Rat Murder Case: ఎలుకను చంపినందుకు వ్యక్తిపై 30 పేజీల ఛార్టిషీటు.. మూడేళ్ల జైలు శిక్ష?
ఏ ఇంట్లోనైనా ఎలుకలు బెడద సహజం. దాచుకున్న ధాన్యం, విలువైన పేపర్లు ఇతర వస్తువులను పరపరా కొరికి నష్టం కలిగిస్తుంటాయి. దీంతో కొందరు ఎలుకలను చంపేందుకు ఎలకలమందు ఉపయోగిస్తారు. మరికొందరు బోను లాంటిది ఏర్పాటు చేసి పట్టుకుని దూరంగా వదిలిపెడతారు. లేదంటే వాటివల్ల తనకు కలిగిన నష్టాన్ని తలచుకుని దాన్ని కసితీరా చంపిపారేస్తారు. ఐతే ఓ వ్యక్తి ఎలుకను చంపినందుకు..
ఏ ఇంట్లోనైనా ఎలుకలు బెడద సహజం. దాచుకున్న ధాన్యం, విలువైన పేపర్లు ఇతర వస్తువులను పరపరా కొరికి నష్టం కలిగిస్తుంటాయి. దీంతో కొందరు ఎలుకలను చంపేందుకు ఎలకలమందు ఉపయోగిస్తారు. మరికొందరు బోను లాంటిది ఏర్పాటు చేసి పట్టుకుని దూరంగా వదిలిపెడతారు. లేదంటే వాటివల్ల తనకు కలిగిన నష్టాన్ని తలచుకుని దాన్ని కసితీరా చంపిపారేస్తారు. ఐతే ఓ వ్యక్తి ఎలుకను చంపినందుకు అతనిపై పోలీసులు 30 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటు చేసుకుంది. ఎలుకను చంపితే ఎవరైనా జైలుకు పంపిస్తారా అంటూ ప్రతి ఒక్కరూ ముక్కుమీద వేలువేసుకుంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఓ ఎలుకను ఇటుకతో కొట్టి, కాలువలో ముంచి చంపాడు. ఈ మొత్తం సంఘటనను జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ చిత్రీకరించి మనోజ్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విచిత్ర ఘటన వెలుగులోకొచ్చింది. ఎలుక పట్ల అతను క్రూరంగా వ్యవహరించాడని శర్మ ఆరోపించాడు. బాధిత ఎలుకను కాపాడే ప్రయత్నం చేయగా అది ఊపిరాడక మృతి చెందిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక, మీడియాలో విడుదలైన వీడియోలు, సంబంధిత వివిధ విభాగాల నిపుణుల అభిప్రాయాలతో సేకరించిన ఆధారాల ఆధారంగా నిందితుడు మనోజ్‌పై 30 పేజీల ఛార్జిషీట్‌ను సిద్ధం చేసినట్లు సీఏ మనోజ్ కుమార్ పేర్కొన్నాడు. జంతువులను చంపడం లేదా గాయపరచడం, జంతువుల పట్ల క్రూరత్వంగా వ్యవహరించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా పోలీసులు ఎలుక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ)కి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. తీవ్రంగా కొట్టడం మూలంగా ఎలుక ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, లివర్ ఇన్‌ఫెక్షన్ వచ్చి ఊపిరాడక ఎలుక మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఈ కేసులో నిందితుడికి స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అటవీ శాఖ చట్టం ప్రకారం ఎలుకను చంపడం నేరంగా పరిగణించబడుతుందని బుదౌన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) అశోక్ కుమార్ సింగ్ తెలిపారు.
జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం నేరం రుజువైతే రూ.10 నుంచి రూ.2000 వరకు జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని, సెక్షన్ 429 ప్రకారం ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా రెండూ విధించే అవకాశం కూడా లేకపోలేదని న్యాయనిపుణులు అంటున్నారు.
ఎలుకలు, కాకులు, పాములు వంటి హానికర జీవులను చంపితే నేరం కాదు. ఈ కేసులో నా కొడుకుకి శిక్ష పడితే నిత్యం కోళ్లు, మేకలను చంపే వారందరిపైనా చర్యలు తీసుకోవాలి. చేపలు, ఎలుకలను చంపే మందులను విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ నిందితుడి తండ్రి మధుర ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. నిత్యం హత్యలు, మానభంగాలు, దోపిడీలు లెక్కకు మించి జరుగుతుంటే యూపీ ప్రభుత్వానికి అవేమీ పెద్ద నేరాలుగా కనిపించడం లేదా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.