Viral: కడుపు నొప్పి తట్టుకోలేక సొంతగా ఆపరేషన్ చేసుకోబోయాడు.. కట్ చేస్తే..
యూట్యూబ్ వీడియోలు చూసి తనకు తాను శస్త్రచికిత్స చేసుకునేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. సర్జరీ విఫలమై చివరకు ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ మథురలో జరిగింది. ప్రస్తుతం మథుర జిల్లా ఆస్పత్రిలో రాజబాబు చికిత్స పొందుతున్నాడు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

సోషల్ మీడియా మనుషులకు ఎంతమేర ఉపయుక్తం అన్నది తెలియదు కానీ.. చాలా ప్రమాదకరంగా అయితే మారింది. అందుకు ఈ ఘటనను ప్రధాన ఉదాహారణగా చెప్పొచ్చు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి.. యూట్యూబ్ చూసి తనకు తానే ఆపరేషన్ చేసుకోడానికి ప్రయత్నించి ప్రాణాప్రాయంలో పడ్డాడు. మథుర సున్ రాఖ్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల రాజా బాబు విపరీతమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. ఎంతమంది డాక్టర్ల వద్దకు వెళ్లినా.. ఎన్ని మందులు వాడిని నొప్పి అయితే తగ్గలేదు. దీంతో నొప్పి తట్టుకోలేక యూట్యూబ్ వీడియోలు చూసి.. తనకు తానే ఆపరేషన్ చేసుకోవాలని డిసైడయ్యాడు. ఆపరేషన్ కోసం కావాల్సిన సర్జికల్ బ్లేడ్‌లు, కుట్లు వేసుకునే పరికరాలు, మత్తు ఇంజెక్షన్లు ఇలా సరంజామా అంతా మథురకు వెళ్లి తెచ్చుకున్నాడు.
బుధవారం ఒక రూమ్ తీసుకుని అక్కడ తనకు తానే సర్జరీ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అంతా ఫిక్స్ చేసుకున్న తర్వాత తొలుత మత్తు ఇంజెక్షన్ చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కడుపు కుడివైపున 7 అంగుళాల గాటు పెట్టాడు. అది అనుకున్నదాని కంటే ఎక్కువ తెగడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో భయంతో వెంటనే సూది, దారంతో కుట్లు వేసుకునేందుకు యత్నించాడు.
అయితే ఈ లోపే మత్తు ఇంజెక్షన్ ప్రభావం తగ్గిపోయి నొప్పి తీవ్రత పెరిగింది. రక్తస్రావం ఆగకపోవడంతో ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి జరిగిన విషయాన్నంతా చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. రాజబాబును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందున్న రాజబాబు.. కోలుకుంటున్నట్లు సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..