడుపై సమాచారం అందుకున్న జూహ్లిహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రిఫ్రిజిరేటర్‌లోని కంప్రెసర్ ఎందుకు పేలిందనే దానిపై హోటల్ యాజమన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. పేలుడు కారణంగా దెబ్బతిన్న బస్తీలోని ఇళ్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కంప్రెసర్ పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. భారీ శబ్దానికి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్ నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టనున్నారు. మరోవైపు హోటల్ నిర్వాహకులు మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.