New Rule: హెల్మెట్ లేకుంటే పెట్రోల్ విక్రయించరు.. ఆ రాష్ట్రంలో కొత్త రూల్..!
హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చే వారికి పెట్రోల్ విక్రయించకూడదంటూ పెట్రోల్ బంకుల నిర్వాహకులకు యూపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ద్విచక్రవాహనంలో వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకున్నా ఈ నిబంధన వర్తిస్తుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారిలో అత్యధికులు ద్విచక్రవాహనదారులే ఉన్నారు. వీరి మరణానికి హెల్మెట్ లేకపోవడమే కారణం కావడంతో యూపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్‌ను విక్రయించకూడదని (No Helmet No Petrol Rule) కొత్త నిబంధనను తీసుకువచ్చింది. దీనిపై పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు, జిల్లా అధికారులకు యూపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేసేలా చూడాలంటూ యూపీ రవాణా శాఖ కమిషనర్ బ్రజేష్ నారాయణ సింగ్ యూపీలోని 75 జిల్లాల కలెక్టర్లు, ప్రాంతీయ రవాణా శాఖ అధికారులకు జనవరి 8న అధికారిక లేఖలు పంపారు. ద్విచక్రవాహనం వెనక సీటులో కూర్చునే వారికి సైతం హెల్మెట్ నిబంధనలు వర్తించనున్నాయి. వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించేందుకు నో హెల్మెట్ నో పెట్రోల్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఉత్తర్వులు జనవరి 26 తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
దీని ప్రకారం ఏటా యూపీ రాష్ట్రంలో 25-26 వేల మంది రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో ద్విచక్రవాహనాల ప్రమాదాలే అధికం. ఈ దుర్ఘటనలకు హెల్మెట్ ధరించకపోవడాన్నే కారణంగా గుర్తించడంతో కొత్త నిబంధనను ప్రతిపాదించారు. రోడ్డు ప్రమాదల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల అధికారులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. మరీ ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు. హెల్మెట్‌ను తప్పనిసరి చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో యేటా సంభవిస్తున్న మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించొచ్చని యూపీ ప్రభుత్వం భావిస్తోంది.
యూపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు హెల్మెట్ లేని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ అమ్మకాన్ని నిలిపివేసే దిశగా చర్యలు తీసుకోవాలని లక్నో జిల్లా అధికార యంత్రాంగం అదేశాలు జారీ చేసింది. దీంతో లక్నో నగర వ్యాప్తంగా జనవరి 26 నుంచి ఈ షరతును కఠినంగా అమలు చేయనున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు యూపీ రవాణా శాఖ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రవాణా శాఖ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా.. మరికొందరు ఈ కఠిన నిబంధన దుర్వినియోగానికి గురైయ్యే అవకాశముందని చెబుతున్నారు.