Uttar Pradesh: అదనపు కట్నం కోసం మహిళకు అత్తింటి వేదింపులు.. వివస్త్రను చేసి రోడ్డుపై పరుగెత్తించి కొట్టిన భర్త, బావ
కాలాలు మారుతున్నా.. అంతరిక్షంలో పరిశోధనలు చేసే స్థాయికి ఎదుగుతున్నా భారత సమాజంలో వరకట్న భూతం మరింత వేళ్లూనుకు పోతుంది. నిత్యం ఎందరో ఇల్లాలుల జీవితాలను కాలరాస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని హర్పూర్-బుధాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో సభ్య సమాజం తలదింపుకునే సంఘటన జరిగింది. భర్త, బావ కలిసి ఓ మహిళను వివస్త్రను చేసి, వీధుల్లో పరిగెత్తించి కొట్టారు. అదనపు కట్నం తీసుకురావట్లేదని..

గోరఖ్‌పూర్, జనవరి 1: కాలాలు మారుతున్నా.. అంతరిక్షంలో పరిశోధనలు చేసే స్థాయికి ఎదుగుతున్నా భారత సమాజంలో వరకట్న భూతం మరింత వేళ్లూనుకు పోతుంది. నిత్యం ఎందరో ఇల్లాలుల జీవితాలను కాలరాస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని హర్పూర్-బుధాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో సభ్య సమాజం తలదింపుకునే సంఘటన జరిగింది. భర్త, బావ కలిసి ఓ మహిళను వివస్త్రను చేసి, వీధుల్లో పరిగెత్తించి కొట్టారు. అదనపు కట్నం తీసుకురావట్లేదని ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు తనను చంపేందుకు యత్నించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గోరఖ్‌పూర్‌కు చెందిన బాధిత మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి సమయంలో తమ తల్లిదండ్రులు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ కట్నం ఇచ్చారని.. కానీ పెళ్లైన నాటి నుంచి భర్త, అత్తమామలు తరుచూ అదనపు కట్నం కోసం వేధించేవారని పోలీసులకు తెలిపింది. ఆమెను కట్నం కోసం అత్తమామలు రోజూ కొట్టేవారని తెల్పింది. కట్నం కోసం తనను మాత్రమేకాకుండా, తన పిల్లలను కూడా చాలాసార్లు అత్తమామలు కొట్టి గాయపరిచారని బాధిత మహిళ ఆరోపించింది. తల్లిదండ్రుల ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని భర్త, బావ ఒత్తిడి చేశారని, వారిద్దరూ కలిసి ఆమె శరీరంపై ఉన్న బట్టలన్నీ తొలగించి, ఆమెను చంపేందుకు వెంట పడ్డారని పేర్కొంది. ప్రాణాలను కాపాడుకోడానికి బట్టలు లేకుండానే గ్రామంలో వీధుల వెంట పరిగెత్తినట్లు పోలీసులకు తెలిపింది.
ప్రాణాల కోసం రోడ్లపై పరుగులు తీస్తుంటే గ్రామస్థులంతా చూస్తున్నారేతప్ప.. ఎవరూ కాపాడేందుకు ముందుకు రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. తనను పట్టుకుని కర్రలతో తీవ్రంగా కొట్టారని, గొంతు నులిమి హత్య చేసేందుకు కూడా యత్నించారని తెలిపింది. కొంతమంది తనను కాపాడి, ధరించేందుకు వస్త్రాలు ఇచ్చారని తేల్పింది. అదనపు కట్నం కోసం ఇంతటి అమానుషానికి పాల్పడిన తన భర్త, బావ, అత్తమామలను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.