హెయిర్ కట్ వివాదంలో రూ.2 కోట్ల పరిహారం..! సుప్రీం కోర్టు సంచలన తీర్పు
బ్యాడ్ హెయిర్‌కట్‌కు కోటి రూపాయల పరిహారం కోరిన మహిళ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వినియోగదారుల కమిషన్ రూ.2 కోట్లు విధించినా, సుప్రీంకోర్టు దానిని రూ.25 లక్షలకు తగ్గించింది. భావోద్వేగాల ఆధారంగా కాకుండా, పక్కా ఆధారాలు, ITRలు వంటివి సమర్పించకపోతే భారీ పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

మనమందరం అప్పుడప్పుడు సెలూన్లకు వెళ్లి హెయిర్ కట్ చేయించుకుంటాం. కానీ హెయిర్ కట్ సరిగా రాకపోతే కోపం రావడం సహజం. అయితే అదే కారణంగా కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేయవచ్చా? ఈ ప్రశ్నకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఘటన 2018 ఏప్రిల్‌లో జరిగింది. IIM కలకత్తా నుండి మేనేజ్‌మెంట్ డిగ్రీ పొందిన ఒక మహిళ ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌లోని బ్యూటీ సెలూన్‌కు వెళ్లి హెయిర్ కట్ చేయించుకుంది. అయితే సెలూన్ సిబ్బంది తన జుట్టును చాలా చిన్నగా కత్తిరించారని ఆమె ఆరోపించింది. కార్పొరేట్ మేనేజర్‌గా, అలాగే మోడలింగ్ అసైన్‌మెంట్‌లలో పాల్గొంటున్న తనకు ఈ హెయిర్ కట్ వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదని పేర్కొంది. దీనివల్ల జూన్ 2018లో ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఆమె వాదించింది.
జూలై 2018లో ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. 2021 సెప్టెంబర్‌లో కమిషన్ సెలూన్ సేవలో లోపం ఉందని తేల్చి రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. హోటల్ యాజమాన్యం దీనిపై అప్పీల్ చేయగా కేసు మళ్లీ కమిషన్‌కు వెళ్లింది. ఈసారి మహిళ తన క్లెయిమ్‌ను రూ.5.2 కోట్లకు పెంచింది. కమిషన్ మళ్లీ రూ.2 కోట్లు 9 శాతం వడ్డీతో ఇవ్వాలని తీర్పునిచ్చింది. అయితే 2026 ఫిబ్రవరి 6న సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. కోర్టు పరిహారం మొత్తాన్ని రూ.2 కోట్ల నుండి రూ.25 లక్షలకు తగ్గించింది. కోట్ల రూపాయల నష్టాన్ని నిరూపించడానికి సరైన ఆధారాలు అవసరమని స్పష్టం చేసింది.
ఆ మహిళ సమర్పించిన పత్రాలు కేవలం ఫోటోకాపీలు మాత్రమేనని, ఆదాయపు పన్ను రిటర్నులు (ITRలు) లేదా వాస్తవ ఆదాయ తగ్గుదలను చూపించే పక్కా ఆధారాలు సమర్పించలేదని కోర్టు గమనించింది. మోడలింగ్ అవకాశాలు కోల్పోయినట్టు చెప్పిన కంపెనీల ప్రతినిధులను కూడా సాక్ష్యంగా పిలవలేదని వెల్లడైంది. భావోద్వేగం, ఊహాగానాలు లేదా సెంటిమెంట్ ఆధారంగా కోట్ల రూపాయల పరిహారం ఇవ్వలేం. బలమైన, విశ్వసనీయమైన ఆధారాలు తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు వినియోగదారుల హక్కుల కేసుల్లో ఒక ముఖ్యమైన మార్గదర్శకంగా నిలిచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
