దళితయువతి మృతదేహానికి రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరిపిన పోలీసులు

హత్రాస్‌ ఘటన దేశమంతటినీ కదిలించింది.. కన్నీరు పెట్టిస్తోంది.. మృగాళ్ల చేతిలో చిక్కి చిత్రవధ అనుభవించి కన్నుమూసిన దళిత యువతి అంత్యక్రియల్లో కూడా పోలీసుల దాష్టికం కనిపించింది..

  • Balu
  • Publish Date - 12:57 pm, Wed, 30 September 20
దళితయువతి మృతదేహానికి రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరిపిన పోలీసులు

హత్రాస్‌ ఘటన దేశమంతటినీ కదిలించింది.. కన్నీరు పెట్టిస్తోంది.. మృగాళ్ల చేతిలో చిక్కి చిత్రవధ అనుభవించి కన్నుమూసిన దళిత యువతి అంత్యక్రియల్లో కూడా పోలీసుల దాష్టికం కనిపించింది..ఢిల్లీ ఆసుపత్రిలో మరణించిన దళిత యువతి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేటప్పుడు తీవ్ర ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి.. పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితురాలి కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ఫిర్యాదు స్వీకరిచడంలోనే నిర్లక్ష్యమూ, అలసత్వమూ కనబర్చిన పోలీసులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలోనూ అలాగే ప్రవర్తించారు..బాధితురాలి కుటుంబసభ్యులు వద్దని ఎంతగా ప్రాధేయపడినా వినిపించుకోకుండా అధికార దర్పంతో సంప్రదాయానికి విరుద్ధంగా అర్ధరాత్రి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదంటూ బాధితురాలి తల్లి బోరున విలపిస్తున్నారు..
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ అనే ఊళ్లో 20 ఏళ్ల యువతిపై అగ్రకులానికి చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. పొలంలో పనిచేసుకుంటున్న ఆమెను ఆమె చున్నీనే గొంతుకు బిగించి లాక్కేళ్లారు.. చిత్రహింసలకు గురి చేశారు. అత్యాచారం చేశారు. నాలుక కోశారు.. వారి పైశాచిత్వానికి ఆమె వెన్నెముక కూడా విరిగిపోయింది.. తీవ్రంగా గాయపడిన ఆమెను మొదట ఆలీఘర్‌లోని హాస్పిటల్‌లో చేర్చారు.. అక్కడ నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించారు.. పక్షవాతం, శరీరంలోని ప్రధాన భాగాలన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాల పాటు ఆమె చిత్రవధ అనుభవించింది.. ఇక ఈ పాపిష్టిలోకంలో బతకడం ఇష్టం లేక కన్నుమూసింది..
నిన్న రాత్రి ఆమె మృతదేహాన్ని హత్రాస్‌కు తీసుకొచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న సాకు చెప్పి రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరిపించాలన్నారు పోలీసులు.. ఇది తమ సంప్రదాయానికి విరుద్ధమని, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఉదయం అంత్యక్రియలు జరిపిస్తామని కుటుంబసభ్యులు వేడుకున్నారు.. పోలీసులు మాత్రం కుదరదని చెప్పారు.. గ్రామస్తుల నిరసనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా అర్థరాత్రి దాటిన తర్వాత రెండున్నర గంటలప్పుడు పోలీసులు దళిత యువతి మృతదేహానికి అంత్యక్రియులు నిర్వహించారు. తమ అభ్యర్థనను పట్టించుకోకుండా కూతురుని చివరిసారి చూసునీయకుండా చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇంట్లో పెట్టి తాళం వేసి, బంధువులను అడ్డుకుంటూ పోలీసులు మానవహారంలా నిలుచుని మరీ అంత్యక్రియలు జరిపించారని ఆరోపిస్తున్నారు. మీడియావాళ్లను కూడా రానివ్వలేదట! ఇంత హడావుడిగా అంత్యక్రియలు జరిపించాల్సిన అవసరం ఏముందంటున్నారు గ్రామస్తులు.. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కేసులో సత్వరం చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు.