Road Accident: రోడ్డు ప్రమాదంలో కుమార్తె మరణం.. జ్ఞాపకార్ధంగా ఓ తండ్రి ఏం చేశాడో తెలుసా?
కూతురిపై తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు ఓ తండ్రి. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన గారాలపట్టి గుర్తుగా పాఠశాలలో భరతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా కార్ప్ గ్రామానికి చెందిన కౌశల్ పటేల్ కుమార్తె భామిని కార్ప్‌లో హైస్కూల్‌లో ప్లస్ టూ పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం రాయ్‌పూర్‌కి వెళ్లింది..
కాంకేర్, డిసెంబర్ 30: కూతురిపై తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు ఓ తండ్రి. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన గారాలపట్టి గుర్తుగా పాఠశాలలో భరతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా కార్ప్ గ్రామానికి చెందిన కౌశల్ పటేల్ కుమార్తె భామిని కార్ప్‌లో హైస్కూల్‌లో ప్లస్ టూ పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం రాయ్‌పూర్‌కి వెళ్లింది. తాజాగా సెలవులు ప్రకటించడంతో ఇంటికి బయల్దేరింది. 2021, డిసెంబర్ 23న ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో భామిని జీవితాన్ని మృత్యువు కబలించింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమార్తె జ్ఞాపకార్థం కౌశల్ పటేల్ ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.
కుమార్తె మరణించిన 4 నెలల తర్వాత తన ఇంటి అల్మారాలో ఓ డైరీని తండ్రి కౌశల్ గుర్తించాడు. ఆ డైరీలో తన కూతురు చాలా విషయాలు రాసింది. తాను స్కూళ్లో చదివే రోజుల్లో స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో తన కుమార్తె తరచూ భరతమాత వేషం వేస్తుండేదని తెలుసుకున్నాడు. దీంతో భామిని చదివిన స్కూళ్లో భరతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే గ్రామస్థుల సహాయంతో తన కుమార్తె జ్ఞాపకార్ధం భరతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.
దీనిపై తండ్రి కౌశల్ మాట్లాడుతూ.. నా కుమార్తె జ్ఞాపకార్థం పాఠశాలలో తాగునీటి సదుపాయం కల్పిద్దామని అనుకున్నాను. ఉపాధ్యాయుల సూచన మేరకు ఆమెకు ఇష్టమైన భరతమాత విగ్రహం ఏర్పాటు చేశాను. భామిని చెప్పినట్టు ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో ప్రతీయేట పాఠశాలకు వెళ్లి భరతమాత విగ్రహంలో నా కుమార్తెను చూసుకొంటున్నానని ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.